సంక్షిప్త వార్తలు(5)

ఈ రంజీ సీజన్‌లో ఘోరంగా విఫలమైన హైదరాబాద్‌.. ఆఖరి మ్యాచ్‌లో పరువు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Published : 25 Jan 2023 01:40 IST

హైదరాబాద్‌ 247/4

ఈనాడు, హైదరాబాద్‌: ఈ రంజీ సీజన్‌లో ఘోరంగా విఫలమైన హైదరాబాద్‌.. ఆఖరి మ్యాచ్‌లో పరువు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. మంగళవారం ఉప్పల్‌లో దిల్లీతో ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌.. ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 247 పరుగులు సాధించింది. కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (23), రాహుల్‌ రాదేశ్‌ (41) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. అయితే మొదట తన్మయ్‌.. అనంతరం రాహుల్‌, నితేశ్‌రెడ్డి (0) ఔటవడంతో హైదరాబాద్‌ ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో రోహిత్‌ రాయుడు (90 బ్యాటింగ్‌; 197 బంతుల్లో 8×4, 1×6), చందన్‌ సహాని (67; 126 బంతుల్లో 5×4, 3×6) నాలుగో వికెట్‌కు 132 పరుగులు జతచేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. దిల్లీ బౌలర్లలో దివిజ్‌ మెహ్రా (2/38) రాణించాడు.


ఆంధ్రకు ఆధిక్యం

ఈనాడు, విజయనగరం: అస్సాంతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి రోజే ఆధిక్యం సంపాదించింది.పేసర్లు మాధవ రాయుడు (4/12), శశికాంత్‌ (3/34)ల దెబ్బకు అస్సాం చేతులెత్తేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 37.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. రిషవ్‌ దాస్‌ (30) టాప్‌ స్కోరర్‌. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 3 వికెట్లకు 160 పరుగులు సాధించింది. కెప్టెన్‌ హనుమ విహారి (80; 123 బంతుల్లో 11×4, 1×6), అభిషేక్‌రెడ్డి (75; 129 బంతుల్లో 11×4) రెండో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఆంధ్ర 47 పరుగుల ఆధిక్యంతో ఉంది. రికీ భుయ్‌ (1 బ్యాటింగ్‌), కరణ్‌ షిండే (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.


మెయిన్‌ డ్రాకు ప్రియాంశు

జకార్త్తా: ఇండోనేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ ఆటగాడు ప్రియాంశు రజావత్‌ మెయిన్‌ డ్రాలో అడుగుపెట్టాడు. మంగళవారం పురుషుల సింగిల్స్‌ తొలి అర్హత రౌండ్లో ప్రియాంశు 21-17, 21-19తో పొపోవ్‌ (ఫ్రాన్స్‌)పై, రెండో రౌండ్లో 21-10, 13-21, 21-13తో స్వెండెన్సెన్‌ (డెన్మార్క్‌)పై గెలిచి మెయిన్‌ డ్రా చేరుకున్నాడు. సాయి ప్రణీత్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించలేకపోయాడు. తొలి రౌండ్లో 21-18, 9-21, 21-15తో ఇమాన్యుయెల్‌ రుంబే (ఇండోనేసియా)పై గెలిచిన సాయి ప్రణీత్‌.. రెండో రౌండ్లో 18-21, 19-21తో జూన్‌ వీ (మలేసియా) చేతిలో ఓడాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి అర్హత రౌండ్లో రోహన్‌ కపూర్‌- సిక్కిరెడ్డి జోడీ 21-15, 21-18తో లీ వీ- చాంగ్‌ చింగ్‌ (చైనీస్‌ తైపీ) జంటపై నెగ్గి మెయిన్‌ డ్రా చేరుకుంది. సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప 20-22, 17-21తో హిదాయతుల్లా- ఐస్యా పుత్రి (ఇండోనేసియా)ల చేతిలో ఓడారు.


ఆస్ట్రేలియా పన్నెండోసారి

ప్రపంచకప్‌ హాకీ సెమీస్‌లోకి

భువనేశ్వర్‌: ఆధిపత్యాన్ని చాటుకుంటూ టైటిల్‌ ఫేవరెట్‌ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో వరుసగా పన్నెండోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం క్వార్టర్స్‌లో ఆ జట్టు 4-3 గోల్స్‌తో స్పెయిన్‌ను ఓడించింది. హేవార్డ్‌ (33వ, 37వ) రెండు గోల్స్‌తో ఆసీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫ్లయిన్‌ (30వ), కెప్టెన్‌ జాలెస్కీ (32వ) చెరో గోల్‌ చేశారు. స్పెయిన్‌ జట్టులో గిస్పెర్ట్‌ (20వ), రెకాసెన్స్‌ (24వ) మిరాల్స్‌ (41వ) బంతిని లక్ష్యానికి చేర్చారు. నాలుగు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా స్పెయిన్‌కు పెనాల్టీ స్ట్రోక్‌ దక్కడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. కానీ మిరాల్స్‌ స్కోరు చేయడంలో విఫలం కావడంతో స్పెయిన్‌కు ఓటమి తప్పలేదు.


ఆసీస్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఎందుకు ఆడట్లేదు?: క్లార్క్‌

మెల్‌బోర్న్‌: భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఎందుకు వార్మప్‌ మ్యాచ్‌ ఆడట్లేదని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ప్రశ్నించాడు. సన్నాహక మ్యాచ్‌ లేకపోవడం ఆసీస్‌ ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని అతనన్నాడు. ‘‘భారత్‌తో తొలి టెస్టు ముందు ఆస్ట్రేలియా టూర్‌ మ్యాచ్‌ ఆడట్లేదు. ఇది మా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా పిచ్‌లకు భారత్‌లో ఆడటానికి ఎంతో తేడా ఉంది. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే స్పిన్‌ ఎదుర్కోవాలి. రివర్స్‌ స్వింగ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ఇదో సవాల్‌. ఒక్కోసారి మూడు రోజుల్లో కూడా మ్యాచ్‌ ముగిసిపోతుంది’’ అని క్లార్క్‌ అన్నాడు. తాజాగా మాజీ వికెట్‌కీపర్‌ ఇయాన్‌ హీలీ కూడా క్లార్క్‌ మాదిరే తమ జట్టు వార్మప్‌ మ్యాచ్‌ ఆడకపోవడాన్ని తప్పుబట్టాడు. కానీ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ భిన్నంగా స్పందించాడు. ఇటీవల కొన్ని పర్యటనల్లో సన్నాహక మ్యాచ్‌లు ఆడకుండానే ఆస్ట్రేలియా నేరుగా బరిలో దిగిందని.. సన్నద్ధత పేరుతో పర్యటనను పొడిగించాలనుకోవట్లేదని అన్నాడు. ఫిబ్రవరి 9న భారత్‌-ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్‌ మొదలు కానుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు