సంక్షిప్త వార్తలు (3)

రోహిత్‌ రాయుడు (153 నాటౌట్‌; 295 బంతుల్లో 14×4, 3×6) అజేయ సెంచరీతో సత్తాచాటడంతో దిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.

Updated : 26 Jan 2023 02:53 IST

రోహిత్‌ రాయుడు అజేయ శతకం
హైదరాబాద్‌ 355.. దిల్లీ 223/5

ఈనాడు, హైదరాబాద్‌: రోహిత్‌ రాయుడు (153 నాటౌట్‌; 295 బంతుల్లో 14×4, 3×6) అజేయ సెంచరీతో సత్తాచాటడంతో దిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్‌ గ్రూపు-బి మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 247/4తో బుధవారం ఉదయం ఆట కొనసాగించిన హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 124 ఓవర్లలో 355 పరుగులకు ఆలౌటైంది. బుధవారం రోహిత్‌ రాయుడు ఒక్కడే ఒంటరి పోరాటం చేసి హైదరాబాద్‌కు మెరుగైన స్కోరు అందించాడు. దిల్లీ బౌలర్లలో హర్షిత్‌ రానా (3/63), దివిజ్‌ మెహ్రా (3/45), ప్రాన్షు (2/74), హృతిక్‌ షోకీన్‌ (2/101) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో 5 వికెట్లకు 223 పరుగులు చేసింది. కెప్టెన్‌ యశ్‌ ధూల్‌ (72; 74 బంతుల్లో 16×4), ఆయుష్‌ బదోని (78 బ్యాటింగ్‌; 85 బంతుల్లో 11×4, 2×6) అర్ధ సెంచరీలతో సత్తాచాటారు. హైదరాబాద్‌ బౌలర్లు అజయ్‌దేవ్‌ గౌడ్‌ (2/42), అనికేత్‌రెడ్డి (2/77) సఫలమయ్యారు. ప్రస్తుతం దిల్లీ మరో 132 పరుగులు వెనుకంజలో ఉంది.


గెలుపు దిశగా ఆంధ్ర

ఈనాడు, విజయనగరం: అస్సాంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ  ఎలీట్‌ గ్రూపు-బి మ్యాచ్‌లో ఆంధ్ర గెలుపు దిశగా పయనిస్తోంది. ఆంధ్ర బౌలర్ల విజృంభణతో ఓటమి అంచుల్లోకి వెళ్లిన అస్సాం గురువారం మ్యాచ్‌ను కోల్పోవడం లాంఛనమే. ఓవర్‌నైట్‌ స్కోరు 160/3తో రెండో రోజు ఉదయం ఆట కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 112 ఓవర్లలో 361 పరుగులకు ఆలౌటైంది. కరణ్‌ షిండే (90 నాటౌట్‌; 211 బంతుల్లో 1×4), షోయబ్‌ఖాన్‌ (42; 57 బంతుల్లో 7×4) సత్తాచాటి ఆంధ్రకు 248 పరుగుల ఆధిక్యం అందించారు. బుధవారం ఆట ముగిసే సమయానికి అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 5 వికెట్లకు 62 పరుగులు చేసింది. లలిత్‌ మోహన్‌ (2/13), షోయబ్‌ఖాన్‌ (1/14), మాధవ రాయుడు (1/13) మెరిశారు. మరో రెండ్రోజుల ఆట మిగిలివున్న ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే అస్సాం మరో 186 పరుగులు సాధించాలి.


టైసన్‌పై అత్యాచార ఆరోపణలు

న్యూయార్క్‌: అమెరికా బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. 90వ దశకం ఆరంభంలో తనపై టైసన్‌ అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ అతడిపై దావా వేసింది. న్యూయార్క్‌లోని నైట్‌ క్లబ్‌లో తనను కలిసిన టైసన్‌.. ఆ తర్వాత కారులో అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. దీని వల్ల తాను శారీరకంగా, మానసికంగా గాయపడ్డానని.. తనకు జరిగిన నష్టానికి టైసన్‌ 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆమె దావా వేసింది. 1992లో డిజైర్‌ వాషింగ్టన్‌ అనే మహిళపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన టైసన్‌.. మూడేళ్ల జైలు శిక్షను అనుభవించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు