తొమ్మిదైనా దక్కేనా?

హాకీ ప్రపంచకప్‌లో కనీసం క్వార్టర్స్‌ కూడా చేరకుండానే తీవ్రంగా నిరాశపర్చిన భారత పురుషుల జట్టు ఇప్పుడు టోర్నీని ఏ స్థానంతో ముగిస్తుందో చూడాలి.

Published : 26 Jan 2023 02:09 IST

నేడు జపాన్‌తో భారత్‌ ఢీ
హాకీ ప్రపంచకప్‌

రవుర్కెల: హాకీ ప్రపంచకప్‌లో కనీసం క్వార్టర్స్‌ కూడా చేరకుండానే తీవ్రంగా నిరాశపర్చిన భారత పురుషుల జట్టు ఇప్పుడు టోర్నీని ఏ స్థానంతో ముగిస్తుందో చూడాలి. గురువారం 9 నుంచి 16 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో 2018 ఆసియా క్రీడల విజేత జపాన్‌తో టీమ్‌ఇండియా తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే 13 నుంచి 16 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో జట్టు పోటీపడాల్సి ఉంటుంది. ఈ టోర్నీ చరిత్రలో 1986 లండన్‌ ప్రపంచకప్‌లో భారత్‌ అత్యంత పేలవంగా 12వ స్థానంలో నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో క్రాస్‌ ఓవర్స్‌ పోరులో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓడిన సంగతి తెలిసిందే.

సెమీస్‌లో జర్మనీ, నెదర్లాండ్స్‌: జర్మనీ, నెదర్లాండ్స్‌ ప్రపంచకప్‌ సెమీస్‌లో అడుగుపెట్టాయి. బుధవారం క్వార్టర్స్‌లో జర్మనీ పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. మొదట నిర్ణీత సమయం ముగిసే సరికి మ్యాచ్‌లో స్కోరు 2-2తో సమమైంది. మరో రెండు నిమిషాల ఆట ఉందనగా 0-2తో వెనకబడ్డ జర్మనీకి పరాజయం తప్పదనిపించింది. కానీ సోదరులు మ్యాట్స్‌ గ్రాంబుష్‌, టామ్‌ వరుసగా 58, 59వ నిమిషాల్లో చెరో గోల్‌తో జట్టును కాపాడారు. కెప్టెన్‌ మ్యాట్స్‌ ఫీల్డ్‌ గోల్‌ కొట్టగా, అతని తమ్ముడు టామ్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను సద్వినియోగం చేశాడు. అనంతరం షూటౌట్లో జర్మనీ పైచేయి సాధించింది. మరో క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌ 5-1తో దక్షిణ కొరియాపై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో అంపైర్‌ బెన్‌ జోంట్‌గన్‌ ముఖానికి అనూహ్య రీతిలో గాయమైంది. 28వ నిమిషంలో కొరియా ఆటగాడు జంగ్‌ డ్రాగ్‌ఫ్లిక్‌ చేసిన బంతి.. నెదర్లాండ్స్‌ ఆటగాడి స్టిక్‌కు తగిలి పక్కనే ఉన్న బెన్‌ ముఖానికి గట్టిగా తగిలింది. నొప్పితో కుప్పకూలిన అతణ్ని వైద్య చికిత్సల కోసం మైదానం బయటకు తీసుకెళ్లారు. అతని స్థానంలో రిజర్వ్‌ అంపైర్‌  రఘుప్రసాద్‌ బాధ్యతలు కొనసాగించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు