రూ.4670 కోట్లు

మహిళల ఐపీఎల్‌ను తక్కువగా అంచనా వేసిన వాళ్లందరికీ దిమ్మదిరిగే షాక్‌! ఆ లీగ్‌లో జట్లను దక్కించుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు పోటాపోటీగా తలపడ్డాయి.

Published : 26 Jan 2023 02:09 IST

మహిళల ఐపీఎల్‌ జట్లకు భారీ ధర
అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీకి రూ.1289 కోట్లు
టోర్నీకి ‘మహిళల ప్రిమియర్‌ లీగ్‌’ పేరు ఖరారు

మహిళల ఐపీఎల్‌ను తక్కువగా అంచనా వేసిన వాళ్లందరికీ దిమ్మదిరిగే షాక్‌! ఆ లీగ్‌లో జట్లను దక్కించుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు పోటాపోటీగా తలపడ్డాయి. అయిదు జట్లు కలిపి ఏకంగా రూ.4669.99 కోట్లకు అమ్ముడుబోవడం.. కేవలం ఒక్క అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ రూ.1289 కోట్ల ధర పలకడం అనూహ్యం.

హిళల ఐపీఎల్‌ నిర్వహిస్తే ఎవరు చూస్తారు? అందులో ఫ్రాంఛైజీలను కొనడానికి ఎవరు ముందుకొస్తారు?.. అంటూ చాలామంది సందేహించారు కానీ.. ఈ లీగ్‌లోని అయిదు ఫ్రాంఛైజీల కోసం నిర్వహించిన బిడ్డింగ్‌ ప్రక్రియతోనే టోర్నీ స్థాయి తక్కువేమీ కాదని అర్థమైపోయింది. అయిదు జట్ల అమ్మకంతో బీసీసీఐ ఏకంగా రూ.4669.99 కోట్లు ఖాతాలో వేసుకుంది. అయిదు జట్లలో మూడింటిని పురుషుల ఐపీఎల్‌ను నడిపిస్తున్న సంస్థలే సొంతం చేసుకోవడం విశేషం. పురుషుల ఐపీఎల్‌ జట్టును సొంతం చేసుకోవడంలో విఫలమైన అదాని స్పోర్ట్స్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. అహ్మదాబాద్‌ కేంద్రంగా మహిళల ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. ఇందుకోసం ఆ సంస్థ రూ.1289 కోట్లు వెచ్చించింది. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఒక జట్టుకు పలికిన అత్యధిక ధర ఇదే. ఈ లీగ్‌లో ప్రతి జట్టు ధర కనీసం రూ.500 కోట్లు పలుకుతుందని.. గరిష్ట ధర రూ.800-900 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేయగా.. అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ రేటు   రూ.1300 కోట్లకు చేరువ కావడం అనూహ్యం. లీగ్‌లో కనిష్ట ధర పలికింది లఖ్‌నవూ ఫ్రాంఛైజీ. దాన్ని కాప్రి గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ రూ.757 కోట్లకు దక్కించుకుంది. ముంబయి, బెంగళూరు, దిల్లీ ఫ్రాంఛైజీలను పురుషుల ఐపీఎల్‌ జట్లను నడుపుతున్న ఇండియావిన్‌ స్పోర్ట్స్‌ (రూ.912.99 కోట్లకు), రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ (రూ.901 కోట్లకు), జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్‌ (రూ.810 కోట్లకు) సొంతం చేసుకున్నాయి. బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తయిన సందర్భంలోనే టోర్నీకి ‘మహిళల ప్రిమియర్‌ లీగ్‌’ (డబ్ల్యూపీఎల్‌) అనే పేరును బీసీసీఐ ఖరారు చేసింది. మహిళల లీగ్‌ మీడియా హక్కుల అమ్మకంతో బీసీసీఐ ఇప్పటికే రూ.951 కోట్ల ఆదాయం ఆర్జించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్‌ తొలి సీజన్‌ మార్చిలో మొదలవుతుంది. వచ్చే నెలలో క్రికెటర్ల వేలం నిర్వహించనున్నారు.

హైదరాబాద్‌కు దక్కని అవకాశం: దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ఫ్రాంఛైజీకి కేంద్రంగా మారలేకపోయింది. పురుషుల ఐపీఎల్‌తో పాటు వివిధ క్రీడల లీగ్స్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా జట్లున్నాయి. కానీ డబ్ల్యూపీఎల్‌లో జట్లను దక్కించుకున్న సంస్థలు ఈ నగరాన్ని కేంద్రంగా ఎంచుకోలేదు. పురుషుల ఐపీఎల్‌లో భాగమైన చెన్నై, కోల్‌కతా, జైపుర్‌, మొహాలి కూడా మహిళల లీగ్‌లో అవకాశం దక్కించుకోలేకపోయాయి.


ఏ ఫ్రాంఛైజీ ఎంత?

అహ్మదాబాద్‌ (అదాని స్పోర్ట్స్‌లైన్‌) రూ.1289 కోట్లు

ముంబయి (ఇండియావిన్‌ స్పోర్ట్స్‌) రూ.912.99 కోట్లు

బెంగళూరు (రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌) రూ.901 కోట్లు

దిల్లీ (జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్‌ క్రికెట్‌) రూ.810 కోట్లు

లఖ్‌నవూ (కాప్రి గ్లోబల్‌ హోల్డింగ్స్‌) రూ.757 కోట్లు


‘‘బీసీసీఐ ఈ లీగ్‌కు మహిళల ప్రిమియర్‌ లీగ్‌ అని నామకరణం చేసింది. ఇక ప్రయాణం మొదలవుతుంది. 2008లో పురుషుల ఐపీఎల్‌ ఆరంభమైనప్పటి కంటే ఇప్పుడు మహిళల లీగ్‌ ఫ్రాంఛైజీలకు అధిక బిడ్డింగ్‌ దక్కడం చరిత్రాత్మకం. మహిళల క్రికెట్లో విప్లవానికి, రాబోయే రోజుల్లో మహిళ క్రికెటర్లే కాక మొత్తంగా క్రీడల్లో కొత్త పరిణామం చూడబోతున్నామనడానికి ఇది సూచిక. మహిళల క్రికెట్లో అవసరమైన మార్పులకు ఈ లీగ్‌ నాంది పలుకుతుంది. లీగ్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం దక్కుతుంది’’

జై షా, బీసీసీఐ కార్యదర్శి

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు