సబలెంక, రిబకినా సై

ఈ ఏడాది వరుస విజయాలతో సాగుతోన్న సబలెంక.. అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడిస్తూ దూసుకెళ్తోన్న రిబకినా తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరారు.

Updated : 27 Jan 2023 03:07 IST

ఫైనల్లో ప్రవేశం

సెమీస్‌లో అజరెంకా, లినట్‌ ఓటమి

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

ఈ ఏడాది వరుస విజయాలతో సాగుతోన్న సబలెంక.. అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడిస్తూ దూసుకెళ్తోన్న రిబకినా తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరారు. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో రాణిస్తూ, ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. తుది సమరానికి అర్హత సాధించిన ఈ అమ్మాయిలు టైటిల్‌ పోరుకు సై అంటున్నారు. సెమీస్‌లో మాజీ నంబర్‌వన్‌ అజరెంకాకు చెక్‌ పెట్టి రిబకినా, అన్‌సీడెడ్‌ లినట్‌ జోరుకు కళ్లెం వేసి సబలెంక ముందంజ వేశారు. ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరడం సబలెంకకు ఇదే మొదటిసారి. ఆఖరి పోరు శనివారమే.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్‌ రాబోతుంది. అరీనా సబలెంక, ఎలెనా రిబకినా తొలిసారి ఈ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం సెమీస్‌లో బెలారస్‌ భామ సబలెంక 7-6 (7-1), 6-2 తేడాతో మాగ్డా లినట్‌ (పోలండ్‌)పై విజయం సాధించింది. ఈ ఏడాది ఓటమన్నదే లేకుండా సాగుతోన్న అయిదో సీడ్‌ సబలెంకకు ఇది వరుసగా పదో విజయం. 24 ఏళ్ల ఆమె.. సంచలన ప్రదర్శనతో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరిన లినట్‌కు ఇంటిదారి చూపించింది. గంటా 33 నిమిషాల్లో వరుస సెట్లలో ప్రత్యర్థి కథ ముగించింది. తొలి సెట్‌ను లినట్‌ మెరుగ్గా ఆరంభించింది. తొలి గేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించిన ఆమె, ఆపై 2-0తో నిలిచింది. లయ అందుకునేందుకు కాస్త సమయం తీసుకున్న సబలెంక వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 3-2తో పైచేయి సాధించింది. అక్కడి నుంచి పోరు హోరాహోరీగా సాగి టైబ్రేకర్‌కు దారితీసింది. అందులో సబలెంక చెలరేగింది. ప్రత్యర్థి కేవలం ఒక్క పాయింట్‌ మాత్రమే సాధించగలిగింది. రెండో సెట్‌లోనూ సబలెంకకు ఎదురు లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో ఆమె 6 ఏస్‌లు, 33 విన్నర్లు సంధించింది.

దూకుడు కొనసాగిస్తూ..: వింబుల్డన్‌ ఛాంపియన్‌ రిబకినా రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. సెమీస్‌లో ఈ 22వ సీడ్‌ కజకిస్థాన్‌ అమ్మాయి 7-6 (7-4), 6-3తో 24వ సీడ్‌ అజరెంకా (బెలారస్‌)పై గెలిచింది. మూడో రౌండ్లో 13వ సీడ్‌ కొలిన్స్‌, ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ స్వైటెక్‌, క్వార్టర్స్‌లో 17వ సీడ్‌ ఓస్టాపెంకోను ఓడించిన రిబకినా సెమీస్‌లోనూ అదే దూకుడు కొనసాగించింది. ఎప్పటిలాగే వేగవంతమైన సర్వీస్‌లతో ప్రత్యర్థిని హడలెత్తించింది. ఏస్‌లతో విరుచుకుపడింది. అద్భుత ప్రదర్శనతో సెమీస్‌ వరకూ వచ్చిన అజరెంకాకు కీలక పోరులో నిరాశ తప్పలేదు. 23 ఏళ్ల ప్రత్యర్థి ధాటికి 33 ఏళ్ల ఆమె నిలవలేకపోయింది. రష్యాలో పుట్టి కజకిస్థాన్‌ తరపున ఆడుతున్న రిబకినా వరుస సెట్లలో అజరెంకా కథ ముగించింది. డబుల్‌ ఫాల్ట్‌తో మ్యాచ్‌ మొదలెట్టిన రిబకినా.. అజరెంకా నుంచి పోటీని సమర్థంగా తట్టుకుంది. తొలి సెట్‌ అయిదో గేమ్‌లో సర్వీస్‌ బ్రేక్‌ చేసిన అజరెంకా 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన రిబకినా వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 5-3తో దూసుకెళ్లింది. సెట్‌ పాయింట్‌ను కాపాడుకుని వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి అజరెంకా 5-5తో పోటీలో నిలిచింది. చివరకు 6-6తో స్కోరు సమం కావడంతో టైబ్రేకర్‌ అనివార్యమైంది. అందులో రిబకినా పైచేయి సాధించింది. ఈ ఉత్సాహంతో రెండో సెట్లో మరింత రెచ్చిపోయింది. విన్నర్లతో సత్తాచాటింది. మూడు, ఏడు, తొమ్మిదో గేమ్‌ల్లో సర్వీస్‌ బ్రేక్‌ చేసి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆమె 9 ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది. గత మూడు గ్రాండ్‌స్లామ్‌ల్లో ఆమెకిది రెండో ఫైనల్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు