భారత్‌ 8 జపాన్‌ 0

పురుషుల హాకీ ప్రపంచకప్‌లో ఫైనల్‌ ఆశలు తెరపడ్డాక భారత జట్టు చెలరేగిపోయింది. గురువారం గోల్స్‌ వర్షం కురిపించింది.

Published : 27 Jan 2023 02:44 IST

రవుర్కెలా: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో ఫైనల్‌ ఆశలు తెరపడ్డాక భారత జట్టు చెలరేగిపోయింది. గురువారం గోల్స్‌ వర్షం కురిపించింది. వర్గీకరణ మ్యాచ్‌లో 8-0తో జపాన్‌ను చిత్తుగా ఓడించింది. భారత్‌ తరఫున అభిషేక్‌ (36వ, 44వ), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (46వ, 59వ) చెరో రెండు గోల్స్‌ కొట్టగా.. మన్‌దీప్‌ సింగ్‌ (33వ), వివేక్‌ సాగర్‌ (40వ), మన్‌ప్రీత్‌ సింగ్‌ (59వ), సుఖ్‌జీత్‌ సింగ్‌ (60వ) తలో గోల్‌ సాధించారు. భారత్‌ ఇక 9-12 వర్గీకరణ మ్యాచ్‌లో శనివారం దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. క్వార్టర్స్‌ బెర్తును నిర్ణయించే క్రాస్‌ఓవర్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమితో భారత జట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

నేడు సెమీస్‌ పోరు

భువనేశ్వర్‌: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. పూల్‌ దశను దాటుకుని.. క్రాస్‌ ఓవర్స్‌ను తట్టుకుని.. క్వార్టర్స్‌ను అధిగమించి.. ఇప్పుడు నాలుగు మేటి జట్లు సెమీస్‌ పోరుకు సిద్ధమయ్యాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఫైనల్‌ కోసం యుద్ధం జరుగుతుంది. శుక్రవారం తొలి సెమీస్‌లో నంబర్‌వన్‌ ఆస్ట్రేలియాతో నాలుగో ర్యాంకర్‌ జర్మనీ తలపడుతుంది. వరుసగా రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్న బెల్జియం, నెదర్లాండ్స్‌ మరో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. జర్మనీ క్రాస్‌ ఓవర్‌లో గెలిచి క్వార్టర్స్‌ చేరి, ఆపై ముందంజ వేయగా.. మిగతా మూడు నేరుగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టి, అనంతరం సెమీస్‌ చేరాయి. జర్మనీతో మ్యాచ్‌లో ఆసీస్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మూడో సారి టైటిల్‌పై కన్నేసిన జర్మనీ 2010 తర్వాత తొలిసారి సెమీస్‌ చేరింది. ఇంగ్లాండ్‌తో క్వార్టర్స్‌లో ఆఖరి రెండు నిమిషాల్లో రెండు గోల్స్‌తో గట్టెక్కి, అనంతరం పెనాల్టీ షూటౌట్లో ఆ జట్టు గెలిచింది. మరోవైపు వరుసగా 12వ సారి సెమీస్‌ ఆడబోతున్న ఆస్ట్రేలియా పటిష్ఠంగా కనిపిస్తోంది. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెల్జియం, గత రెండు సార్లు రన్నరప్‌ నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్‌ ఆసక్తి రేపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని