కొత్త కలలకు ఆరంభం

దేశంలో ఎంతోమంది క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలవడమే తన జీవితంలో అతిపెద్ద ఘనత అని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తెలిపింది.

Published : 28 Jan 2023 01:56 IST

‘ఈనాడు’తో సానియా మీర్జా
ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో ఎంతోమంది క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలవడమే తన జీవితంలో అతిపెద్ద ఘనత అని భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తెలిపింది. క్రీడాకారిణిగా టెన్నిస్‌కు వీడ్కోలు పలికినా.. ఆటకు దూరంగా ఉండలేనని చెప్పింది. త్వరలోనే కొత్త పాత్రలో కనిపిస్తానని అంటున్న సానియా ఇంటర్వ్యూ ‘ఈనాడు’కు ప్రత్యేకం.

టెన్నిస్‌ ప్రయాణంలో ఎలాంటి జ్ఞాపకాల్ని తీసుకెళ్తున్నారు?

2005లో నా గ్రాండ్‌స్లామ్‌ ప్రయాణం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనే మొదలైంది. నా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించడానికి ఇదే సరైన టోర్నీ అని ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు. 20 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో సాధించిన ప్రతి ఘనతకు గర్వపడుతున్నా. సృష్టించుకున్న ప్రతి జ్ఞాపకాన్ని ఆస్వాదిస్తున్నా. సుదీర్ఘ కెరీర్‌లో విజయాలు సాధించినప్పుడు, మైలురాళ్లు అందుకున్నప్పుడు తోటి దేశస్తులు, మద్దతుదారుల ముఖాల్లో చూసిన గర్వం, సంతోషమే జీవితాంతం నాతో పాటు ఉండే గొప్ప జ్ఞాపకాలు.

వ్యక్తిగత జీవితం, కెరీర్‌లో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను   ఎలా ఎదుర్కోగలిగారు?

టెన్నిస్‌ నేర్చుకోవడం కోసం ఆరేళ్ల వయసులోనే కోచ్‌తో పోట్లాడా. అక్కడ్నుంచి ఇన్నేళ్లు కెరీర్‌ కొనసాగించా. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఎప్పుడూ కుంగిపోలేదు. పోరాటం.. పోటీతత్వం నా రక్తంలోనే ఉన్నాయి. అందుకే ఎప్పుడూ తలవంచలేదు. గాయాలు, శస్త్రచికిత్సల చేతిలో ఓడిపోలేదు. ఒకసారి లక్ష్యాలను నిర్దేశించుకుంటే సాధించే వరకు విడిచిపెట్టను. నా శక్తికి మించి ప్రయత్నిస్తా. ఎంత కష్టమైనా మధ్యలో వదిలిపెట్టను. అప్పుడు, ఇప్పుడు కుటుంబమే నా ప్రధాన బలం.

భారత టెన్నిస్‌ క్రీడాకారిణిగా మీరు గర్వించే సందర్భాలు?

దేశానికి పతకాలు అందించడం.. ఘనతలు తీసుకురావడం నాకు గర్వంగా అనిపించిన క్షణాలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయుల ముందు పోడియం మీద నిలబడటం నేను అందుకున్న గొప్ప గౌరవం. కుటుంబ సభ్యులతో కలిసి నా కలల్ని, లక్ష్యాల్ని సాకారం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. 20 ఏళ్లు ప్రొఫెషనల్‌ అథ్లెట్‌గా.. 30 సంవత్సరాలు టెన్నిస్‌ క్రీడాకారిణిగా కొనసాగాను. నా కెరీర్‌, జీవితం అన్నీ టెన్నిసే. నన్ను చూసి దేశంలో ఎంతోమంది చిన్నారులు టెన్నిస్‌ రాకెట్‌ పట్టారు. వారందరికీ స్ఫూర్తిగా నిలవడం నా జీవితంలో అతిపెద్ద ఘనత.

సుదీర్ఘ కెరీర్‌ త్వరలోనే ముగియనుంది. తర్వాతేంటి?

జీవితం కొనసాగుతూనే ఉంటుంది. ఇది అంతమని నేను అనుకోను. ఇక్కడితో ఆగిపోను. మరెన్నో జ్ఞాపకాలు సృష్టించేందుకు, కలల్ని సాకారం చేసుకునేందుకు, ఘనతల్ని అందుకునేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు ఇది ఆరంభం. గతంలో కంటే ఇప్పుడు కుమారుడు ఇజ్‌హాన్‌కు నా అవసరం ఎక్కువగా ఉంది. అతని కోసం అధిక సమయం వెచ్చించాలి. అయితే టెన్నిస్‌తో నా అనుబంధం కొనసాగుతుంది. అమితంగా ఆరాధించే ఆటకు దూరంగా ఉండలేను. కోచ్‌, వ్యాఖ్యాత లేదా ఇతర పాత్రలోనా అన్నది త్వరలోనే తెలుస్తుంది.

యువ క్రీడాకారిణులకు మీ సందేశం?

టెన్నిస్‌ అత్యంత పోటీతత్వం ఉండే క్రీడ. రెండొందలకు పైగా దేశాల క్రీడాకారులు ఆడతారు. ఇక్కడ కష్టాలను, సవాళ్లను ఆస్వాదించాలి. అమ్మాయిలు తల్చుకుంటే ఏదైనా సాధించగలరని ప్రతి క్రీడాకారిణి గట్టిగా నమ్మాలి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సామర్థ్యంపై నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని