జకోవిచ్‌ పదోసారి

తనకు పెట్టని కోట ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ పదోసారి ఫైనల్లో అడుగుపెట్టాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో అగ్రస్థానంలో ఉన్న నాదల్‌ (22)ను అందుకునేందుకు అతను (21) ఒక్క విజయం దూరంలో నిలిచాడు.

Updated : 28 Jan 2023 03:54 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ప్రవేశం
తుదిపోరులో సిట్సిపాస్‌తో ఢీ

మెల్‌బోర్న్‌

తనకు పెట్టని కోట ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ పదోసారి ఫైనల్లో అడుగుపెట్టాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో అగ్రస్థానంలో ఉన్న నాదల్‌ (22)ను అందుకునేందుకు అతను (21) ఒక్క విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో నాలుగో సీడ్‌ జకోవిచ్‌ 7-5, 6-1, 6-2 టామీ పాల్‌ (అమెరికా)పై గెలిచాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌లో ఆడిన పాల్‌ తొలి సెట్లో మాత్రమే జకోకు పోటీ ఇవ్వగలిగాడు. పోరును జకో దూకుడుగా మొదలెట్టాడు. తనదైన శైలిలో సర్వీస్‌లు, షాట్లతో చెలరేగాడు. చూస్తుండగానే 5-1తో దూసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత అనవసర తప్పిదాలతో వెనకబడ్డాడు. ఇదే అదునుగా పాల్‌ వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి 5-5తో స్కోరు సమం చేశాడు. ఆ దశలో మళ్లీ పుంజుకున్న జకో ఏస్‌లతో సత్తాచాటి వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి సెట్‌ దక్కించుకున్నాడు. ఇక రెండు, మూడు సెట్లలో అతనికి పెద్దగా ప్రతిఘటనే ఎదురు కాలేదు.

ఆదివారం ఫైనల్లో అతను మూడో సీడ్‌ సిట్సిపాస్‌ను ఢీ కొడతాడు. మరో సెమీస్‌లో ఈ గ్రీస్‌ కుర్రాడు 7-6 (7-2), 6-4, 6-7 (6-8), 6-3తో 18వ సీడ్‌ కచనోవ్‌ (రష్యా)ను ఓడించి తొలిసారి ఈ టోర్నీలో తుదిపోరు చేరాడు. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన తొలి సెట్‌లో ఆటగాళ్లిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఎనిమిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సిట్సిపాస్‌ 5-3తో ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ కచనోవ్‌ వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి 5-5తో ప్రత్యర్థిని అందుకున్నాడు. చివరకు టైబ్రేకర్‌లో సిట్సిపాస్‌ గెలిచాడు. రెండో సెట్‌ కూడా పోటాపోటీగా సాగింది. తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన సిట్సిపాస్‌.. అనంతరం సర్వీస్‌ నిలబెట్టుకుని సెట్‌ దక్కించుకున్నాడు. ఈ సారి పట్టు వదలని కచనోవ్‌ మూడో సెట్‌ టైబ్రేకర్‌లో గెలిచి పోటీలో నిలిచాడు. కానీ నాలుగో సెట్లో సిట్సిపాస్‌ దూకుడు తట్టుకోలేక ఓటమి పాలయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని