IND vs NZ: ఇచ్చేశారు
న్యూజిలాండ్‌ను 150 పరుగులకు పరిమితం చేస్తుందనుకుంటే 176 పరుగులు చేయనిచ్చింది. ఆఖర్లో ధారాళంగా పరుగులిచ్చేసింది. ఛేదనలో 15/3తో కష్టాల్లో పడినా పుంజుకుని 75/3 గెలుపుపై ఆశలు రేపింది. అనూహ్యంగా గాడితప్పి పరాజయంపాలైంది.
మెరిసిన మిచెల్, కాన్వే
తొలి టీ20లో కివీస్ చేతిలో భారత్ ఓటమి
న్యూజిలాండ్‌ను 150 పరుగులకు పరిమితం చేస్తుందనుకుంటే 176 పరుగులు చేయనిచ్చింది. ఆఖర్లో ధారాళంగా పరుగులిచ్చేసింది. ఛేదనలో 15/3తో కష్టాల్లో పడినా పుంజుకుని 75/3 గెలుపుపై ఆశలు రేపింది. అనూహ్యంగా గాడితప్పి పరాజయంపాలైంది. ఇదీ న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భారత్ ఆడిన తీరు. అవకాశాలను వదిలేసి.. ప్రత్యర్థికి కోలుకునే ఛాన్స్ ఇచ్చి.. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన హార్దిక్ సేన మూడు టీ20ల సిరీస్‌ను ఓటమితో మొదలెట్టింది. కాన్వే, మిచెల్, శాంట్నర్ కివీస్ గెలుపులో కీలకపాత్ర పోషిస్తే.. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండ్ మెరుపులు వృథా అయ్యాయి.
రాంచి
భారత్‌కు ఝలక్! అన్ని రంగాల్లో విఫలమైన హార్దిక్ సేన తొలి టీ20లో న్యూజిలాండ్ చేతిలో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. శుక్రవారం మొదట కివీస్ 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ (59 నాటౌట్; 30 బంతుల్లో 3×4, 5×6), కాన్వే (52; 35 బంతుల్లో 7×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టుకు మంచి స్కోరు అందించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (2/22) మాత్రమే రాణించాడు. ఛేదనలో భారత్ 155/9కే పరిమితమైంది. సుందర్ (50; 28 బంతుల్లో 5×4, 3×6) ఆఖరి వరకు పోరాడినా.. అతడికి సరైన మద్దతు లేకపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. రెండో టీ20 ఆదివారం జరుగుతుంది.
ఛేదనలో తడబాటు: మంచు ప్రభావంతో ఛేదనలో బౌలర్లకు కష్టం అనుకుంటే భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలో అంతా వ్యతిరేకంగా జరిగింది. 15 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ (7)తో పాటు ఇషాన్ కిషన్ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. రాహుల్ త్రిపాఠి (0) డకౌట్ అయ్యాడు. ఈ స్థితిలో సూర్యకుమార్ (47; 34 బంతుల్లో 6×4, 2×6), కెప్టెన్ హార్దిక్ (21)తో కలిసి నెమ్మదిగా స్కోరు పెంచాడు. ఎనిమిదో ఓవర్లో బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో సిక్స్‌తో హార్దిక్ దూకుడు ఆట మొదలెట్టగా తర్వాత ఓవర్ నుంచి సూర్య అందుకున్నాడు. బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కరిగించాడు. సమీకరణం (54 బంతుల్లో 102) కష్టంగానే ఉన్నా.. సూర్య-హార్దిక్ క్రీజులో ఉండడంతో ధీమాగా ఉన్నారు అభిమానులు. అయితే రెండు ఓవర్ల వ్యవధిలో అంతా మారిపోయింది. 12వ ఓవర్లో ఓ భారీ సిక్స్‌తో అర్ధసెంచరీకి చేరువైన సూర్యను సోధి బుట్టలో వేయగా.. ఆ తర్వాత హార్దిక్‌ను బ్రాస్‌వెల్ పెవిలియన్ చేర్చడంతో భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. ఒకవైపు సుందర్ నిలిచినా.. అతడికి ఎవరూ అండగా నిలవలేదు. దీపక్ హుడా (10), శివమ్ మావి (2), కుల్‌దీప్ (0) వెనుదిగరడంతో భారత్ 127/8తో ఓటమి అంచున నిలిచింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఫెర్గూసన్.. కుల్‌దీప్ వికెట్ తీయడంతో పాటు మెయిడెన్ ఓవర్ వేయడంతో భారత్ అవకాశాలు క్లిష్టమయ్యాయి. సుందర్ మెరుపు షాట్లు ఆడి అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. అతడి పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించగలిగింది.
మొదట కాన్వే.. ఆఖర్లో మిచెల్: ఆరంభం అదరహో.. మధ్యలో తడబాటు.. చివర్లో అదిరే ముగింపు. ఇదీ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ క్లుప్తంగా. ఓపెనర్లు ధాటిగా ఆడడంతో కివీస్ 4 ఓవర్లకు 37/0తో బలంగా కనిపించింది. కానీ ఇన్నింగ్స్ అయిదో ఓవర్లో వాషింగ్టన్ సుందర్ ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. మొదట ఊపు మీదున్న అలెన్ (35)ను ఓ తెలివైన బంతితో పెవిలియన్ చేర్చిన అతడు.. అదే ఓవర్ చివరి బంతికి చాప్‌మ్యాన్‌ను తన బౌలింగ్‌లోనే మెరుపు డైవింగ్ క్యాచ్ పట్టి పెవిలియన్ చేర్చాడు. దీనికి తోడు మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు సుందర్, కుల్‌దీప్ (1/20) కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఆరంభంలో ఉన్న దూకుడుని మధ్యలో కివీస్ చూపించలేకపోయింది. కానీ కాన్వే నిలవడంతో ఆ జట్టు స్కోరు మరీ తగ్గిపోలేదు. అతడికి తోడు మిచెల్ భారీ షాట్లు ఆడడంతో మెరుగైన స్కోరు దిశగా సాగింది. అయితే రెండు ఓవర్ల తేడాతో కాన్వే, బ్రాస్‌వెల్ (1), శాంట్నర్ (7) వెనుదిరగడంతో కివీస్ 19 ఓవర్లకు 149/6తో నిలిచింది. అర్ష్‌దీప్ వేసిన ఆఖరి ఓవర్లో మిచెల్ కివీస్ స్కోరుకు రాకెట్ వేగాన్ని ఇచ్చాడు. తొలి మూడు బంతులకు 23 పరుగులు (నోబ్ 6, 6, 6, 4) రాబట్టాడు. కానీ తర్వాత మూడు బంతుల్లో అర్ష్‌దీప్ 4 పరుగులే ఇచ్చినా కివీస్ మొత్తం 27 పరుగులు సాధించి భారీ స్కోరుతో ముగించింది. మాజీ కెప్టెన్ ధోని, భార్య సాక్షితో కలిసి మ్యాచ్‌ను తిలకించాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 35; కాన్వే (సి) హుడా (బి) అర్ష్‌దీప్ 52; చాప్‌మ్యాన్ (సి) అండ్ (బి) సుందర్ 0; ఫిలిప్స్ (సి) సూర్యకుమార్ (బి) కుల్‌దీప్ 17; మిచెల్ నాటౌట్ 59; బ్రాస్‌వెల్ రనౌట్ 1; శాంట్నర్ (సి) త్రిపాఠి (బి) మావి 7; సోధి నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176; వికెట్ల పతనం: 1-43, 2-43, 3-103, 4-139, 5-140, 6-149; బౌలింగ్: హార్దిక్ పాండ్య 3-0-33-0; అర్ష్‌దీప్ 4-0-51-1; సుందర్ 4-0-22-2; హుడా 2-0-14-0; ఉమ్రాన్ 1-0-16-0; కుల్‌దీప్ 4-0-20-1; మావి 2-0-19-1
భారత్ ఇన్నింగ్స్: శుభ్‌మన్ (సి) అలెన్ (బి) శాంట్నర్ 7; కిషన్ (బి) బ్రాస్‌వెల్ 4; త్రిపాఠి (సి) కాన్వే (బి) డఫీ 0; సూర్యకుమార్ (సి) అలెన్ (బి) సోధి 47; హార్దిక్ (సి) అండ్ (బి) బ్రాస్‌వెల్ 21; సుందర్ (సి) డఫీ (బి) ఫెర్గూసన్ 50; హుడా (స్టంప్డ్) కాన్వే (బి) శాంట్నర్ 10; మావి రనౌట్ 2; కుల్‌దీప్ (సి) కాన్వే (బి) ఫెర్గూసన్ 0; అర్ష్‌దీప్ నాటౌట్ 0; ఉమ్రాన్ 4 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155; వికెట్ల పతనం: 1-10, 2-11, 3-15, 4-83, 5-89, 6-111, 7-115, 8-127, 9-151; బౌలింగ్: డఫీ 3-0-27-1; బ్రాస్‌వెల్ 4-0-31-2; శాంట్నర్ 4-1-11-2; ఫెర్గూసన్ 4-1-33-2; ఇష్ సోధీ 3-0-30-1; టిక్నర్ 2-0-23-0
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Samantha: చీకటి రోజులు.. ఆ బాధ నుంచి నేనింకా కోలుకోలేదు.. విడాకుల రోజులపై సమంత వ్యాఖ్యలు
-
Sports News
IPL 2023: టోర్నీలోని మిగతా మ్యాచుల్లో కేన్ విలియమ్సన్ ఆడడు: గుజరాత్ టైటాన్స్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Corona Update: ఆరు నెలల తర్వాత.. అత్యధిక కేసులు..
-
Movies News
Costume Krishna: శ్రీదేవి కోసం అప్పటికప్పుడు డ్రెస్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కృష్ణ
-
General News
Amaravati: అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్న అమరావతి రైతులు