పంత్‌ లేకపోవడం భారత్‌కు లోటే కానీ..

రిషబ్‌ పంత్‌ లేకపోవడం ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు లోటేనని, కానీ సొంతగడ్డపై టీమ్‌ఇండియాను ఓడించడం దాదాపు అసాధ్యమని కంగారూ జట్టు మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు.

Published : 30 Jan 2023 02:13 IST

దిల్లీ: రిషబ్‌ పంత్‌ లేకపోవడం ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు లోటేనని, కానీ సొంతగడ్డపై టీమ్‌ఇండియాను ఓడించడం దాదాపు అసాధ్యమని కంగారూ జట్టు మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్‌తో టెస్టు సిరీస్‌ కఠిన సవాల్‌. సొంతగడ్డపై టీమ్‌ఇండియాను ఓడించడం దాదాపు అసాధ్యం. టెస్టుల్లో భారత్‌-ఆస్ట్రేలియా బలమైన జట్లే. ఇటీవల స్వదేశంలో సుదీర్ఘ ఫార్మాట్లో మెరుగైన ప్రదర్శనతో ఆసీస్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. కానీ తమకు అలవాటైన పరిస్థితుల్లో టీమ్‌ఇండియాను వెనక్కి నెట్టడం అంత తేలికేం కాదు’’ అని చాపెల్‌ తెలిపాడు. రాబోయే సిరీస్‌లో పంత్‌ స్థానంలో ఆడే వాళ్లు అతడి స్థాయిలో రాణించడం కష్టమే అని ఇయాన్‌ అన్నాడు. ‘‘పంత్‌ స్థానాన్ని భర్తీ చేసేవాళ్లు అతడి స్థాయిలో సత్తా చాటగలరా అనేదే ప్రశ్న. ముఖ్యంగా రిషబ్‌ నుంచి భారత్‌ కోల్పోయేది అతడి దూకుడైన బ్యాటింగ్‌. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అతడిలా ఆడడం వేరేకరొరికి సాధ్యం కాదు. అందుకే భారత్‌ తమ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లపైనే ఆధారపడాలి’’ అని చాపెల్‌ చెప్పాడు. భారత టాప్‌ఆర్డర్‌ బ్యాటర్లకు తమ స్పిన్నర్‌ లైయన్‌తో ఇబ్బంది లేదని అతనన్నాడు. ‘‘భారత స్టార్లు రోహిత్‌, కోహ్లి, పుజారా లాంటి వాళ్లు స్పిన్నర్‌ లైయన్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. మానసికంగా పైచేయి సాధించారు. లైయన్‌ ఒక్కడికే కాదు పేసర్లు కమిన్స్‌, హేజిల్‌వుడ్‌, స్టార్క్‌లకు భారత్‌లో గొప్ప బౌలింగ్‌ గణాంకాలేమీ లేవు. స్టీవ్‌ స్మిత్‌ను కట్టడి చేయడం టీమ్‌ఇండియా బౌలర్లకు సవాల్‌. అతడు కాకుండా మిగిలిన ఆసీస్‌ బ్యాటర్లకు అశ్విన్‌, జడేజాలను ఎదుర్కోవడం పెద్ద పరీక్ష’’ అని చాపెల్‌ చెప్పాడు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ఫిబ్రవరి 9న ఆరంభం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని