జర్మనీదే హాకీ ప్రపంచకప్‌

భారత్‌ ఆతిథ్యమిచ్చిన 2023 హాకీ ప్రపంచకప్‌ను జర్మనీ ఎగరేసుకుపోయింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో జర్మనీ 5-4తో షూటౌట్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెల్జియంను ఓడించింది.

Published : 30 Jan 2023 02:13 IST

షూటౌట్లో బెల్జియంపై గెలుపు

భువనేశ్వర్‌: భారత్‌ ఆతిథ్యమిచ్చిన 2023 హాకీ ప్రపంచకప్‌ను జర్మనీ ఎగరేసుకుపోయింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో జర్మనీ 5-4తో షూటౌట్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెల్జియంను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్‌ ఇచ్చేసి వెనుకబడినా.. గొప్పగా పుంజుకుని జర్మనీ విజేతగా నిలవడం విశేషం. ఫ్లోరెంట్‌ (9వ ని), టాన్‌గయ్‌ (10వ) గోల్స్‌తో బెల్జియం ఆరంభంలోనే ఆధిక్యంలో నిలిచింది. కానీ పుంజుకున్న జర్మనీ.. వాలెన్‌ (28వ), గొంజాలో (40వ), మాట్స్‌ (47వ) గోల్స్‌తో 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా బెల్జియం ఆటగాడు బూన్‌ (58వ) గోల్‌ చేయడంతో 3-3తో స్కోర్లు సమమై షూటౌట్‌ అనివార్యమైంది. షూటౌట్లోనూ స్కోర్లు ఒకటై (3-3) మ్యాచ్‌ సడన్‌డెత్‌కు వెళ్లింది. సడన్‌డెత్‌ తొలి ప్రయత్నంలో జర్మనీ, బెల్జియం సఫలం కావడంతో స్కోర్లు  4-4తో మళ్లీ సమమయ్యాయి. జర్మనీ తరఫున ఫ్రింజ్‌ గోల్‌ కొట్టగా.. కొయన్స్‌ (బెల్జియం) విఫలమవడంతో కప్‌ జర్మనీ వశమైంది. జర్మనీకిది మూడో ప్రపంచకప్‌. 2002, 2006లోనూ ఆ జట్టు ట్రోఫీ నెగ్గింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని