U 19 World Cup: యువరాణులకు పట్టం

మూడు సార్లు అందినట్లే అంది చేజారిపోయిన కప్‌.. వన్డేల్లో రెండు సార్లు, టీ20లో ఓ సారి రన్నరప్‌. అమ్మాయిల క్రికెట్లో భారత్‌ విశ్వవిజేతగా నిలవాలన్న నిరీక్షణకు ముగింపు ఎప్పుడనే ప్రశ్న.

Updated : 30 Jan 2023 03:22 IST

భారత అమ్మాయిలదే అండర్‌-19 ప్రపంచకప్‌
ఫైనల్లో ఇంగ్లాండ్‌పై గెలుపు
రాణించిన తితాస్‌, పర్శవి, అర్చన, త్రిష
పొచెఫ్‌స్ట్రూమ్‌

మూడు సార్లు అందినట్లే అంది చేజారిపోయిన కప్‌.. వన్డేల్లో రెండు సార్లు, టీ20లో ఓ సారి రన్నరప్‌. అమ్మాయిల క్రికెట్లో భారత్‌ విశ్వవిజేతగా నిలవాలన్న నిరీక్షణకు ముగింపు ఎప్పుడనే ప్రశ్న. ఇప్పుడా జవాబు దొరికింది. సీనియర్‌ అమ్మాయిలు సాధించలేనిది.. జూనియర్‌ క్రికెటర్లు అందుకున్నారు. మొట్టమొదటి అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ గెలిచి చరిత్ర సృష్టించారు. మహిళల క్రికెట్లో దేశానికి తొలి ప్రపంచకప్‌ అందించారు. బంతితో చెలరేగిన యువ భారత్‌.. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది.

భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఆదివారం అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మొదట బౌలింగ్‌లో విజృంభించి ఇంగ్లాండ్‌ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూల్చారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తితాస్‌ సాధు (2/6)తో పాటు పర్శవి చోప్రా (2/13), అర్చన దేవి (2/17) రాణించారు. ఆ జట్టులో 19 పరుగులు చేసిన రియానా టాప్‌స్కోరర్‌ అంటే టీమ్‌ఇండియా బౌలర్ల దూకుడు అర్థం చేసుకోవచ్చు. స్వల్ప ఛేదనలో 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ 14 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. తెలంగాణ బ్యాటర్‌ గొంగడి త్రిష (24; 29 బంతుల్లో 3×4), సౌమ్య తివారి (24 నాటౌట్‌; 37 బంతుల్లో 3×4) మెరిశారు.

అలవోకగా..: ఛేదనలో మూడో వికెట్‌కు త్రిష, సౌమ్య 46 పరుగులు జతచేసి భారత్‌ను గెలిపించారు. అంతకుముందు ఓపెనర్లు షెఫాలి (15), శ్వేత (5) త్వరగా నిష్క్రమించారు. ఓ ఫోర్‌, సిక్సర్‌ బాదిన తర్వాత మిడాన్‌లో అలెక్సా పట్టిన సూపర్‌ క్యాచ్‌కు కెప్టెన్‌ షెఫాలి ఔటైంది. ఆ తర్వాతి ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న శ్వేత కూడా పెవిలియన్‌ చేరింది. దీంతో జట్టు 20/2తో తడబడింది. కానీ పట్టు బిగించాలని చూసిన ఇంగ్లాండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా త్రిష, సౌమ్య జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ నిర్మించారు. సీవెన్స్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన సౌమ్యతో పాటు త్రిష కూడా క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకుంది. లక్ష్యం ఎక్కువగా లేకపోవడంతో తొందరపడలేదు. 11 ఓవర్లకు స్కోరు 50/2. ఆ వెంటనే వరుసగా రెండు ఫోర్లతో త్రిష విజయాన్ని వేగవంతం చేసింది. తర్వాతి ఓవర్లో మరో ఫోర్‌ బాది ఆమె ఔటైనా.. సౌమ్య పని పూర్తిచేసింది. అంతకుముందు పేస్‌ సంచలనం తితాస్‌, స్పిన్నర్లు పర్శవి, అర్చన కలిసి ఇంగ్లాండ్‌ బ్యాటర్లను హడలెత్తించారు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టింది. ఇంగ్లాండ్‌ జట్టులో నలుగురే రెండంకెల స్కోరు చేశారంటే.. మన బౌలర్ల అద్భుత ప్రదర్శనే కారణం. నాలుగు ఓవర్లలో తితాస్‌ ఏకంగా 20 డాట్‌బాల్స్‌ వేయడం విశేషం. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే రిటర్న్‌ క్యాచ్‌తో హీప్‌ (0)ను ఆమె ఔట్‌ చేసి వికెట్ల పతనాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత పర్శవి, అర్చన రాణించడంతో ఇంగ్లాండ్‌ పతనం వేగంగా సాగింది.


రూ.5 కోట్ల నజరానా

దిల్లీ: అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. ‘‘భారత్‌లో మహిళల క్రికెట్‌ ఊపుమీదుంది. ఈ ప్రపంచకప్‌ విజయం అమ్మాయిల క్రికెట్‌ స్థాయిని మరింత పైకి తీసుకెళ్లింది. విజేతగా నిలిచిన జట్టుకు, సహాయక సిబ్బందికి కలిపి రూ.5 కోట్లు నగదు బహుమతిగా ప్రకటించడం ఆనందంగా ఉంది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ మూడో టీ20 మ్యాచ్‌కు ఈ అమ్మాయిల జట్టును ఆహ్వానిస్తున్నా. ఈ ఘనతకు తగిన సంబరాలు చేసుకోవాల్సిందే’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు.


ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: సీవెన్స్‌ (సి) త్రిష (బి) దేవి 4; హీప్‌ (సి) అండ్‌ (బి) తితాస్‌ 0; హోలాండ్‌ (బి) దేవి 10; సెరెన్‌ (బి) తితాస్‌ 3; రియానా (సి) దేవి (బి) పర్శవి 19; పావ్‌లీ ఎల్బీ (బి) పర్శవి 2; అలెక్సా (సి) సోనమ్‌ (బి) మన్నత్‌ 11; జోసీ రనౌట్‌ 4; హన్నా బేకర్‌ (స్టంప్డ్‌) (బి) షెఫాలి 0; సోఫియా (సి) అండ్‌ (బి) సోనమ్‌ 11; ఎల్లీ అండర్సన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (17.1 ఓవర్లలో ఆలౌట్‌) 68; వికెట్ల పతనం: 1-1, 2-15, 3-16, 4-22, 5-39, 6-43, 7-53, 8-53, 9-68; బౌలింగ్‌: తితాస్‌ 4-0-6-2; అర్చన దేవి 3-0-17-2; పర్శవి చోప్రా 4-0-13-2; మన్నత్‌ కశ్యప్‌ 3-0-13-1; షెఫాలి    2-0-16-1; సోనమ్‌ యాదవ్‌ 1.1-0-3-1

భారత్‌ ఇన్నింగ్స్‌: షెఫాలి (సి) అలెక్సా (బి) బేకర్‌ 15; శ్వేత (సి) బేకర్‌ (బి) సీవెన్స్‌ 5; సౌమ్య నాటౌట్‌ 24; త్రిష (బి) అలెక్సా 24; హృషిత నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (14 ఓవర్లలో 3 వికెట్లకు) 69; వికెట్ల పతనం:  1-16, 2-20, 3-66; బౌలింగ్‌: హన్నా బేకర్‌ 4-1-13-1; సోఫియా 2-0-16-0; సీవెన్స్‌ 3-0-13-1; జోసీ 2-0-9-0; అలెక్సా స్టోన్‌హాస్‌ 2-0-8-1; ఎల్లీ అండర్సన్‌ 1-0-10-0


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని