Djokovic: ఇది నా అడ్డా.. జకోవిచ్‌దే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

సంచలనమేమీ లేదు. అనుకున్నదే జరిగింది. అతని అడుగు పడితే చాలు.. పులకించిపోయే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. మరోసారి ఆ వీరుడికే దాసోహమంది. అతను కోర్టులో అడుగుపెడితే చాలు.. తన చేతుల్లో ఒదిగిపోయేందుకు ఎదురు చూసే ఆ ట్రోఫీ.. మరోసారి ఆ గమ్యాన్ని చేరింది.

Updated : 30 Jan 2023 03:30 IST

పదోసారి టైటిల్‌ కైవసం
ఫైనల్లో సిట్సిపాస్‌పై విజయం
నాదల్‌ రికార్డు సమం
మెల్‌బోర్న్

సంచలనమేమీ లేదు. అనుకున్నదే జరిగింది. అతని అడుగు పడితే చాలు.. పులకించిపోయే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. మరోసారి ఆ వీరుడికే దాసోహమంది. అతను కోర్టులో అడుగుపెడితే చాలు.. తన చేతుల్లో ఒదిగిపోయేందుకు ఎదురు చూసే ఆ ట్రోఫీ.. మరోసారి ఆ గమ్యాన్ని చేరింది.

ఒక్క ఏడాది మాత్రమే విరామం. మరోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. తన అడ్డాలో పదోసారి విజేతగా నిలిచాడు. ఫైనల్లో సిట్సిపాస్‌ నుంచి ప్రతిఘటన ఎదురైనా.. ఎప్పటిలాగే పోరాడి గెలిచిన నొవాక్‌.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డుతో కొనసాగుతున్న నాదల్‌ను సమం చేశాడు. మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ కూడా అయ్యాడు.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అడుగుపెట్టడం.. ప్రత్యర్థులను చిత్తుచేయడం.. ట్రోఫీతో స్వదేశం చేరడం.. మరోసారి హార్డుకోర్టుపై జకోవిచ్‌ అదే చేశాడు. అచ్చొచ్చిన వేదికలో ఆదివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఈ నాలుగో సీడ్‌ సెర్బియా ఆటగాడు 6-3, 7-6 (7-4), 7-6 (7-5) తేడాతో మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై గెలిచాడు. 2021 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ మాదిరిగానే ఈ సారి కూడా జకో చేతిలో ఓడిన సిట్సిపాస్‌ గ్రాండ్‌స్లామ్‌ బోణీ కోసం నిరీక్షించక తప్పదు. తనకంటే 11 ఏళ్లు చిన్నవాడైన ప్రత్యర్థితో పోరులో జకో అదరగొట్టాడు. 24 ఏళ్ల సిట్సిపాస్‌ నుంచి రెండు, మూడు సెట్లలో పోటీ ఎదురైనా అతను బలంగా నిలబడ్డాడు. 35 ఏళ్ల జకోదే తొలి సెట్‌లో ఆధిపత్యం. మూడో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన అతను, ఆపై 4-1తో దూసుకెళ్లాడు. చూస్తుండగానే సెట్‌ ముగించాడు. కానీ ఆ తర్వాతి రెండు సెట్లూ హోరాహోరీగా సాగాయి. కోర్టుకు రెండు మూలలా షాట్లు ఆడుతూ.. బలమైన సర్వీస్‌లతో చెలరేగుతూ సిట్సిపాస్‌ జోరు ప్రదర్శించాడు. కానీ జకో ఆగలేదు. దీటుగా బదులిచ్చాడు. దీంతో స్కోరు 6-6తో సమమై టైబ్రేకర్‌కు దారితీసింది. అందులో సిట్సిపాస్‌ అనవసర తప్పిదాలు జకోకు కలిసొచ్చాయి. మూడో సెట్లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. తొలి గేమ్‌లోనే సిట్సిపాస్‌ బ్రేక్‌ సాధిస్తే.. ఆ వెంటనే జకోవిచ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. చెరో గేమ్‌ గెలుస్తూ వెళ్లడంతో మరో టైబ్రేకర్‌ తప్పలేదు. అందులో ఫోర్‌హ్యాండ్‌ విన్నర్లతో సాగిన జకో సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకున్నాడు. ఈ పోరులో అతను 7 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. సిట్సిపాస్‌ 15 ఏస్‌లు, 40 విన్నర్లు సాధించినప్పటికీ 42 అనవసర తప్పిదాలు చేయడం కొంపముంచింది. మరోవైపు మహిళల డబుల్స్‌ ఫైనల్లో సినియాకోవా- క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ 6-4, 6-3తో ఆయోమా- షిబాహర (జపాన్‌)పై గెలిచి ఏడో గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్‌ను అందుకుంది.


అవమానపడ్డ చోటే..

మూడో సెట్‌ టైబ్రేకర్‌లో సిట్సిపాస్‌ బంతిని కోర్టు బయటకు కొట్టగానే.. గెలిచాను చూడండి అన్నట్లు నిలబడ్డాడు జకోవిచ్‌. అనంతరం తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన కుర్రాడిలా పక్కన కూర్చొని, తువ్వాలు ముఖంపై పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. అతను చూడని గ్రాండ్‌స్లామ్‌లు కాదు.. సాధించని విజయాలూ కాదు. కానీ అతని కన్నీళ్ల వెనుక మరో కారణం ఉంది! అవమానపడ్డ చోటే.. మళ్లీ విజేతగా నిలబడ్డాడు. కరోనా టీకా వేసుకోలేదని నిరుడు అతణ్ని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడనివ్వలేదు. ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత సరిహద్దు భద్రత దళం అతణ్ని అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వం వీసా రద్దు చేసి, మూడేళ్ల పాటు అతను దేశంలో అడుగుపెట్టకుండా నిషేధించింది (తర్వాత ఎత్తివేసింది). ఆ సమయంలో న్యాయ పోరాటం చేసినా జకోకు నిరాశ తప్పలేదు. అవమాన భారంతో ఆ దేశం వదిలిన అతను.. ఇప్పుడదే గడ్డపై విజయనాదం చేశాడు. కరోనా టీకా నిబంధనలు సడలించడంతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి.. తొడ కండరాల గాయాన్ని దాటి మరీ అతను ఛాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు రష్యా జాతీయ పతాకాలు ప్రదర్శించిన గుంపులో తన తండ్రి ఉన్నాడనే వివాదం కూడా తలెత్తింది. కానీ అతను ఏకాగ్రత కోల్పోలేదు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో శిఖరాగ్రానికి చేరేందుకు బాటలు వేసుకున్నాడు. 22 టైటిళ్లతో నాదల్‌ను సమం చేసిన అతనికి ఎక్కువ విజయాలు సాధించే అవకాశం ఉంది. గాయాలతో ఇబ్బంది పడుతున్న నాదల్‌ మునుపటి దూకుడు చూపించడం లేదు. ఈ టోర్నీలో రెండో రౌండ్లోనే అతను నిష్క్రమించాడు. ఒకవేళ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అతనాడి విజేతగా నిలిచినా.. వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ ఆధిపత్యం చలాయించే అవకాశముంది. ఇలా చూసుకుంటే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు తన పేరిటి లిఖించుకోవడం ఖాయమనిపిస్తోంది.


10

జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు. 2019 నుంచి ఇక్కడ వరుసగా ఆడిన (నిరుడు ఆడలేదు) నాలుగు సార్లు అతనే ఛాంపియన్‌. నాదల్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్‌ 14), మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 11)ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ను కనీసం 10 సార్లు గెలిచింది అతనే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని