Djokovic: అవమానపడ్డ చోటే.. మళ్లీ విజేతగా..

మూడో సెట్‌ టైబ్రేకర్‌లో సిట్సిపాస్‌ బంతిని కోర్టు బయటకు కొట్టగానే.. గెలిచాను చూడండి అన్నట్లు నిలబడ్డాడు జకోవిచ్‌. అనంతరం తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన కుర్రాడిలా పక్కన కూర్చొని, తువ్వాలు ముఖంపై పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. 

Published : 30 Jan 2023 09:38 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో నొవాక్‌ జకోవిచ్‌ పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. తన అడ్డాలో పదోసారి విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో మూడో సెట్‌ టైబ్రేకర్‌లో సిట్సిపాస్‌ బంతిని కోర్టు బయటకు కొట్టగానే.. గెలిచాను చూడండి అన్నట్లు నిలబడ్డాడు జకోవిచ్‌. అనంతరం తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన కుర్రాడిలా పక్కన కూర్చొని, తువ్వాలు ముఖంపై పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చాడు. అతను చూడని గ్రాండ్‌స్లామ్‌లు కాదు.. సాధించని విజయాలూ కాదు. కానీ అతని కన్నీళ్ల వెనుక మరో కారణం ఉంది! అవమానపడ్డ చోటే.. మళ్లీ విజేతగా నిలబడ్డాడు. కరోనా టీకా వేసుకోలేదని నిరుడు అతణ్ని ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడనివ్వలేదు. ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత సరిహద్దు భద్రత దళం అతణ్ని అదుపులోకి తీసుకుంది.

ప్రభుత్వం వీసా రద్దు చేసి, మూడేళ్ల పాటు అతను దేశంలో అడుగుపెట్టకుండా నిషేధించింది (తర్వాత ఎత్తివేసింది). ఆ సమయంలో న్యాయ పోరాటం చేసినా జకోకు నిరాశ తప్పలేదు. అవమాన భారంతో ఆ దేశం వదిలిన అతను.. ఇప్పుడదే గడ్డపై విజయనాదం చేశాడు. కరోనా టీకా నిబంధనలు సడలించడంతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి.. తొడ కండరాల గాయాన్ని దాటి మరీ అతను ఛాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు రష్యా జాతీయ పతాకాలు ప్రదర్శించిన గుంపులో తన తండ్రి ఉన్నాడనే వివాదం కూడా తలెత్తింది. కానీ అతను ఏకాగ్రత కోల్పోలేదు.

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో శిఖరాగ్రానికి చేరేందుకు బాటలు వేసుకున్నాడు. 22 టైటిళ్లతో నాదల్‌ను సమం చేసిన అతనికి ఎక్కువ విజయాలు సాధించే అవకాశం ఉంది. గాయాలతో ఇబ్బంది పడుతున్న నాదల్‌ మునుపటి దూకుడు చూపించడం లేదు. ఈ టోర్నీలో రెండో రౌండ్లోనే అతను నిష్క్రమించాడు. ఒకవేళ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అతనాడి విజేతగా నిలిచినా.. వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ ఆధిపత్యం చలాయించే అవకాశముంది. ఇలా చూసుకుంటే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు తన పేరిటి లిఖించుకోవడం ఖాయమనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని