ప్రతిభ తోడుగా.. ప్రపంచాన్ని ఏలగా
స్ప్రింటర్ నుంచి క్రికెటర్‌గా మారింది ఒకరు.. వారసత్వాన్ని కొనసాగిస్తూ స్కేటింగ్ వదిలి బంతి పట్టుకుంది మరొకరు.. గల్లీలో అబ్బాయిలతో ఆడుతూ ఆటలో నైపుణ్యాలు సాధించింది వేరొకరు..
స్ప్రింటర్ నుంచి క్రికెటర్‌గా మారింది ఒకరు.. వారసత్వాన్ని కొనసాగిస్తూ స్కేటింగ్ వదిలి బంతి పట్టుకుంది మరొకరు.. గల్లీలో అబ్బాయిలతో ఆడుతూ ఆటలో నైపుణ్యాలు సాధించింది వేరొకరు.. అబ్బాయిల జట్టులో ఆడి ఆల్‌రౌండర్‌గా ఎదిగింది ఇంకొకరు. ఇలా ఈ నలుగురిది ఒక్కో నేపథ్యం. కానీ అద్భుత ప్రతిభ వీళ్ల సొంతం. ఇప్పుడదే ఆటతీరుతో దేశానికి అండర్-19 ప్రపంచకప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించారు. అమ్మాయిల క్రికెట్లో భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్న ఆ క్రికెటర్లే.. తితాస్, పర్శవి, మన్నత్, సౌమ్య. మరి వీళ్ల కథలేంటో చూసేద్దాం పదండి!
ఈనాడు క్రీడావిభాగం
స్కోరర్‌గా మొదలై...
తమ సొంత మైదానంలో.. చిన్నతనంలో సరదాగా పెన్సిల్, కాగితం పట్టుకుని స్కోరర్‌గా వ్యవహరించిన ఆ చిన్నారి.. ఇప్పుడు భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ అమ్మాయే తితాస్ సాధు. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని చిన్సురాలో తితాస్ కుటుంబానికి ఓ స్టేడియం ఉంది. అక్కడ జరిగే క్లబ్ మ్యాచ్‌ల కోసం బాల్యంలో ఆమె స్కోరర్ అవతారమెత్తేది. అలా క్రికెట్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే ఆమె తండ్రి రణదీప్ అథ్లెట్ కావడంతో ఆమె కూడా మొదట్లో పరుగుపై ఆసక్తి చూపించింది. శిక్షణ కూడా పొందింది. ఫుట్‌బాల్ కూడా ఆడేది. కానీ ఒక రోజు తండ్రి చెప్పినట్లుగా దూరం నుంచి గురి చూసి గోల్‌పోస్టులోకి టెన్నిస్ బంతిని చాలా సులభంగా విసిరింది. అప్పుడే ఆమెను ఫాస్ట్‌బౌలర్‌ను చేయాలని అతననుకున్నాడు. కోచ్ ప్రియాంకర్‌తో కలిసి అతను కూడా శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడు. బంతిని ఇన్‌స్వింగ్ చేయడం, మణికట్టును సర్దుకోవడం లాంటి విషయాలపై ఆమె పట్టు సాధించింది. 2019-20 సీజన్ కోసం బెంగాల్ అండర్-19 ప్రాబబుల్స్‌కు ఆమె ఎంపికైంది. కానీ పదో తరగతి పరీక్షల కారణంగా వెళ్లలేకపోయింది. ఆ తర్వాతి ఏడాది 16 ఏళ్ల వయసులో బెంగాల్ టీ20 జట్టుకు ఎంపికైంది. నిరుడు సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో బెంగాల్ తరపున అయిదు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టింది. వేగంగా బౌలింగ్ చేయడంతో పాటు బౌన్స్, రెండు వైపులా స్వింగ్ రాబట్టే 18 ఏళ్ల ఆమె బెంగాల్‌కే చెందిన దిగ్గజ పేసర్ జులన్ గోస్వామి బాటలో సాగుతోంది. ఫైనల్లో తితాస్ ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. నాలుగు ఓవర్లలో కేవలం ఆరు పరుగులే ఇచ్చింది. టోర్నీలో మొత్తం 6 వికెట్లు పడగొట్టింది.
వార్న్ ఆట చూసి
గింగిరాలు తిరిగే బంతులతో.. ప్రత్యర్థి ఊహకు అందకుండా బౌలింగ్ చేసి భారత్ విశ్వవిజేతగా నిలవడంలో 16 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ పార్శవి చోప్రా ప్రధాన పాత్ర పోషించింది. 6 మ్యాచ్‌ల్లో 7 సగటుతో 11 వికెట్లు పడగొట్టి.. టోర్నీలో టీమ్‌ఇండియా తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచింది. పార్శవి కేవలం 3.66 ఎకానమీ మాత్రమే నమోదు చేసిందంటే.. తన బౌలింగ్‌లో బ్యాటర్లు ఎంతలా ఇబ్బంది పడ్డారో అర్థం చేసుకోవచ్చు. పేసర్లకు ఎక్కువగా అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపైనా ఆమె గొప్పగా రాణించింది. తన రక్తంలోనే క్రికెట్ ఉంది. పార్శవి తాతయ్య, నాన్న కూడా క్రికెటర్లే. కానీ పాఠశాల రోజుల్లో ఆమె స్కేటింగ్‌పై ఆసక్తి చూపించింది. రాష్ట్రస్థాయిలోనూ సత్తాచాటింది. కానీ తండ్రి కోరిక మేరకు స్కేటింగ్ వదిలి క్రికెట్ బాట పట్టింది. పదేళ్ల వయసులో యువరాజ్ సింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ మొదలెట్టింది. కోచ్‌ల సూచనతో పేసర్ నుంచి లెగ్‌స్పిన్నర్‌గా మారింది. 13 ఏళ్లకే ఉత్తరప్రదేశ్ తరపున అండర్-19లో ఆడింది. తొలి మ్యాచ్‌లో పార్శవి పెదవులకు తీవ్ర గాయమైంది. అయినా కాసేపటికే మైదానంలోకి వచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. లాక్‌డౌన్ సమయంలో ఆమె ప్రాక్టీస్ కోసం ఫ్లడ్‌లైట్లతో కూడిన చిన్న మైదానాన్ని తండ్రి ఏర్పాటు చేశాడు. అప్పుడు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ వీడియోలు చూసి మెళకువలు నేర్చుకుంది. వార్న్‌ను ఒక్కసారైనా కలవాలని అనుకున్న పార్శవి.. అతను చనిపోవడంతో బాధలో మునిగిపోయింది. కొన్నివారాల పాటు వార్న్ ఫొటోనే వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుంది.
అబ్బాయిలతో గల్లీలో..
పటియాలాలోని తమ కాలనీ గల్లీలో అబ్బాయిలతో క్రికెట్ ఆడిన మన్నత్ కశ్యప్ ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ జట్టులో కీలక క్రికెటర్. ప్రపంచకప్‌లో ఆమె 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో మెరిసింది. 19 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌కు ఐస్‌క్రీమ్ అంటే పిచ్చి. తండ్రి సంజీవ్ ఐస్‌క్రీమ్ వ్యాపారం చేస్తుండడంతో.. చిన్నప్పుడు క్రికెట్ ఆడాక తినడానికి ఐస్‌క్రీమ్ తేవాలని మొండిపట్టు పట్టేది. వీధిలో మన్నత్ బౌలింగ్ చూసిన సంజీవ్ మేనకోడలు నుపుర్ కశ్యప్ (పంజాబ్‌కు ఆడింది) తనను క్రికెట్ అకాడమీలో చేర్పించాలని చెప్పింది. అలా శిక్షణ తీసుకోవడం మొదలెట్టిన మన్నత్ వెనుదిరిగి చూసుకోలేదు. దేశవాళీల్లో సత్తాచాటి అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికైంది. ఇప్పుడు మెగా టోర్నీలోనూ ఆఫ్‌స్పిన్‌తో అదరగొట్టింది. ఆమె కూడా పేసర్ నుంచి స్పిన్నర్‌గా మారింది. మరోవైపు దుస్తులు ఉతికే చెక్కతో, కాగితం బంతులతో క్రికెట్ ఆడడం మొదలెట్టిన స్పిన్ ఆల్‌రౌండర్ సౌమ్య తివారి.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. భోపాల్‌లో కోచ్ సురేష్ మొదట తన అకాడమీలో సౌమ్యకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అప్పటికే చాలా మంది అమ్మాయిలు మధ్యలోనే వెళ్లిపోవడం, అక్కడంతా అబ్బాయిలే ఉండడం అందుకు కారణం. కానీ అకాడమీలో చేర్పించాలంటూ సౌమ్య రెండు రోజుల పాటు ఏడ్చింది. దీంతో మరోసారి కోచ్‌ను అడిగితే ఒప్పుకున్నాడు. మొదట్లో ఆమె అబ్బాయిలతోనే కలిసి ఆడేది. ఆఫ్‌స్పిన్నర్‌గా, బ్యాటర్‌గా పట్టు సాధించిన 17 ఏళ్ల సౌమ్య ప్రపంచకప్‌లో 4 మ్యాచ్‌ల్లో 84 పరుగులు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Chandigarh University: పరీక్షలో పాటలే సమాధానాలు.. లెక్చరర్ కామెంట్‌కు నవ్వులే నవ్వులు
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!