వెస్టిండీస్‌పై భారత్‌ విజయం

మహిళల టీ20 ముక్కోణపు సిరీస్‌లో సోమవారం నామమాత్రపు మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.

Published : 31 Jan 2023 02:52 IST

ఈస్ట్‌ లండన్‌: మహిళల టీ20 ముక్కోణపు సిరీస్‌లో సోమవారం నామమాత్రపు మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. దీప్తి శర్మ (3/11) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మొదట విండీస్‌ 6 వికెట్లకు 94 పరుగులే చేయగలిగింది. హేలీ మాథ్యూస్‌ (34; 34 బంతుల్లో 5×4) టాప్‌ స్కోరర్‌. పూజ వస్త్రాకర్‌ (2/19), రాజేశ్వరి గైక్వాడ్‌ (1/9) కూడా బంతితో రాణించారు. జెమీమా (42 నాటౌట్‌; 39 బంతుల్లో 5×4), హర్మన్‌ప్రీత్‌ (32 నాటౌట్‌; 23 బంతుల్లో 4×4) చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్‌ 13.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. దీప్తి శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత జట్టు ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది.

అండర్‌-19 విజయం స్ఫూర్తితో..: మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌ విజయం స్ఫూర్తితో ఫిబ్రవరి 10న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ బరిలో దిగుతున్నామని భారత మహిళ క్రికెట్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెప్పింది. ‘‘దక్షిణాఫ్రికాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు అండర్‌-19 జట్టు విజయం స్ఫూర్తినిచ్చింది. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్‌ నెగ్గడం పెద్ద విజయం. అందులోనూ తొలి టోర్నీలోనే టైటిల్‌ సాధించడం ఎప్పటికి గుర్తుండిపోతుంది. భారత జట్టుకు అభినందనలు. టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టులో సీనియర్లతో పాటు తాజాగా అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన షెఫాలీవర్మ, రిచాఘోష్‌ లాంటి యువ తారలు ఉన్నారు. జట్టు సమతూకంగా ఉంది’’ అని హర్మన్‌ప్రీత్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని