హెచ్‌సీఏ రికార్డులు సమర్పించండి

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పాలకవర్గం గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది

Published : 01 Feb 2023 02:40 IST

హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పాలకవర్గం గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ మాజీ అధ్యక్షులు అర్షద్‌ అయ్యూబ్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జె.శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2021 జులై నుంచి అధ్యక్షుడు అజహరుద్దీన్‌ మినహా ఎలాంటి పాలకవర్గం లేదని తెలిపారు. సర్వసభ్య సమావేశాలు కూడా నిర్వహించడం లేదన్నారు. గత ఏడాది డిసెంబరు 11న జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యుడు వంకా ప్రతాప్‌, అధ్యక్షుడు అజహరుద్దీన్‌ కుమ్మక్కై ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ కక్రూ హెచ్‌సీఏను ప్రక్షాళనకు చేసే ప్రయత్నాలకు అడ్డుపడుతున్నారన్నారు. హెచ్‌సీఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం వివాదం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. సంఘం వ్యవహారాల పర్యవేక్షణ నిమిత్తం కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. దీనికి సంబంధించిన సమాచారం సమర్పించడానికి వారం గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు.

మరో 16 వారాలు సమయం ఇవ్వండి: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సభ్యత్వాల విషయంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని సుప్రీంకోర్టు నియమించిన హెచ్‌సీఏ పర్యవేక్షక కమిటీ అభిప్రాయపడింది. హెచ్‌సీఏ క్లబ్‌లకు సంబంధించిన రికార్డుల్ని సరిగ్గా నిర్వహించట్లేదని కమిటీ ఆరోపించింది. హెచ్‌సీఏ వ్యవహారాలపై మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు పర్యవేక్షక కమిటీ సమర్పించింది. కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ నివేదికపై సంతకం చేయలేదు. కమిటీ వైస్‌ ఛైర్మన్‌ అంజని కుమార్‌.. సభ్యులు వెంకటపతి రాజు, వంకా ప్రతాప్‌ సంతకాలతో నివేదికను సమర్పించారు. 7-8 క్లబ్‌లు కలిగిన కొందరు సభ్యులు హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని కమిటీ ఆరోపించింది. అర్షద్‌ అయూబ్‌, సురేందర్‌ అగర్వాల్‌, మొయిజుద్దీన్‌, విజయానంద్‌, యాదగిరి, మాన్‌సింగ్‌, పురుషోత్తం అగర్వాల్‌, శివలాల్‌ యాదవ్‌లకు ఎక్కువ సంఖ్యలో క్లబ్‌లు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు, 14 మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో క్రికెట్‌ సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా క్రీడల కార్యదర్శికి కమిటీ వైస్‌ ఛైర్మన్‌ నిరుడు అక్టోబరులో లేఖ రాసినట్లు తెలిపింది. అన్ని విషయాలపై సమగ్ర దర్యాప్తు కోసం కమిటీకి మరో 16 వారాలు సమయం ఇవ్వాలని కోరింది. నిరుడు ఆగస్టులో పర్యవేక్షక కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు