సంక్షిప్త వార్తలు(2)

భారత టెస్టు జట్టులో పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానె కౌంటీ బాట పట్టాడు. 34 ఏళ్ల రహానె లెస్టర్‌ కౌంటీ తరఫున బరిలో దిగనున్నాడు.

Updated : 01 Feb 2023 04:41 IST

కౌంటీలకు రహానె

లెస్టర్‌: భారత టెస్టు జట్టులో పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానె కౌంటీ బాట పట్టాడు. 34 ఏళ్ల రహానె లెస్టర్‌ కౌంటీ తరఫున బరిలో దిగనున్నాడు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత అతడు ఇంగ్లాండ్‌ వెళ్తాడు. లెస్టర్‌ తరఫున ఎనిమిది కౌంటీ మ్యాచ్‌లతో పాటు వన్డే కప్‌లోనూ ఆడతాడు. ‘‘ఈ కౌంటీ సీజన్లో లెస్టర్‌కు ప్రాతినిథ్యం వహించబోతుండడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు బరిలో దిగుతానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని రహానె చెప్పాడు. గతేడాది జనవరిలో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన రహానె.. ఈసారి రంజీ ట్రోఫీలోనూ బరిలో దిగాడు. 7 మ్యాచ్‌ల్లో ఓ ద్విశతకం సహా 634 పరుగులు చేశాడు. 2019లో నాటింగ్‌హామ్‌షైర్‌ తరఫున తొలిసారి కౌంటీల్లో ఆడిన అజింక్య.. అరంగేట్రంలోనే సెంచరీతో మెరిశాడు.


ప్రిక్వార్టర్స్‌లో ఇషాన్‌- సాయి జోడీ

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారులు ఇషాన్‌ భట్నాగర్‌- సాయి ప్రతీక్‌ల జోడీ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో ఇషాన్‌-సాయి ప్రతీక్‌ జోడీ 21-18, 21-12తో విన్సన్‌- జాషువా (అమెరికా) జంటపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో రవికృష్ణ- శంకర్‌ ప్రసాద్‌ జోడీ 21-16, 18-21, 10-21తో లీ హూవీ- యాంగ్‌ సువాన్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ 9-21, 10-21తో రెనా- అయకొ (జపాన్‌) చేతిలో, అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో 15-21, 18-21తో టాన్‌ నింగ్‌- షియా టింగ్‌ (చైనా) చేతిలో పరాజయం చవిచూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని