హైదరాబాద్‌ రేసు కోసం ఉత్సాహంగా

భారత్‌లో తొలిసారి ఫార్ములా- ఈ రేసు కోసం హైదరాబాద్‌ రావడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని మహీంద్రా రేసింగ్‌ బృందంలో ఒకడైన బ్రెజిల్‌ రేసర్‌ లుకాస్‌ డి గ్రాసి అన్నాడు.

Published : 03 Feb 2023 03:27 IST

మహీంద్రా రేసర్‌ లుకాస్‌

భారత్‌లో తొలిసారి ఫార్ములా- ఈ రేసు కోసం హైదరాబాద్‌ రావడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని మహీంద్రా రేసింగ్‌ బృందంలో ఒకడైన బ్రెజిల్‌ రేసర్‌ లుకాస్‌ డి గ్రాసి అన్నాడు. గురువారం వర్చువల్‌గా అతను విలేకర్లతో మాట్లాడాడు. ‘‘హైదరాబాద్‌ ఈ- ప్రి రేసు కోసం ఎదురు చూస్తున్నా. ఇక్కడి స్ట్రీట్‌ సర్క్యూట్‌ గురించి విన్నా. ట్రాక్‌ వేగంగా ఉందనిపిస్తోంది. ఇక్కడ పోటీ ఆసక్తికరంగా ఉండబోతుంది. పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచిది. బుధవారం నగరానికి వస్తా. రేసులో వంద శాతం ప్రదర్శనతో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతా. బ్రెజిల్‌లో పుట్టిన నాకు వేడి వాతావరణం కొత్తేమీ కాదు. కాబట్టి హైదరాబాద్‌లో కారు నడపడంలో సమస్యే ఉండదు. హైదరాబాద్‌లో తొలిసారి జరిగే ఈ రేసుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీంతో భారత్‌లో ఫార్ములా-ఈ విపణికి ద్వారాలు తెరుచుకుంటాయి. మహీంద్రాతో నా బంధం ఈ సీజన్‌తోనే మొదలైంది. మెక్సికోలో పోల్‌ పొజిషన్‌ సాధించా. రేసును మూడో స్థానంతో ముగించా. ఆ తర్వాత రెండు రేసుల్లో అంచనాలను అందుకోలేకపోయినా.. హైదరాబాద్‌లో సత్తాచాటుతాననే నమ్మకం ఉంది. ఎఫ్‌1తో పోలిస్తే ఫార్ములా- ఈ విభిన్నమైంది. వాడే కార్లు, ట్రాక్‌, రేసింగ్‌ పరిస్థితులు, మన సన్నాహకం, కారును నడిపే విధానం, ప్రత్యర్థులను ఎదుర్కొనే తీరు.. ఇలా వేర్వేరు సవాళ్లు ఎదురవుతాయి. ఫార్ములా-ఈకి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఎఫ్‌1 స్థాయిని అందుకోవాలంటే ఇంకెంతో దూరం ప్రయాణించాలి’’ అని లుకాస్‌ పేర్కొన్నాడు. ఈ నెల 11న హుస్సేన్‌ సాగర్‌ పరిసరాల్లోని స్ట్రీట్‌ సర్క్యూట్‌లో జరిగే హైదరాబాద్‌ ఈ-ప్రి రేసులో పోటీపడే 11 జట్లలో మహీంద్రా రేసింగ్‌ ఒకటి. ఆరంభ సీజన్‌ (2014-15) నుంచి మహీంద్రా రేసింగ్‌ జట్టు ఫార్ములా-ఈలో భాగంగా ఉంది. 2010లో వర్జిన్‌ రేసింగ్‌ తరపున ఫార్ములా వన్‌లోనూ 38 ఏళ్ల లుకాస్‌ పోటీపడ్డాడు. ఫార్ములా-ఈ మొదలైనప్పటి నుంచి ఇందులో కొనసాగుతున్నాడు. 2016-17లో ఏబీటీ  ఆడి స్పోర్ట్‌ జట్టు తరపున ఛాంపియన్‌గానూ నిలిచాడు.   ఈ సీజన్‌లోనే మహీంద్రా జట్టుతో చేరాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని