కంగారూల స్పిన్‌ మంత్ర!

స్పిన్‌.. భారత్‌లో టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చే ఏ ఉపఖండేతర జట్టుకైనా ఈ మాట వింటే కంగారు పుడుతుంది. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఎన్నో జట్లు భారత గడ్డపై గింగిరాలు తిరిగే పిచ్‌లకు తలవంచి సిరీస్‌లు సమర్పించుకున్నవే.

Updated : 04 Feb 2023 07:31 IST

స్పిన్‌.. భారత్‌లో టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చే ఏ ఉపఖండేతర జట్టుకైనా ఈ మాట వింటే కంగారు పుడుతుంది. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఎన్నో జట్లు భారత గడ్డపై గింగిరాలు తిరిగే పిచ్‌లకు తలవంచి సిరీస్‌లు సమర్పించుకున్నవే. ఇప్పుడు కంగారూ జట్టును కూడా అదే భయం వెంటాడుతోంది. టీమ్‌ఇండియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ ముంగిట ఆ జట్టు ప్రణాళికలన్నీ స్పిన్‌ చుట్టూనే తిరుగుతుండడం అందుకు నిదర్శనం.

ఈనాడు క్రీడావిభాగం

2001లో ఏం జరిగిందో గుర్తుందా? అంతకుముందు చాలా ఏళ్ల నుంచి ప్రపంచ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చి తొలి టెస్టును అలవోకగా గెలిచి మరో సిరీస్‌ విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాతి రెండు టెస్టుల్లో అనూహ్య పరాజయాలు చవిచూసి సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ సిరీస్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌, ద్రవిడ్‌ల భారీ భాగస్వామ్యం కీలక మలుపే కానీ.. భారత్‌కు సిరీస్‌ విజయాన్నందించింది మాత్రం స్పిన్నే. ఆ తర్వాత భారత్‌లో అయిదుసార్లు పర్యటించిన కంగారూ జట్టు 2004లో మాత్రమే సిరీస్‌ను సాధించింది. మిగతా నాలుగు పర్యాయాలు ఓటమి తప్పలేదు. ప్రతిసారీ ఆ జట్టు బోల్తా కొట్టింది స్పిన్‌ను ఎదుర్కోలేకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి కూడా ఆ జట్టు భారత స్పిన్‌ దాడి గురించి తీవ్రంగానే ఆందోళన చెందుతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.

వార్మప్‌ వద్దట..

ఏ జట్టయినా విదేశీ పర్యటనకు వెళ్లినపుడు జట్టులోని ఆటగాళ్లు అక్కడి పరిస్థితులు, పిచ్‌లకు అలవాటు పడేందుకు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడడం సహజం. కానీ ఈసారి భారత పర్యటనలో ఆస్ట్రేలియా మాత్రం ఈ పని చేయట్లేదు. ఆసీస్‌ కోరితే బీసీసీఐ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఏర్పాటు చేయకుండా ఉండదు. కానీ ఆ జట్టు వాటి పట్ల విముఖత ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇందుక్కారణం.. వార్మప్‌ మ్యాచ్‌లకు సిద్ధం చేసే పిచ్‌ల విషయంలో ఉన్న అసంతృప్తే వార్మప్‌ మ్యాచ్‌లకు పచ్చికతో కూడిన పిచ్‌ను ఇచ్చి, అసలు మ్యాచ్‌లో మాత్రం పచ్చిక పూర్తిగా తొలగించి స్పిన్‌కు అనుకూలంగా మారుస్తుండడంతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందని ఆసీస్‌ భావిస్తోంది. దీని వల్ల సమయం వృథా, పైగా ఆటగాళ్లు తికమక పడుతున్నారని భావించి కంగారూ జట్టు ఈసారి వార్మప్‌ మ్యాచ్‌లు వద్దనేసింది. దాని బదులు నెట్‌ సెషన్లలో స్పిన్నర్లతో బంతులేయించుకుని ప్రాక్టీస్‌ సాగిస్తున్నారు ఆ జట్టు బ్యాటర్లు.

ఇద్దరు కాదు ముగ్గురు..?

గతంలో భారత పిచ్‌లు తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్‌కు అనుకూలించి.. మూడో రోజు నుంచి స్పిన్‌కు సహకారం అందించేవి. ఆట ముందుకు సాగేకొద్దీ పగుళ్లు వచ్చి బంతి మరింత తిరిగేది. కానీ కొన్నేళ్ల నుంచి తొలి రోజే బంతి గింగిరాలు తిరిగేలా పిచ్‌లు తయారు చేస్తున్నారని.. ఇలాంటి పిచ్‌లను తమ బ్యాటర్లు తట్టుకోవడం కష్టమే అని ఆస్ట్రేలియా జట్టు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పిచ్‌ను బట్టి భారత్‌ ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించే సూచనలు కూడా కనిపిస్తుండడం కంగారూలను మరింత ఒత్తిడికి గురి చేస్తోంది. గతంలో అశ్విన్‌, జడేజా స్పిన్‌ బాధ్యతలు పంచుకునేవారు. మధ్యలో గాయపడ్డ జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ కూడా నిలకడగా రాణించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అశ్విన్‌తో పాటు జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ కూడా జట్టులో ఉన్నారు. పిచ్‌ స్పిన్‌ స్వర్గధామంలా ఉంటే వీరిలో ముగ్గురిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరి భారత స్పిన్‌ త్రయాన్ని కంగారూ బ్యాటర్లు ఎలా తట్టుకుంటారో చూడాలి.


ఆస్ట్రేలియా శిబిరంలో ‘అశ్విన్‌’

భారత్‌లో టెస్టు సిరీస్‌ అంటే అందరి చూపూ అశ్విన్‌ మీదే ఉంటుంది. కుంబ్లే-హర్భజన్‌ల శకం ముగిశాక.. ఆ లోటును కనిపించకుండా చేయడంలో ఈ తమిళనాడు స్పిన్నర్‌ది కీలక పాత్ర. పదేళ్లకు పైగా టెస్టుల్లో స్పిన్‌ భాగస్వామి మారుతున్నాడే తప్ప.. అశ్విన్‌ మాత్రం ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతూనే ఉన్నాడు. ఆస్ట్రేలియాతో రాబోయే సిరీస్‌లోనూ అశ్విన్‌ నుంచి ముప్పు తప్పదని ఆస్ట్రేలియా అంచనా వేస్తోంది. అందుకే అతణ్ని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అశ్విన్‌ తరహా శైలి కలిగి ఉన్న మహీష్‌ పితియా అనే 21 ఏళ్ల స్పిన్నర్‌ను ప్రాక్టీస్‌లో కంగారూ జట్టు ఉపయోగించుకుంటుండడం విశేషం. బరోడాకు చెందిన ఈ ఆఫ్‌స్పిన్నర్‌ బౌలింగ్‌ శైలి అశ్విన్‌కు దగ్గరగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో మహీష్‌ బౌలింగ్‌ వీడియోలు చూసిన ఆస్ట్రేలియా సహాయ సిబ్బంది.. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ ముంగిట తన సేవలు ఉపయోగించుకోవాలనుకున్నారు. మహీష్‌ను సంప్రదించి అతణ్ని నెట్‌ సెషన్‌కు పిలిపించారు. కంగారూ ప్రధాన బ్యాటర్లంతా సుదీర్ఘ సమయం అతడి బంతులను ఎదుర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని