ఆంధ్ర నిష్క్రమణ

రంజీ ట్రోఫీలో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆంధ్ర.. తన పోరాటాన్ని ముగించింది. క్వార్టర్‌ఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Updated : 04 Feb 2023 05:28 IST

రంజీ క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌ విజయం

ఇండోర్‌: రంజీ ట్రోఫీలో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆంధ్ర.. తన పోరాటాన్ని ముగించింది. క్వార్టర్‌ఫైనల్లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం ముగిసిన క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మధ్యప్రదేశ్‌ 5 వికెట్ల తేడాతో ఆంధ్రను ఓడించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 58/0తో నాలుగో రోజు ఉదయం ఆట కొనసాగించిన మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ హిమాంషు మంత్రి (31) మొదటి ఓవర్లోనే ఔటైనా.. ఓపెనర్‌ యశ్‌ దూబె (58; 128 బంతుల్లో 6×4), శుభమ్‌ శర్మ (40; 100 బంతుల్లో 3×4) రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అనంతరం శుభమ్‌, రజత్‌ పాటిదార్‌ (55; 76 బంతుల్లో 5×4, 1×6) నాలుగో వికెట్‌కు 49 పరుగులు జతచేసి జట్టును లక్ష్యానికి చేరువ చేశారు. రజత్‌, కెప్టెన్‌ ఆదిత్య శ్రీవాస్తవ (2) మూడు పరుగుల తేడాలో ఔటవడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. 210 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన మధ్యప్రదేశ్‌కు మరో 35 పరుగులు కావాలి. కాని సారాంష్‌ జైన్‌ (28 నాటౌట్‌; 70 బంతుల్లో 1×4), హర్ష్‌ (18 నాటౌట్‌; 38 బంతుల్లో 3×4) ఆరో వికెట్‌కు అజేయంగా 35 పరుగులు జోడించి ఆంధ్ర ఆశలకు తెరదించారు. ఆంధ్ర బౌలర్లు లలిత్‌ మోహన్‌ (2/91), పృథ్వీరాజ్‌ (2/50), నితీశ్‌కుమార్‌రెడ్డి (1/36) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ నెల 8న ప్రారంభమయ్యే తొలి సెమీస్‌లో బెంగాల్‌తో మధ్యప్రదేశ్‌ తలపడుతుంది. నిరుటి సెమీస్‌లోనూ మధ్యప్రదేశ్‌, బెంగాల్‌ పోటీపడ్డాయి. 174 పరుగుల ఆధిక్యంతో బెంగాల్‌పై గెలిచిన మధ్యప్రదేశ్‌ అనంతరం రంజీ ఛాంపియన్‌గా నిలిచింది.


సెమీస్‌లో కర్ణాటక

బెంగళూరు: ఎనిమిది సార్లు ఛాంపియన్‌ కర్ణాటక.. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం ముగిసిన క్వార్టర్‌ఫైనల్లో కర్ణాటక ఇన్నింగ్స్‌, 281 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 106/3తో నాలుగో రోజు ఉదయం ఆట కొనసాగించిన ఉత్తరాఖండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 73.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం 32.4 ఓవర్లాడిన ఉత్తరాఖండ్‌ మరో 103 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. విద్వత్‌ (2/30), విజయ్‌ (3/55), వెంకటేశ్‌ (2/44), శ్రేయస్‌ గోపాల్‌ (3/26) విజృంభించి కర్ణాటకకు విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఉత్తరాఖండ్‌ 116 స్కోరుకు ఆలౌటవగా.. కర్ణాటక 606 పరుగులు సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని