అండర్‌-19 విజయం వెనుక..

బరిలో బలమైన జట్లు నిలిచినా..అన్నిటిని వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది భారత మహిళల జట్టు.

Published : 04 Feb 2023 03:14 IST

దిల్లీ: బరిలో బలమైన జట్లు నిలిచినా..అన్నిటిని వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది భారత మహిళల జట్టు. ఈ గెలుపు వెనుక ఏడు నెలల శ్రమ ఉంది. వీవీఎస్‌ లక్ష్మణ్‌ సారథ్యంలోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో భారత మహిళల జట్టు రాటుదేలింది. ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయడం దగ్గర నుంచి టోర్నీకి ముందు సన్నాహక సిరీస్‌లు నిర్వహించడం వరకు ఎన్‌సీఏ ప్రతి అడుగులోనూ అమ్మాయిలకు అండగా నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన అండర్‌-19 టోర్నీల్లో సత్తా చాటిన 25 మంది ప్రాబబుల్స్‌ను గతేడాది జూన్‌లో శిబిరానికి ఎంపిక చేసింది. ఆ తర్వాత ఛాలెంజర్‌ ట్రోఫీలో ఆడిన అమ్మాయిలు.. ఆపై వెస్టిండీస్‌, శ్రీలంకతో పాటు రెండు భారత జట్లు ఆడిన నాలుగు జట్ల టోర్నీలోనూ పోటీపడ్డారు. ఇక్కడే తొలిసారి విదేశీ జట్లతో తలపడిన అనుభవాన్ని దక్కించుకున్న భారత జట్టు.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంది. ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ తలపడింది. ఈ మ్యాచ్‌లన్ని భారత అమ్మాయిలకు పరిస్థితులకు అలవాటుపడటానికి, ఒత్తిడిని అధిగమించడానికి ఉపయోగపడ్డాయి. 2008, 2022 అండర్‌-19 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్లకు ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేసిన మనీష్‌ బాలి.. భారత అమ్మాయిలకు ఫీల్డింగ్‌ పాఠాలు చెప్పాడు. ప్రపంచకప్‌లో మన మహిళల జట్టు ఫీల్డింగ్‌లో ఆకట్టుకుంది. ‘‘అండర్‌-19 జట్టు ప్రదర్శన వెనుక ఎన్‌సీఏ ఉంది. పురుషులతో పోలిస్తే దేశవాళీలో మహిళలకు వయసు విభాగాల్లో ఎక్కువ మ్యాచ్‌లు జరగవు. అందుకే ప్రపంచకప్‌ ముందు వారికి ఎక్కువ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండేలా చూసుకున్నాం. ఈ టోర్నీలో వ్యూహం ప్రకారం జట్టును బరిలో దించాం. పేసర్‌ తితాస్‌ సాధు అన్ని మ్యాచ్‌లు ఆడింది. చక్కటి లయ ఉన్న షబ్నమ్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదు. అన్ని మ్యాచ్‌లు ఆడకపోయినా సౌమ్య తివారి కూడా ప్రతిభావంతురాలు. సీనియర్‌ జట్టుకు ఆడిన షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌ తమ అనుభవాన్ని జట్టుకు పంచారు. ముఖ్యంగా మూడేళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న షెఫాలీ అందరితో కలిసిపోయింది. ఈ స్ఫూర్తే జట్టును గెలిపించింది. త్వరలో రాబోయే మహిళల ప్రిమియర్‌ లీగ్‌ వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది’’ అని మనీష్‌ బాలి చెప్పాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని