సంక్షిప్త వార్తలు (6)

శాఫ్‌ అండర్‌-20 మహిళల ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు అదిరే విజయం. గోల్స్‌ వర్షం కురిసిన మ్యాచ్‌లో భారత్‌ 12-0తో భూటాన్‌ను చిత్తుగా ఓడించింది.

Updated : 04 Feb 2023 05:30 IST

భారత్‌ 12.. భూటాన్‌ 0

ఢాకా: శాఫ్‌ అండర్‌-20 మహిళల ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు అదిరే విజయం. గోల్స్‌ వర్షం కురిసిన మ్యాచ్‌లో భారత్‌ 12-0తో భూటాన్‌ను చిత్తుగా ఓడించింది. నేహా (47, 55, 90 ని), అనిత కుమారి (50, 69, 78వ), లిండాకామ్‌ (61, 63, 75వ) హ్యాట్రిక్‌లతో మెరిశారు. అపర్ణ (29, 36వ) రెండు.. నీతు (43వ) ఓ గోల్‌ కొట్టారు. తొలి గోల్‌ చేయడానికి 29 నిమిషాలు తీసుకున్న భారత్‌.. ఆ తర్వాత ఆగలేదు. వరుస గోల్స్‌తో భూటాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి విజయాన్ని అందుకుంది. ఆదివారం రెండో లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో మన జట్టు తలపడనుంది.


ఆ అథ్లెట్లను ఆడిస్తే 40 దేశాలు దూరం

దిల్లీ: రష్యా, బెలారస్‌ అథ్లెట్లను ఒలింపిక్స్‌లో ఆడేందుకు అనుమతిస్తే, ఈ మెగా క్రీడలను దాదాపు 40 దేశాలు బహిష్కరిస్తాయని పోలెండ్‌ క్రీడా మంత్రి కామిల్‌ బోట్నిజుక్‌ తెలిపాడు. ఈ దేశాలు క్రీడలకు దూరమై ఒలింపిక్స్‌ నిర్వహణను అర్థరహితంగా మారుస్తాయని అన్నాడు. బ్రిటన్‌, అమెరికా, కెనడా లాంటి దేశాలూ ఆ జాబితాలో ఉండే ఆస్కారముందన్నాడు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాతో పాటు బెలారస్‌పైనా వివిధ ప్రపంచ క్రీడా సమాఖ్యలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కొన్ని టోర్నీల్లో వీళ్లు తటస్థ అథ్లెట్లుగా ఆడుతున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ ఈ రెండు దేశాల ప్లేయర్లను తటస్థ అథ్లెట్లుగా ఆడించే అవకాశాలను పరిశీలిస్తామని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వెల్లడించింది. దీంతో ఐఓసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


బాక్సింగ్‌ టాప్‌-3లో భారత్‌

దిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ మూడో స్థానానికి ఎగబాకింది. 36,300 పాయింట్లతో బలమైన అమెరికా, క్యూబాలను వెనక్కి నెట్టి టాప్‌-3లో నిలిచింది. కజకిస్థాన్‌ (48,100), ఉజ్బెకిస్థాన్‌ (37,600) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడలు లాంటి మెగా ఈవెంట్లలో ఇటీవల కాలంలో భారత బాక్సర్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో ర్యాంకింగ్‌ గణనీయంగా పెరిగింది. గత రెండు కామన్వెల్త్‌ క్రీడల్లో బాక్సింగ్‌లో 16 పతకాలు దక్కించుకున్న మన బాక్సర్లు.. 2008 నుంచి వివిధ అంతర్జాతీయ పోటీల్లో 140 మెడల్స్‌ కొల్లగొట్టారు.


అఫ్రిది కూతురితో షహీన్‌షా పెళ్లి!

కరాచి: పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్‌ షహీన్‌షా అఫ్రిది ఓ ఇంటివాడయ్యాడు. మాజీ కెప్టెన్‌ షాహిది అఫ్రిది కుమార్తె అన్షాను శుక్రవారం వివాహం చేసుకున్నాడు. కరాచిలో జరిగిన ఈ పెళ్లికి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌, షాదాబ్‌ ఖాన్‌, నసీమ్‌షా తదితరులు హాజరయ్యారు. అన్షాతో షహీన్‌కు గతేడాది నిశ్చితార్థం అయింది.


మార్చి 18న ఐఎస్‌ఎల్‌ పైనల్‌

దిల్లీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫైనల్‌ మార్చి 18న జరగనుంది. తుది సమరానికి ఆతిథ్యమిచ్చే వేదిక ఇంకా ఖరారు కాలేదు. నాలుగు సెమీఫైనల్స్‌ మ్యాచ్‌లు (ఇంట, బయటా) మార్చి 7, 9, 12, 13న నిర్వహిస్తారు. కొత్త ఫార్మాట్‌ ప్రకారం లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యేసరికే టాప్‌-2 జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. 3-6 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సింగిల్‌ లెగ్‌ ప్లేఆఫ్‌ నిర్వహించి మరో రెండు సెమీస్‌ బెర్తులను తేలుస్తారు. 4-5, 3-6 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య నిర్వహించే ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు మార్చి 3, 4 తేదీల్లో జరుగుతాయి. ముంబయి సిటీ, హైదరాబాద్‌ ఎఫ్‌సీ ఇప్పటికే తర్వాతి దశకు అర్హత పొందాయి. ప్లేఆఫ్స్‌ స్థానాల కోసం రేసు రసవత్తరంగా సాగుతోంది.


అసహనంగానే ఉంది కానీ..: బట్లర్‌

లండన్‌: ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడకుండా ఫ్రాంఛైజీ క్రికెట్‌ వైపు మొగ్గు చూపడం అసహనాన్ని కలిగిస్తోందని.. కానీ వారి పరిస్థితి అర్థం చేసుకోదగ్గదేనని ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ అన్నాడు. మార్చిలో బంగ్లాదేశ్‌ సిరీస్‌ నుంచి అలెక్స్‌ హేల్స్‌, సామ్‌ బిల్లింగ్స్‌, డేవిడ్‌ విల్లీ వైదొలిగిన నేపథ్యంలో బట్లర్‌ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘ఏ సిరీస్‌కు వెళ్లినా అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టును తీసుకెళ్లాలనే అనుకుంటాం. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ నుంచి కొంతమంది కీలక ఆటగాళ్లు తప్పుకున్నారు. ఇది అసహనాన్ని కలిగిస్తోంది. కానీ ఇది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరి షెడ్యూల్‌ అలా ఉంది. వారి పరిస్థితి అర్థం చేసుకోదగ్గదే. ఒకరు అందుబాటులో లేరు అంటే వాళ్లు మరొకరికి అవకాశం కల్పిస్తున్నారని భావించాలి’’ అని బట్లర్‌ అన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-2తో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని