రయ్‌మంటూ.. దూసుకెళ్లేలా..

భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ రేసుకు రంగం సిద్ధమవుతోంది. రేసింగ్‌ అభిమానులకు ఇప్పటికే ఫార్ములావన్‌ గురించి తెలిసే ఉంటుంది.

Updated : 05 Feb 2023 04:35 IST

ప్రత్యేకంగా ఫార్ములా- ఈ జెన్‌3 కార్లు

భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ రేసుకు రంగం సిద్ధమవుతోంది. రేసింగ్‌ అభిమానులకు ఇప్పటికే ఫార్ములావన్‌ గురించి తెలిసే ఉంటుంది. ఇందులో ఇంధనంతో నడిచే కార్లు ట్రాక్‌పై పరుగులు పెడతాయి. కానీ అదే తరహాలో విద్యుత్‌ కార్లతో రేసు నిర్వహిస్తే.. అదే ఫార్ములా-ఈ. ఇప్పుడు ఈ తొమ్మిదో సీజన్‌లో నాలుగో రౌండ్‌ పోటీలకు హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లోని స్ట్రీట్‌ సర్క్యూట్‌ వేదిక కానుంది. ఈ నెల 11న రేసు జరుగుతుంది. ఈ సీజన్‌లోనే తొలిసారిగా మూడో తరం జెన్‌3 కార్లను ప్రవేశపెట్టారు. తక్కువ బరువు, అధిక వేగం, అత్యంత శక్తిమంతం, గొప్ప సామర్థ్యం.. ఇలాంటి ప్రత్యేకతలు ఈ కార్ల సొంతం.


కాస్త చిన్నగా.. తేలిగ్గా

ఈ సీజన్‌ నుంచి ఫార్ములా- ఈలో వాడుతున్న మూడో తరం జెన్‌3 కార్లు జెన్‌2తో పోలిస్తే కాస్త చిన్నగా, తేలిగ్గా మారాయి. గత కార్ల కంటే కూడా ఈ సారి పొడవు, వెడల్పులో 100 మిల్లీమీటర్ల చొప్పున పరిమాణాన్ని తగ్గించారు. అంటే దాదాపు నాలుగు అంగుళాల మేర కార్లు చిన్నవిగా మారాయి. బరువు కూడా 900 నుంచి 840 కిలోలకు తగ్గించారు. ఈ సింగిల్‌ సీటర్‌ కార్లు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటాయి.


బ్రేకులు ముందు మాత్రమే..

ఈ జెన్‌3 కార్లలో కేవలం ముందు మాత్రమే బ్రేకులు ఏర్పాటు చేశారు. వెనకాల బ్రేకులను తీసేసి పూర్తి భిన్నంగా బ్రేకింగ్‌ వ్యవస్థను తీర్చిదిద్దారు. కారులో దాదాపు అన్ని భాగాలను పునర్వినియోగించేందుకు వీలుగా రూపొందించారు. కారు నిర్మాణంలో పునర్వినియోగ కార్బన్‌ ఫైబర్‌ను ఉపయోగించారు. జీవిత కాలం ముగిసిన జెన్‌2 కార్ల నుంచి దీన్ని సేకరించారు. ఈ విద్యుత్‌ కార్లతో సాగే ఫార్ములా- ఈ ఉద్దేశమే కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు పర్యావరణానికి మేలు చేయడం. ఆ దిశగా ఈ మూడో తరం కార్లలో అవసరమైన  ఏర్పాట్లు చేశారు.


322 కిలోమీటర్ల వేగంతో..

ఈ విద్యుత్‌ కార్లలో అధిక ఉష్ణోగ్రతల కట్టడి కోసం శీతలీకరణ సాంకేతికతకు మెరుగుపర్చారు. అందుకోసం కారు ఆకృతిని కాస్త మార్చారు. సూటిగా ఉండే కొనలతో గాలిని చీల్చుకుని వేగంగా పరుగెత్తేలా తీర్చిదిద్దారు. ఫైటర్‌ జెట్‌ స్ఫూర్తితో వీటిని ఇలా రూపొందించారు. చిన్నగా, తక్కువ బరువుతో ఉండే బ్యాటరీలకు అల్ట్రా హైస్పీడ్‌ ఛార్జింగ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. బ్యాటరీ బరువు 285 కిలోలు. అత్యాధునిక సాంకేతికత వాడి బ్యాటరీలను తయారు చేశారు. వీటి జీవిత కాలం ముగిశాక మళ్లీ పునర్వినియోగించొచ్చు. 470 బీహెచ్‌పీ పవర్‌ యూనిట్‌ ఉండడంతో గరిష్ఠంగా 350 కిలోవాట్ల శక్తితో కారు అత్యధికంగా గంటకు 322 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. పూర్తి శక్తిలో 95 శాతాన్ని వాడేలా విద్యుత్‌ మోటార్‌ను రూపొందించారు.


పరుగులు పెడుతూనే..

విద్యుత్‌ శక్తితో నడిచే ఈ కార్లు ట్రాక్‌పై పరుగులు పెట్టే సమయంలోనూ విద్యుత్‌ శక్తిని పునరుత్పత్తి చేయడం విశేషం. ఈ కార్లలో ముందు చక్రాలపైన తొలిసారి పవర్‌ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అమర్చిన మోటార్‌ జనరేటర్‌ యూనిట్‌- కైనెటిక్‌ (ఎమ్‌జీయూ- కె) 250 కిలోవాట్ల శక్తిని, వెనుక చక్రాలపైన ఎమ్‌జీయూ- కె 350 కిలోవాట్లను పునరుత్పత్తి చేయగలదు. దీంతో మొత్తం ఓ రేసులో 600 కిలోవాట్ల శక్తి పునరుత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఇది రేసులో కారు ఉపయోగించే మొత్తం శక్తిలో 40 శాతానికి సమానం.


చక్రాలు వేగంగా..

జెన్‌3 కారు చక్రాల తయారీలో సహజ రబ్బర్‌, పునర్వినియోగ ఫైబర్‌ను 26 శాతం వరకు ఉపయోగించారు. రేసు తర్వాత ఈ చక్రాలను మళ్లీ ఉపయోగించొచ్చు. ప్రస్తుతానికైతే ఈ చక్రాలు సరళ ట్రాక్‌పై వేగంగానే పరుగెత్తుతున్నాయని, కానీ మలుపుల దగ్గర ఎక్కువగా జారుతున్నాయని రేసర్లు అంటున్నారు.


అంతా చేతుల్లోనే..

ఏ కారును నడపాలన్నా డ్రైవర్‌ చేతిలో ఉండే స్టీరింగ్‌ కీలకమైంది. అలాగే ఈ ఫార్ములా- ఈ కార్లలో స్టీరింగ్‌ వీల్‌ అత్యంత ముఖ్యమైంది. రేసర్‌ చేతిలో ఉండే దీనిపై బ్రేక్‌ బయాస్‌, రేడియో, ఎటాక్‌ మోడ్‌, పిట్‌ లేన్‌, మల్టీ స్విచెస్‌ లాంటి మీటలుంటాయి. మధ్యలో ఉండే తెరపై చక్రాల స్థితి, బ్రేక్‌ ఉష్ణోగ్రత, వేగం, శక్తి, బ్యాటరీ తదితర వివరాలు కనిపిస్తాయి. రేసు మధ్యలో డ్రైవర్‌ ఎటాక్‌ మోడ్‌ ఉపయోగించొచ్చు. ఈ మీటను నొక్కడం ద్వారా కారు మరో 35 కిలోవాట్ల శక్తిని అధికంగా అందుకుని వేగంగా వెళ్తుంది. ట్రాక్‌పై నిర్దేశించిన ప్రదేశంలో (యాక్టివేషన్‌ జోన్‌)లో ఈ మోడ్‌ మీటను నొక్కాల్సి ఉంటుంది.


కారు పొడవు: 5.0162 మీటర్లు ఎత్తు: 1.023 మీ.
వెడల్పు: 1.7 మీటర్లు
వీల్‌బేస్‌ (ముందు,వెనుక చక్రాల మధ్య దూరం): 2.970 మీటర్లు
కనీస బరువు (డ్రైవర్‌తో సహా): 840 కిలోలు
గరిష్ఠ శక్తి: 350 కిలోవాట్లు(470బీహెచ్‌పీ)
గరిష్ఠ వేగం: 322 కిలోమీటర్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని