Rohit Sharma: రోహిత్‌కు ‘టెస్టు’

కోహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. టీమ్‌ఇండియా పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ప్రయాణం ప్రస్తుతం బాగానే సాగుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతనిది మెరుగైన రికార్డే. కానీ టెస్టుల విషయానికి వస్తే.. ఇప్పటివరకూ సారథిగా సరైన పరీక్ష ఎదుర్కొలేదు.

Updated : 06 Feb 2023 07:30 IST

ఈనాడు క్రీడావిభాగం: కోహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. టీమ్‌ఇండియా పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ప్రయాణం ప్రస్తుతం బాగానే సాగుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతనిది మెరుగైన రికార్డే. కానీ టెస్టుల విషయానికి వస్తే.. ఇప్పటివరకూ సారథిగా సరైన పరీక్ష ఎదుర్కొలేదు. ఇప్పుడీ సుదీర్ఘ ఫార్మాట్లో ఆస్ట్రేలియా రూపంలో కఠిన సవాలు ఆహ్వానిస్తోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో ఈ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ భారత్‌కు అత్యంత కీలకం. రోహిత్‌ నాయకత్వ భవితవ్యాన్ని కూడా ఈ సిరీస్‌ నిర్ణయించనుంది! మరి ఈ ప్రతిష్ఠాత్మక సమరంలో రోహిత్‌ జట్టును ఎలా నడిపిస్తాడో?

పీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ సారథిగా అద్భుతమైన ప్రదర్శన, అనుభవమే బలంగా రోహిత్‌ టీమ్‌ఇండియా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్‌గా అతను ఉత్తమంగానే రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ వన్డేలు, టీ20ల్లో కలిపి అతని నాయకత్వంలో జట్టు 75 మ్యాచ్‌లకు గాను 58 విజయాలు సాధించింది. 17 మ్యాచ్‌ల్లో ఓడింది. నిరుడు టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో జట్టు నిష్క్రమణ ఒక్కటే ప్రతికూలాంశం. మరోవైపు 2022 ఫిబ్రవరిలో సుదీర్ఘ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఎంపికైన అతను.. ఆ తర్వాత కేవలం రెండు టెస్టుల్లోనే జట్టును నడిపించాడు. గాయాల కారణంగా మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు, టీమ్‌ఇండియాకు మధ్య ఆస్ట్రేలియా ఉంది. మరి ఈ కంగారూ పరీక్షను రోహిత్‌ ఎలా ఎదుర్కొంటాడన్నది కీలకం.  ఈ సిరీస్‌లో జట్టుకు విజయాల బాట వేయాల్సిన బాధ్యత అతనిపై ఉంది.


బ్యాటింగ్‌తోనూ..

నాయకత్వంతో పాటు రోహిత్‌ బ్యాటింగ్‌తోనూ ఈ సిరీస్‌లో మెప్పించాల్సి ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లోని అతని మెరుపులు, నిలకడ, ఫామ్‌ టెస్టుల్లో లేదనే చెప్పాలి. 2013లో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌లో టెస్టు అరంగేట్రం చేసిన అతను.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతకాలు సాధించాడు. కానీ ఆ తర్వాత మూడో శతకం కోసం మరో 19 మ్యాచ్‌ల వరకూ ఎదురు చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా విదేశాల్లో పేలవ ప్రదర్శన చేశాడు. స్వదేశంలో 2019 దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో టెస్టుల్లోనూ ఓపెనర్‌గా మారడంతో అతని దశ తిరిగింది. విశాఖలో ఓపెనర్‌గా తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేశాడు. మూడో మ్యాచ్‌లో ఏకంగా ద్విశతకం బాదేశాడు. 2021 ఇంగ్లాండ్‌ సిరీస్‌లోనూ రాణించాడు. రోహిత్‌ టెస్టుల్లో ఇప్పటివరకూ 77 ఇన్నింగ్స్‌ల్లో 46.13 సగటుతో 3137 పరుగులు చేశాడు. అందులో ఓ ద్విశతకం, 7 శతకాలున్నాయి. అయితే ఓపెనర్‌గా 30 ఇన్నింగ్స్‌ల్లో 55.42 సగటుతో 1552 పరుగులు సాధించడం విశేషం. ఓపెనర్‌గానే డబుల్‌ సెంచరీ చేసిన అతను.. మరో నాలుగు శతకాలు ఖాతాలో వేసుకున్నాడు. కానీ గాయాల కారణంగా ఇటీవల అతని టెస్టు కెరీర్‌ సజావుగా సాగడం లేదు. టీమ్‌ఇండియా ఆడిన గత 10 టెస్టుల్లో 8 మ్యాచ్‌లకు దూరంగానే ఉన్నాడు. చివరగా నిరుడు మార్చిలో శ్రీలంకతో రెండు టెస్టుల్లో కలిపి 90 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో అతను బ్యాట్‌తోనూ రాణించి సహచరుల్లో స్ఫూర్తి నింపాల్సిన అవసరం ఉంది. కంగారూ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని జట్టుకు అతనందించే ఆరంభాలే మ్యాచ్‌లో కీలకమవుతాయి. అతను విఫలమైతే మాత్రం మిడిలార్డర్‌పై భారం పడుతుంది.


ఆ ప్రమాదం..

మరోవైపు అన్ని ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు అందుకుని, టీమ్‌ఇండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికైన ఏడాదికే అతణ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే టీ20ల్లో హార్దిక్‌ పాండ్య జట్టును నడిపిస్తున్నాడు. నిరుడు ప్రపంచకప్‌ సెమీస్‌లో పరాజయం తర్వాత టీమ్‌ఇండియా ఆడిన అన్ని టీ20లకు అతనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పటి నుంచి రోహిత్‌ ఒక్క టీ20 మ్యాచ్‌ కూడా ఆడలేదు. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌ దిశగా యువ జట్టును సిద్ధం చేసేలా బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. రోహిత్‌ మళ్లీ జట్టులోకి రావడంతో పాటు పగ్గాలు చేపట్టడం దాదాపు అసాధ్యమే. ఇక వన్డేల్లో ఈ ఏడాది స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌ అతని భవితవ్యాన్ని నిర్దేశించనుంది. సొంతగడ్డపై టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగనున్న టీమ్‌ఇండియాకు ఆ మెగాటోర్నీలో ప్రతికూల ఫలితాలు వస్తే రోహిత్‌ సారథ్యంపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు టెస్టుల్లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ అతనికి అగ్ని పరీక్షగా మారింది. ఆసీస్‌ ఇప్పుడు నంబర్‌వన్‌ టెస్టు జట్టు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో ఏదైనా తేడా జరిగి, జట్టు ఓటమి పాలైతే మాత్రం టెస్టు కెప్టెన్‌గా అతని ప్రయాణం పూర్తి స్థాయిలో మొదలు కాకముందే ముగిసే ప్రమాదం ఉంది. అదే జట్టుపై విజయంతో టీమ్‌ఇండియాను డబ్ల్యూటీసీ ఫైనల్లో నిలబెట్టడంతో పాటు, ఆ తర్వాత టైటిల్‌ కూడా అందిస్తే అంతకుమించి ఆనందం మరొకటి ఉండదు.


సవాళ్లివే..

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా రోహిత్‌కు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. ముందుగా కీలక ఆటగాళ్ల గైర్హాజరీ సమస్యగా మారింది. ప్రధాన పేసర్‌ బుమ్రా, వికెట్‌ కీపర్‌ పంత్‌ జట్టుకు దూరమయ్యారు. శ్రేయస్‌ అయ్యర్‌ కనీసం ఒక టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. సొంతగడ్డపై సిరీస్‌ కాబట్టి స్పిన్నర్లదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో బుమ్రా లేని లోటు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ దూకుడైన ఆటతో, ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే పంత్‌, స్పిన్‌ను బాగా ఆడతాడనే పేరున్న శ్రేయస్‌ లేకపోవడం ఇబ్బందే. 2021 ఆరంభం నుంచి ఉపఖండ పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ఉత్తమ బ్యాటర్లు వీళ్లిద్దరే. అదే సమయంలో ఆసియాలో పుజారా, కోహ్లి సగటు వరుసగా 34.61, 23.85 మాత్రమే. భారత్‌ అంటే స్పిన్‌ పిచ్‌లకు పేరు. కానీ ఈ సారి సిరీస్‌లో మరీ స్పిన్‌కు అనుకూలంగా పిచ్‌లు వద్దని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుతోందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జట్టులో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే నాణ్యమైన ఆటగాళ్లు ఎక్కువగా లేకపోవడమే కారణం కావొచ్చు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో జట్టు తడబాటే అందుకు నిదర్శనం. అందుకే పిచ్‌ల విషయంలో టీమ్‌ఇండియా జాగ్రత్త పడుతోంది. అందుకే ఆస్ట్రేలియాకు ఈ సారి సిరీస్‌ గెలిచేందుకు అవకాశం ఉందని చర్చ మొదలైంది. మరి ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు రోహిత్‌ ఎలాంటి వ్యూహాలను అమలు పరుస్తాడన్నది ఆసక్తికరం. ఇక అనుభవజ్ఞులైన అశ్విన్‌, పుజారా, ఉమేశ్‌, కోహ్లి, జడేజా, షమి, ప్రతిభావంతులైన కేఎల్‌ రాహుల్‌, సిరాజ్‌, అక్షర్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ జట్టులో ఉండడం రోహిత్‌కు ధైర్యాన్నిచ్చే విషయమే. పైగా సొంతగడ్డ పరిస్థితులు పెద్ద సానుకూలాంశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని