Ravi Shastri: అశ్విన్‌.. అతి ప్రణాళికలు వద్దు

స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఫామ్‌ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఫలితాన్ని నిర్ణయిస్తుందని టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

Published : 07 Feb 2023 08:43 IST

నాగ్‌పుర్‌: స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఫామ్‌ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఫలితాన్ని నిర్ణయిస్తుందని టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్‌కు వ్యతిరేకంగా అశ్విన్‌కు అతి ప్రణాళికలకు వెళ్లాల్సిన అవసరం లేదని రవిశాస్త్రి తెలిపాడు. ఆసీస్‌ గడ్డపై వరుసగా రెండు పర్యటనల్లో సిరీస్‌ విజయాలు సాధించిన టీమ్‌ఇండియాకు రవిశాస్త్రి చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ‘‘అశ్విన్‌.. అతిగా ప్రణాళికలు రచించాల్సిన అవసరం లేదు. అతను ముఖ్యమైన ఆటగాడు కాబట్టి తన వ్యూహాలకు కట్టుబడి ఉంటే చాలు. సిరీస్‌ భవితవ్యాన్ని అతడి ఫామ్‌ నిర్ణయించొచ్చు. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. జట్టుకు కీలకమైన పరుగులూ అందించగలడు. అశ్విన్‌ విజృంభిస్తే అది సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. దాదాపు అన్ని వేదికల్లో అతను ప్రపంచ స్థాయి బౌలరే. కాని భారత పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకరం. బంతి స్పిన్‌ తిరగడం ప్రారంభమై.. పిచ్‌ నుంచి సహకారం లభిస్తే బ్యాటర్లందరినీ ఇబ్బంది పెడతాడు. కాబట్టి అశ్విన్‌ అతిగా ఆలోచించి.. అనవసర ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే బౌలింగ్‌ చేయాలి. మిగతా పనిని పిచ్‌ను చేయనివ్వండి. మూడో స్పిన్నర్‌ విషయానికొస్తే కుల్‌దీప్‌ యాదవ్‌ను నేరుగా ఆడించాలని కోరుకుంటా. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లు సారూప్యమైన బౌలర్లు. కుల్‌దీప్‌ భిన్నం. తొలి రోజు బంతిని తిప్పగలిగేది కుల్‌దీప్‌ మాత్రమే’’ అని రవిశాస్త్రి వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని