సంక్షిప్త వార్తలు (7)

ఆస్ట్రేలియాతో సిరీస్‌ నేపథ్యంలో భారత క్రికెటర్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. కంగారూలకు చెక్‌ పెట్టడం కోసం విపరీతంగా తిరిగే పిచ్‌లు తయారు చేయడం.. మనల్నే దెబ్బతీసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో భారత బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎక్కువ సేపు ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

Published : 08 Feb 2023 03:08 IST

స్పిన్‌.. స్పిన్‌.. స్పిన్‌

నాగ్‌పుర్‌: ఆస్ట్రేలియాతో సిరీస్‌ నేపథ్యంలో భారత క్రికెటర్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. కంగారూలకు చెక్‌ పెట్టడం కోసం విపరీతంగా తిరిగే పిచ్‌లు తయారు చేయడం.. మనల్నే దెబ్బతీసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో భారత బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎక్కువ సేపు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అనామక ఆసీస్‌ స్పిన్నర్‌ ఒకీఫె ఆరేళ్ల కింద పుణె టెస్టులో స్పిన్‌ పిచ్‌పై ఏకంగా 12 వికెట్లు పడగొట్టి భారత్‌కు షాకిచ్చాడు. అతడు కెరీర్‌ మొత్తంలో పడగొట్టింది 35 వికెట్లే. ఆ తర్వాత బెంగళూరు టెస్టులో లైయన్‌ భారత బ్యాటర్లను పరీక్షించాడు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భారత బ్యాటర్లు ఏకంగా తొమ్మిది మంది స్పెషలిస్ట్‌ స్పిన్నర్లను ప్రాక్టీస్‌ కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇందులో నలుగురు ప్రధాన జట్టు సభ్యులు కాగా.. అయిదుగురు స్పిన్నర్లు దేశవాళీ స్పిన్నర్లు. ఆఫ్‌స్పిన్నర్లు పుల్‌కిత్‌, జయంత్‌.. లెగ్‌స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌, ఎడమచేతివాటం స్పిన్నర్‌ సాయికిశోర్‌లు బ్యాటర్లకు ఎక్కువ బంతులేశారు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. స్వీప్‌షాట్‌కు సంబంధించి శుభ్‌మన్‌ గిల్‌కు కిటుకులు చెప్పడం కనిపించింది. ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ బంతులేస్తుంటే గిల్‌ క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ కూడా చేశాడు.


వేలానికి 409 మంది

మహిళల ప్రిమియర్‌ లీగ్‌

ముంబయి: ఆరంభ మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మార్చి 4 నుంచి 26 వరకు జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది. వేలంలో 409 మంది క్రికెటర్లు ఉంటారని తెలిపింది. ఇందులో 246 మంది భారతీయులు, 163 మంది విదేశీయులు. వేలంలో అత్యధిక కనీస ధర రూ.50 లక్షలు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, అలీసా హీలీ, సోఫీ ఎకిల్‌స్టోన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు ఇందులో ఉన్నారు. వేలం ద్వారా 90 (విదేశీయులు 30) మంది క్రీడాకారిణులు మాత్రమే అమ్ముడయ్యే వీలుంది. వేలం కోసం మొత్తం 1525 మంది క్రికెటర్లు పేర్లను నమోదు చేసుకోగా.. జాబితాను బోర్డు కుదించింది. డబ్ల్యూపీఎల్‌ వేలం ఈ నెల 13న జరుగుతుంది.


స్మిత్‌ను ఆరుసార్లు ఔట్‌ చేశా: మహేశ్‌

నాగ్‌పుర్‌: భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాదిరే తానూ బౌలింగ్‌ చేయాలనుకునేవాడినని యువ స్పిన్నర్‌ మహేశ్‌ పితియా అన్నాడు. మంగళవారం తన ఆరాధ్య బౌలర్‌ అశ్విన్‌ను కలిసిన అతడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘‘అశ్విన్‌లాగే ఎప్పుడూ బౌలింగ్‌ చేయాలనుకునేవాడిని.. ఈరోజు నా ఆరాధ్య బౌలర్‌ ఆశీస్సులు తీసుకున్నా. కంగారూ బ్యాటర్లకు  ఏ విధంగా బౌలింగ్‌ చేశావని అశ్విన్‌ ఆరా తీశాడు. ఆసీస్‌ నెట్స్‌లో తొలిరోజు కనీసం ఆరుసార్లు స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఔట్‌ చేశా’’ అని 21 ఏళ్ల మహేశ్‌ చెప్పాడు. విరాట్‌ కోహ్లి కూడా తనను చూసి నవ్వి.. సంజ్ఞలతో శుభాకాంక్షలు తెలిపాడని ఈ యువ స్పిన్నర్‌ తెలిపాడు. బరోడాకు చెందిన మహేశ్‌ ఇప్పటిదాకా 4 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లే ఆడాడు.


ఆసీస్‌ 2-1తో.. ఖవాజా హీరో!

కోల్‌కతా: భారత గడ్డపై టెస్టుల్లో ఆస్ట్రేలియా రికార్డు ఏమంత గొప్పగా లేనప్పటికీ.. రాబోయే బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆ జట్టుదే సిరీస్‌ విజయమని దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ జేపీ డుమిని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో సొంతం చేసుకుంటుందని అతను జోస్యం చెప్పాడు. ‘‘సిరీస్‌ హోరాహోరీగా సాగుతుందని నా అంచనా. అయితే ఆస్ట్రేలియాకే సిరీస్‌ గెలిచే అవకాశాలున్నాయని నేను నమ్ముతున్నా. ప్రత్యర్థిని జయించే ఆటగాళ్లు ఆ జట్టుకున్నారు. ఆసీస్‌ 2-1 తేడాతో సిరీస్‌ సాధిస్తుందనిపిస్తోంది. ఉస్మాన్‌ ఖవాజా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలుస్తాడు’’ అని డుమిని అన్నాడు. భారత్‌కు బౌలింగ్‌లో అశ్విన్‌.. బ్యాటింగ్‌లో కోహ్లి, పుజారా కీలకమవుతారని డుమిని అభిప్రాయపడ్డాడు.


యుద్ధం కొనసాగితే రష్యా ఉండదు: పారిస్‌ మేయర్‌

పారిస్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగితే 2024 ఒలింపిక్స్‌లో రష్యా బృందాన్ని అనుమతించబోమని పారిస్‌ మేయర్‌ ఆనె హిడాల్గో హెచ్చరించారు. రష్యా అథ్లెట్లు తటస్థ క్రీడాకారులుగా పాల్గొనవచ్చని గతంలో పేర్కొన్న హిడాల్గో మంగళవారం తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ‘‘ఉక్రెయిన్‌పై దురాక్రమణ కొనసాగుతున్నంత కాలం రష్యా క్రీడాకారులపై నిషేధం ఉండాలని కోరుకుంటున్నా. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురుస్తుంటే ఏమీ జరగనట్లుగా పారిస్‌లో కవాతు చేయడం కుదరదు’’ అని హిడాల్గో పేర్కొన్నారు.


ఐసీసీ అవార్డు రేసులో సిరాజ్‌, గిల్‌

దుబాయ్‌: టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌లు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంథ్‌ అవార్డు రేసులో నిలిచారు. జనవరిలో ఉత్తమ  ప్రదర్శనకు గాను సిరాజ్‌, గిల్‌ పేర్లను అవార్డుకు సిఫార్సు చేశారు. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే కూడా రేసులో ఉన్నాడు.


నేపాల్‌ చేతిలో భారత్‌ ఓటమి

ఢాకా: శాఫ్‌ అండర్‌-20 మహిళల ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మంగళవారం 1-3తో నేపాల్‌ చేతిలో ఓడిపోయింది. 21వ నిమిషంలో అపర్ణ గోల్‌తో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ బలంగా పుంజుకున్న నేపాల్‌ అంజలి (48వ), ప్రీతి (69వ), అమీసా (89వ) గోల్స్‌తో మ్యాచ్‌లో పైచేయి సాధించింది. ఈ ఓటమితో భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. భారత్‌ మూడు మ్యాచ్‌ల నుంచి నాలుగు పాయింట్లు సంపాదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని