కర్ణాటకను ఆదుకున్న మయాంక్‌

సౌరాష్ట్రతో రంజీ సెమీస్‌లో కర్ణాటకను కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (110 బ్యాటింగ్‌; 246 బంతుల్లో 11×4, 1×6) అజేయ శతకంతో ఆదుకున్నాడు.

Published : 09 Feb 2023 01:43 IST

సౌరాష్ట్రతో రంజీ సెమీస్‌

బెంగళూరు: సౌరాష్ట్రతో రంజీ సెమీస్‌లో కర్ణాటకను కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (110 బ్యాటింగ్‌; 246 బంతుల్లో 11×4, 1×6) అజేయ శతకంతో ఆదుకున్నాడు. బుధవారం ఆరంభమైన ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన కర్ణాటక మొదటి రోజును 229/5తో ముగించింది. 112కే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును శ్రీనివాస్‌ శరత్‌ (58 బ్యాటింగ్‌; 143 బంతుల్లో 4×4)తో కలిసి మయాంక్‌ రక్షించాడు. మరో వికెట్‌ పడకుండా ఈ జోడీ ఆచితూచి బ్యాటింగ్‌ కొనసాగించింది. ఈ జంట అబేధ్యమైన ఆరో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. సౌరాష్ట్ర బౌలర్లలో కుశాంగ్‌ (2/64) రాణించాడు. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మధ్యప్రదేశ్‌తో మరో సెమీస్‌లో బెంగాల్‌కు అదిరే ఆరంభం లభించింది. ఇండోర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సుదీప్‌ కుమార్‌ (112; 213 బంతుల్లో 12×4, 2×6), అనుత్సుప్‌ మజుందార్‌ (120; 206 బంతుల్లో 13×4, 1×6) శతకాలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. వీళ్ల శతకాల సాయంతో తొలి రోజు ఆటను 307/4తో ముగించింది. సుదీప్‌, అనుత్సుప్‌ మూడో వికెట్‌కు 241 పరుగులు జోడించారు. ఆఖర్లో కొత్త బంతితో ఈ ఇద్దరినీ ఔట్‌ చేయడం మధ్యప్రదేశ్‌కు ఊరటనిచ్చే విషయం. కెప్టెన్‌ మనోజ్‌ తివారి (5 బ్యాటింగ్‌), షాబాజ్‌ అహ్మద్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని