IND vs AUS: ఉచ్చులో పడ్డారు
కాస్త తడబడితేనేమీ.. కాస్త పరీక్షను ఎదుర్కొంటేనేమీ.. సొంతగడ్డపై టీమ్‌ఇండియాకు ఎదురులేదని మరోసారి రుజువైంది.
జడేజా మాయ
ఆసీస్ 113కే ఆలౌట్
భారత్‌దే రెండో టెస్టు
కాస్త తడబడితేనేమీ.. కాస్త పరీక్షను ఎదుర్కొంటేనేమీ.. సొంతగడ్డపై టీమ్‌ఇండియాకు ఎదురులేదని మరోసారి రుజువైంది. తొలి రెండు రోజుల ఆటతో కోట్లాను కొట్టేయొచ్చనుకున్న ఆసీస్‌కు శరాఘాతం!
కంగారూలను స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరిబిక్కిరి చేసిన భారత్.. రెండో టెస్టులోనూ నెగ్గి సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంది. హీరో రవీంద్ర జడేజా!
మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తనకంటూ అవకాశాలు సృష్టించుకున్నా.. టీమ్‌ఇండియా పుంజుకున్న తీరు అద్భుతం. కఠినమైన పిచ్‌పై మూడో రోజు ప్రత్యర్థి కనీసం 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినా ఛేదించడం కష్టం అనుకుంటే, ఓ దశలో ఆ జట్టు 85/2తో ఇంకా మంచి స్కోరే సాధించేలా కనిపించి భయపెట్టింది. కానీ జడేజా స్పిన్ మాయాజాలానికి దాసోహమంటూ 28 పరుగుల తేడాలో చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి కుప్పకూలింది.
అయినా భారత్ పని తేలిక కాలేదు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమ్‌ఇండియాకు చెమటోడ్చక తప్పలేదు. వందో టెస్టు ఆడుతున్న పుజారా.. క్లిష్ట పరిస్థితుల్లో ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచి జట్టును విజయపథంలో నడిపించాడు. అసలైన బహుమతి ఏంటంటే.. ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తుకు భారత్ మరింత చేరువైంది.
ఆస్ట్రేలియాలో ఆశలు రేగినా దిల్లీలో ఆఖరికి టీమ్‌ఇండియాదే పైచేయి. మూడు రోజుల్లోనే ఖేల్‌ఖతం. జడేజా (7/42) విజృంభించిన వేళ రెండో టెస్టులో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్ స్కోరు 61/1తో మూడో రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. జడేజా ధాటికి 113 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. హెడ్ (43), లబుషేన్ (35) మినహా ఆసీస్ బ్యాటర్లలో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి కష్టంగా ఛేదించింది. రోహిత్ (31; 20 బంతుల్లో 3×4, 2×6) ధాటైన బ్యాటింగ్‌తో విలువైన పరుగులు చేయగా.. పుజారా (31 నాటౌట్; 74 బంతుల్లో 4×4), భరత్ (23 నాటౌట్; 22 బంతుల్లో 3×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌తో కంగారూలకు అడ్డుగా నిలిచారు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది 100వ విజయం కావడం విశేషం. జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.మూడో టెస్టు మార్చి 1న ఇండోర్‌లో ఆరంభమవుతుంది.
జడ్డూ చుట్టేశాడు: బ్యాటింగ్‌కు అత్యంత కఠినంగా ఉన్న పిచ్‌పై టీమ్‌ఇండియా ముందు స్వల్ప లక్ష్యమే నిలిచిందంటే ప్రధాన కారణం జడేజానే. కంగారూలను అతడు తన స్పిన్‌తో బెంబేలెత్తించాడు. పేలవ షాట్లూ కంగారూలను ముంచాయి. బంతి తక్కువ ఎత్తులో వస్తున్న పిచ్‌పై ఆరుగురు ఆసీస్ బ్యాటర్లు స్వీప్ లేదా రివర్స్ స్వీఫ్ షాట్లకు ఔట్ కావడం గమనార్హం. జడేజా బంతిని పెద్దగా స్పిన్ చేయకుండానే ఆ జట్టును దెబ్బతీశాడు. ఓవర్‌నైట్ స్కోరు 61/1తో మూడో రోజు బ్యాటింగ్‌ను కొనసాగించిన ఆసీస్.. హెడ్ వికెట్‌ను కోల్పోయినా ఓ దశలో 85/2తో నిలవడంతో భారత్‌కు ఆందోళన తప్పలేదు. ఎందుకంటే ఆ పిచ్‌పై 150 లక్ష్యాన్ని ఛేదించడం కూడా కష్టమన్నది అంచనా. పైగా బ్యాటర్లు స్వీప్ షాట్లు బాగా ఆడుతున్నారు. కానీ జడేజా ఆ జట్టు ఆట సాగనివ్వలేదు. అయితే మూడో రోజు ఆ జట్టు పతనానికి బలమైన పునాది వేసింది మాత్రం అశ్వినే. మొదట హెడ్‌ను ఔట్ చేసిన అతడు.. కీలక సమయంలో స్మిత్ (9)ను వెనక్కి పంపాడు. స్లాగ్ స్వీప్ ఆడబోయిన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ ఆసీస్ మంచి స్థితిలోనే ఉంది. కానీ ఆసీస్ లైనప్‌ను జడేజా కకావికలం చేశాడు. ఆ జట్టు ఒకే స్కోరు (ఆసీస్ 95) వద్ద ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌లో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఇందులో జడేజా తీసినవే మూడు. ఓ బంతిని నేరుగా వేసి లబుషేన్‌ను బౌల్డ్ చేసిన అతడు.. తన తర్వాతి ఓవర్లో హ్యాండ్స్‌కాంబ్ (0), కమిన్స్ (0)ను వెనక్కి పంపాడు. హ్యాండ్స్‌కాంబ్ క్యాచ్ ఔట్ కాగా.. స్వీప్ షాట్ ఆడబోయి కమిన్స్ బౌల్డయ్యాడు. వీళ్లకన్నా ముందు అశ్విన్ బౌలింగ్‌లో స్వీప్ చేసే ప్రయత్నంలో రెన్‌షా (2) వికెట్ల ముందు దొరికిపోయాడు. కేరీ (7)దీ అదే కథ. పెద్దగా టర్న్ కాని జడేజా బంతిని రివర్స్ స్వీప్ చేసే ప్రయత్నంలో బోల్తా కొట్టాడు. బౌల్డై ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించాడు. లైయన్ (8), కునెమన్ (0)లను జడ్డూ ఎంతో సేపు నిలవనివ్వలేదు. ఇద్దరినీ బౌల్డ్ చేశాడు.
పుజారా నిలిచాడు: లక్ష్యం చిన్నదే అయినా తేలికైందేమీ కాదు. ఈ నేపథ్యంలో రాహుల్ (1) పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. రెండో ఓవర్లోనే అతణ్ని ఔట్ చేయడం ద్వారా భారత్‌కు లైయన్ షాకిచ్చాడు. లంచ్ సమయానికి స్కోరు 14/1. అయితే లంచ్ తర్వాత రోహిత్ ఎటాకింగ్‌కు దిగాడు. తక్కువ ఎత్తులో బంతి వస్తున్న పిచ్‌పై స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో చూపిస్తూ విలువైన పరుగులు చేశాడు. లైయన్ ఓవర్లో లాఫ్టెడ్ షాట్‌తో సిక్స్, స్వీప్‌తో ఫోర్ కొట్టిన అతడు.. కునెమన్ ఓవర్లోనూ ఓ సిక్స్ దంచాడు. ఓ వైపు పుజారా నిలబడితే.. మరోవైపు బ్యాటర్ ధాటిగా ఆడి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాలన్నది జట్టు ఆలోచన. దానికి తగ్గట్లే బ్యాటింగ్ చేసిన రోహిత్.. దురదృష్టవశాత్తు జోరు మీదున్న దశలో పుజారాతో సమన్వయ లోపంతో రనౌటయ్యాడు. మరోవైపు పుజారా మాత్రం పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆసీస్ బౌలర్లు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కోహ్లి (20; 31 బంతుల్లో 3×4), శ్రేయస్ (12; 10 బంతుల్లో 1×4, 1×6) కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగారు. ముందుకొచ్చి ఆడబోయిన కోహ్లి స్టంపౌట్ కాగా.. శ్రేయస్ డీప్ మిడ్‌వికెట్లో దొరికిపోయాడు. అయితే భారత్ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగింది. కానీ ముప్పు మాత్రం తొలగిపోలేదు. శ్రేయస్ ఔటయ్యేప్పటికి స్కోరు 88/4. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన వికెట్‌కీపర్ కేఎస్ భరత్.. ఆస్ట్రేలియాకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్‌ను వేగంగా లక్ష్యం దిశగా నడిపించాడు. మర్ఫీ బౌలింగ్‌లో పుజారా ముందుకొచ్చి బౌండరీ సాధించడంతో టీమ్‌ఇండియా విజయాన్నందుకుంది.
రాహుల్‌కు మద్దతిస్తూనే ఉంటాం: ద్రవిడ్
టీమ్‌ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి మద్దతుగా నిలిచాడు. ‘‘రాహుల్ కెరీర్‌లో ఇది ఒక దశ మాత్రమే. అతడు విదేశాల్లో మా విజయవంతమైన ఓపెనర్లలో ఒకడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లలో శతకాలు సాధించాడు. రాహుల్‌కు మా మద్దతు కొనసాగిస్తాం. ప్రస్తుత స్థితి నుంచి బయటపడే నైపుణ్యం రాహుల్ వద్ద ఉంది’’ అని ద్రవిడ్ అన్నాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263
భారత్ తొలి ఇన్నింగ్స్: 262
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖవాజా (సి) శ్రేయస్ (బి) జడేజా 6; హెడ్ (సి) భరత్ (బి) అశ్విన్ 43; లబుషేన్ (బి) జడేజా 35; స్మిత్ ఎల్బీ (బి) అశ్విన్ 9; రెన్‌షా ఎల్బీ (బి) అశ్విన్ 2; హ్యాండ్స్‌కాంబ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; కేరీ (బి) జడేజా 7; కమిన్స్ (బి) జడేజా 0; లైయన్(బి) జడేజా 8; మర్ఫీ నాటౌట్ 3; కునెమన్ (బి) జడేజా 0; ఎక్స్‌ట్రాలు 0 మొత్తం: (31.1 ఓవర్లలో ఆలౌట్) 113; వికెట్ల పతనం: 1-23, 2-65, 3-85, 4-95, 5-95, 6-95, 7-95, 8-110, 9-113; బౌలింగ్: అశ్విన్ 16-3-59-3; షమి 2-0-10-0; జడేజా 12.1-1-42-7; అక్షర్ పటేల్ 1-0-2-0
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ రనౌట్ 31; రాహుల్ (సి) కేరీ (బి) లైయన్ 1; పుజారా నాటౌట్ 31; కోహ్లి (స్టంప్డ్) కేరీ (బి) మర్ఫీ 20; శ్రేయస్ అయ్యర్ (సి) మర్ఫీ (బి) లైయన్ 12; భరత్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 0 మొత్తం: (26.4 ఓవర్లలో 4 వికెట్లకు) 118; వికెట్ల పతనం: 1-6, 2-39, 3-69, 4-88; బౌలింగ్: కునెమన్ 7-0-38-0; లైయన్ 12-3-49-2; మర్ఫీ 6.4-2-22-1; ట్రావిస్ హెడ్ 1-0-9-0
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..
-
Sports News
ఆసియా కప్‌కు పాక్ దూరం?