అమ్మాయ్‌ అదరగొట్టెయ్‌

ఒక్క మ్యాచ్‌తో ఆరంభమై.. మూడు జట్ల ఛాలెంజర్‌ టోర్నీగా మారి.. ఇప్పుడు పూర్తిస్థాయిలో రూపు దిద్దుకున్న మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభం నేడే!జట్ల బిడ్డింగ్‌తోనే సంచలనం సృష్టించి.. ప్రసార హక్కులతో రికార్డులు బద్దలు కొట్టి.. వేలంలో అమ్మాయిలపై అనూహ్య రీతిలో రూ.కోట్ల వర్షం కురిపించి.. ఇలా ప్రతి అడుగు.. ప్రతి దశలోనూ అదరగొట్టి.

Updated : 04 Mar 2023 13:56 IST

నేటి నుంచే మహిళల ప్రిమియర్‌ లీగ్‌
తొలి మ్యాచ్‌లో
గుజరాత్‌ × ముంబయి
రాత్రి 7.30 నుంచి

క్క మ్యాచ్‌తో ఆరంభమై.. మూడు జట్ల ఛాలెంజర్‌ టోర్నీగా మారి.. ఇప్పుడు పూర్తిస్థాయిలో రూపు దిద్దుకున్న మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఆరంభం నేడే!

జట్ల బిడ్డింగ్‌తోనే సంచలనం సృష్టించి.. ప్రసార హక్కులతో రికార్డులు బద్దలు కొట్టి.. వేలంలో అమ్మాయిలపై అనూహ్య రీతిలో రూ.కోట్ల వర్షం కురిపించి.. ఇలా ప్రతి అడుగు.. ప్రతి దశలోనూ అదరగొట్టి.. ఆరంభానికి ముందే అంచనాలు పెంచేసిన డబ్ల్యూపీఎల్‌కు శ్రీకారం నేడే!

కొన్నేళ్ల నిరీక్షణ ముగిసింది.. ఇక కొత్త చరిత్రకు అడుగు పడనుంది. డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌కు శనివారమే తెరలేవనుంది. ఇక ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకుంటూ.. అదరహో అనిపించే ఫీల్డింగ్‌ విన్యాసాలు.. అదరగొట్టే బ్యాటింగ్‌ ఇన్నింగ్స్‌లు.. అబ్బురపరిచే బౌలింగ్‌ ప్రదర్శనలతో చెలరేగేందుకు అమ్మాయిలు సిద్ధం. అభిమానులు ధనాధన్‌ కిక్కులో మునిగిపోవడమే ఇక ఆలస్యం.

ముంబయి: డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌కు రంగం సిద్ధమైంది. 5 జట్లు.. 87 మంది క్రికెటర్లు.. 22 మ్యాచ్‌లు.. 23 రోజుల పాటు టీ20 పండగే పండగ. 15 ఏళ్ల టీనేజర్ల నుంచి సీనియర్ల వరకూ ప్రపంచ స్థాయి క్రికెటర్లతో కలిసి ఆడుతూ.. కలబడి తలపడుతూ.. అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ సమరానికి సై అంటున్నాయి. ఈ నెల 26న జరిగే తుదిపోరులో గెలిచి డబ్ల్యూపీఎల్‌ మొట్టమొదటి సీజన్‌ విజేతగా నిలిచేందుకు ఈ అయిదు జట్లు పోరాటానికి తయారయ్యాయి. శనివారం గుజరాత్‌ జెయింట్స్‌తో ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌తో లీగ్‌ ఆరంభమవుతుంది. డీవై పాటిల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ సీజన్‌లో మ్యాచ్‌లన్నింటీకి ముంబయిలోని డీవై పాటిల్‌తో పాటు బ్రబౌర్న్‌ స్టేడియం వేదికలు. స్పోర్ట్స్‌18 నెట్‌వర్క్‌లో మ్యాచ్‌లు ప్రసారమవుతాయి. జియో సినిమా యాప్‌లోనూ వీక్షించొచ్చు. ఐపీఎల్‌తో పాటు అమ్మాయిల కోసం 2018లో మహిళల టీ20 ఛాలెంజ్‌ టోర్నీని ఆరంభించారు. ఆ ఏడాది రెండు జట్ల మధ్య ఒకే మ్యాచ్‌ నిర్వహించారు. 2019, 2020, 2022లో మూడు జట్లతో ఈ టోర్నీ జరిగింది.

ఈ మూడు ఐపీఎల్‌ జట్లు..

ఇప్పటికే ఐపీఎల్‌లో జట్లను కలిగి ఉన్న ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లోనూ బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే అయిదు ఐపీఎల్‌ టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన ముంబయి.. ఇప్పుడు అమ్మాయిల లీగ్‌లోనూ ఆరంభ సీజన్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక ఐపీఎల్‌లో బోణీ కోసం పోరాటం కొనసాగిస్తున్న ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లోనైనా తొలి సీజన్‌లోనే టైటిల్‌ను ముద్దాడుతుందా అన్నది ఆసక్తికరం. దిల్లీ క్యాపిటల్స్‌ది కూడా అదే పరిస్థితి. ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ జట్టును విజేతగా నిలుపుతుందని దిల్లీ

ఆశలు పెట్టుకుంది.

* తెలుగు రాష్ట్రాలకు చెందిన అంజలి శర్వాణి, యషశ్రీ (యూపీ), సబ్బినేని మేఘన, షబ్నమ్‌ (గుజరాత్‌), స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి (దిల్లీ) అందివచ్చే అవకాశాలను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

ఫార్మాట్‌ ఇలా..

అయిదు జట్లతో సాగే తొలి సీజన్‌లో మొత్తం 18 రోజుల్లో 22 మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌ ప్రకారం లీగ్‌ దశలో ప్రతి జట్టూ మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. ఇలా ప్రతి జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడేసరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్న జట్లు.. తుదిపోరులో చోటు కోసం ఎలిమినేటర్‌లో తలపడతాయి. నాలుగు రోజుల్లో రెండేసి చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌ 3.30, రాత్రి మ్యాచ్‌ 7.30 గంటలకు ఆరంభమవుతుంది. మ్యాచ్‌లో ఓ జట్టు గరిష్ఠంగా అయిదుగురు విదేశీ క్రికెటర్లను ఆడించొచ్చు. ఒకవేళ జట్టులో ఐసీసీ అసోసియేట్‌ దేశాలకు చెందిన క్రికెటర్లు ఉంటే కచ్చితంగా ఒకరిని మ్యాచ్‌లో ఆడించాలి. కానీ దిల్లీ జట్టులో మాత్రమే ఐసీసీ అసొసియేట్‌ దేశానికి చెందిన క్రికెటర్‌ తారా నోరిస్‌ (అమెరికా) ఉంది.

ఆసీస్‌దే ఆధిపత్యం..

అంతర్జాతీయ మహిళా క్రికెట్లో, అందులోనూ ముఖ్యంగా టీ20ల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆస్ట్రేలియా ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌ ఆరంభ సీజన్‌లోనూ ఆధిపత్యం చలాయించనుంది. ఆ జట్టు క్రికెటర్లలో ముగ్గురు వివిధ ఫ్రాంఛైజీలకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. దిల్లీకి మెగ్‌ లానింగ్‌, యూపీకి అలీసా హీలీ, గుజరాత్‌కు బెత్‌ మూనీ సారథులుగా ఎంపికయ్యారు. మిగిలిన రెండు జట్లు.. ముంబయి, ఆర్సీబీ జట్టు పగ్గాలు వరుసగా హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన చేపట్టారు. ఇప్పటికే స్వదేశంలో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో అదరగొడుతున్న ఈ కంగారూ క్రికెటర్లు.. ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లోనూ తమ ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

* జట్ల కోసం ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టిన మొత్తం రూ.4,669 కోట్లు. అత్యధికంగా గుజరాత్‌ జెయింట్స్‌ కోసం అదానీ గ్రూప్‌ రూ.1,289 కోట్లు వెచ్చించడం విశేషం. వేలంలో క్రికెటర్ల కొనుగోలు కోసం ఫ్రాంఛైజీలు రూ.59.50 కోట్లు ఖర్చు చేశాయి. అత్యధిక ధర పలికిన క్రికెటర్‌ స్మృతి మంధానను రూ.3.4 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇప్పటికే అమెరికాలోని మహిళల ఎన్‌బీఏ తర్వాత ప్రపంచంలోనే రెండో ఖరీదైన లీగ్‌గా డబ్ల్యూపీఎల్‌ నిలిచింది.

* ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లనూ ఉచితంగా వీక్షించే అవకాశాన్ని మహిళలు, బాలికలకు బీసీసీఐ కల్పిస్తోంది. అమ్మాయిలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడొచ్చు.

* తమ ఆటతో అభిమానులను అలరించిన దిగ్గజ మహిళా క్రీడాకారిణులు ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇటీవల టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా మీర్జా ఆర్సీబీ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టింది. ఇక మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్‌ (గుజరాత్‌), జులన్‌ గోస్వామి (ముంబయి), లీసా స్థలేకర్‌ (యూపీ) ఆయా జట్లకు మెంటార్లుగా నియమితులయ్యారు.

ఆరంభం అదిరేలా..

చరిత్రాత్మక డబ్ల్యూపీఎల్‌ ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్‌ ప్రారంభానికి రెండు గంటల ముందే అంటే సాయంత్రం 5.30కు ఈ కార్యక్రమం మొదలవుతుంది. బాలీవుడ్‌ నటీమణులు కియారా అద్వాణీ, కృతి సనన్‌ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే ప్రముఖ గాయకుడు శంకర్‌ మహాదేవన్‌.. డబ్ల్యూపీఎల్‌ నేపథ్య గీతాన్ని ఆలపించనున్నారు. ర్యాపర్‌, గాయకుడు ఏపీ ధిల్లాన్‌ ప్రదర్శన కూడా ప్రత్యేకంగా నిలవనుంది.


ఏ జట్టు ఎలా?

ముంబయి: కెప్టెన్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌; కీలక క్రికెటర్లు: నాట్‌ సీవర్‌, హీథర్‌ గ్రాహమ్‌, పూజ వస్త్రాకర్‌, యాస్తిక భాటియా

బెంగళూరు: కెప్టెన్‌: స్మృతి మంధాన; కీలక క్రికెటర్లు: సోఫీ డెవిన్‌, ఎలీస్‌ పెర్రీ, రేణుక ఠాకూర్‌, రిచా ఘోష్‌.

గుజరాత్‌: కెప్టెన్‌: బెత్‌ మూనీ; కీలక క్రికెటర్లు: ఆష్లీ గార్డ్‌నర్‌, డాటిన్‌, సోఫియా డంక్లీ, స్నేహ్‌ రాణా

యూపీ: కెప్టెన్‌: అలీసా హీలీ; కీలక క్రికెటర్లు: దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టన్‌, తహిలా మెక్‌గ్రాత్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌

దిల్లీ: కెప్టెన్‌:మెగ్‌ లానింగ్‌; కీలక క్రికెటర్లు: జెమీమా, షెఫాలీ, మరీజనె కాప్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని