WPL: వారెవ్వా గ్రేస్‌.. అనూహ్యంగా విరుచుకుపడ్డ బ్యాటర్‌

వారెవ్వా గ్రేస్‌ హారిస్‌..! అలవోకగా గెలిచేలా కనిపించిన గుజరాత్‌ జెయింట్స్‌కు ఈ యూపీ వారియర్స్‌ బ్యాటర్‌ దిమ్మదిరిగే షాకిచ్చింది. గ్రేస్‌ హారిస్‌ తన విధ్వంసక విన్యాసాలతో డబ్ల్యూపీఎల్‌కే ఊపు తెచ్చింది.

Updated : 06 Mar 2023 09:43 IST

గుజరాత్‌కు యూపీ షాక్‌

వారెవ్వా గ్రేస్‌ హారిస్‌..! అలవోకగా గెలిచేలా కనిపించిన గుజరాత్‌ జెయింట్స్‌కు ఈ యూపీ వారియర్స్‌ బ్యాటర్‌ దిమ్మదిరిగే షాకిచ్చింది. గ్రేస్‌ హారిస్‌ తన విధ్వంసక విన్యాసాలతో డబ్ల్యూపీఎల్‌కే ఊపు తెచ్చింది. చివరి నాలుగు ఓవర్లలో 63 పరుగులు చేయాల్సిన స్థితిలో యూపీ పనైపోయినట్లేనని భావించారంతా. కానీ గ్రేస్‌ పెను విధ్వంసంతో ఆ జట్టుకు సంచలన విజయాన్నందించింది.

హిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో యూపీ వారియర్స్‌కు అదిరే ఆరంభం. ఓడిపోయే స్థితి నుంచి అద్భుతంగా పుంజుకున్న ఆ జట్టు రసవత్తర పోరులో 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను మట్టికరిపించింది. హర్లీన్‌ డియోల్‌ (46; 32 బంతుల్లో 7×4), సబ్బినేని మేఘన (24; 15 బంతుల్లో 5×4) మెరవడంతో మొదట గుజరాత్‌ 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. గ్రేస్‌ హారిస్‌ (59 నాటౌట్‌; 26 బంతుల్లో 7×4, 3×6) సంచలన ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని యూపీ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సోఫీ ఎకిల్‌స్టోన్‌ (22 నాటౌట్‌; 12 బంతుల్లో 1×4, 1×6)తో అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు గ్రేస్‌ 70 పరుగులు జోడించింది. కిరణ్‌ నవ్‌గిరె (53; 43 బంతుల్లో 5×4, 2×6) రాణించింది. కిమ్‌ గార్త్‌ (5/36) శ్రమ వృథా అయింది.

గ్రేస్‌ బాదుడే బాదుడు: 105/7. కిమ్‌ గార్త్‌ విజృంభించడంతో ఛేదనలో, 16 ఓవర్లలో యూపీ వారియర్స్‌ పరిస్థితిది. ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌ ఏకపక్షంగా అనిపించింది. కిరన్‌ నవ్‌గిరే రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో యూపీ ఓటమి బాటలో పయనించింది. ఆఖరి నాలుగు ఓవర్లలో యూపీ 63 పరుగులు చేయాల్సిన స్థితిలో గుజరాత్‌ విజయం లాంఛనమే అనిపించింది. ఎవరూ యూపీ విజయాన్ని ఊహించి ఉండరు. కానీ గ్రేస్‌ హారిస్‌ పెను విధ్వంసంతో గుజరాత్‌కు షాకిచ్చింది. వారియర్స్‌కు సంచలన విజయాన్నందించింది. మరోవైపు సోఫీ ఎకిల్‌స్టోన్‌ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో తన వంతు పాత్ర పోషించింది. 17వ ఓవర్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టడంతో మొదలైంది గ్రేస్‌ జోరు. చివరి మూడు ఓవర్లలో 53 పరుగులు చేయాల్సివుండగా.. గార్త్‌ ఓవర్లో ఆమె వరుసగా మూడు ఫోర్లు దంచింది. సోఫీ కూడా ఓ ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. సోఫీ సిక్స్‌తో 19వ ఓవర్లో (గార్డ్‌నర్‌) 14 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో యూపీకి 19 పరుగులు అవసరంకాగా.. అనాబెల్‌ సదర్లాండ్‌ పేలవంగా బౌలింగ్‌ చేసింది. తొలి బంతికే గ్రేస్‌ సిక్స్‌ కొట్టింది. వైడ్‌, 2, 4, వైడ్‌.. తర్వాతి బంతుల్లో పరిస్థితిది. ఆ తర్వాత గ్రేస్‌ వరుసగా 4, 6 దంచడంతో యూపీ సంబరాల్లో మునిగిపోయింది.

మెరిసిన హర్లీన్‌: గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో హర్లీన్‌ డియోల్‌ ఆటే హైలైట్‌. టాస్‌ గెలిచిన ఆ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోగా... తెలుగమ్మాయి సబ్బినేని మేఘన ధాటిగా ఆడింది. ఫాస్ట్‌బౌలర్‌ అంజలి శ్రావణి బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు దంచిన ఆమె.. రాజేశ్వరి గైక్వాడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టేసింది. 3 ఓవర్లలో జట్టు స్కోరు 30. అయితే ఇన్నింగ్స్‌ జోరుగా సాగుతుండగా.. మరో ఓపెనర్‌ డంక్లీ (13), మేఘన కొద్ది తేడాతో ఔట్‌ కావడంతో గుజరాత్‌ అయిదో ఓవర్లో 38/2తో నిలిచింది. డంక్లీన్‌ను ఔట్‌ చేయడం ద్వారా దీప్తి గుజరాత్‌ పతనాన్ని ఆరంభించగా.. మేఘనను ఎకిల్‌స్టోన్‌ వెనక్కి పంపింది. అనాబెల్‌ (8), సుష్మా వర్మ (9) కూడా ఎక్కువసేపు నిలువలేదు. స్కోరు వేగం కూడా తగ్గింది. 11వ ఓవర్లో గుజరాత్‌ 78/4తో నిలిచింది. మరోవైపు హర్లీన్‌ నిలబడింది కానీ ఎక్కువ దూకుడుగా ఆడలేదు. గార్డ్‌నర్‌ (25)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది కానీ.. స్కోరు బోర్డు ఊపందుకోలేదు. అయిదో వికెట్‌కు 44 పరుగులు జోడించిన గార్డ్‌నర్‌ 16వ ఓవర్లో ఔటయ్యాక హర్లీన్‌ జోరు పెంచింది. దేవిక వైద్య వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో ఆమె వరుసగా నాలుగు ఫోర్లు కొట్టింది. తర్వాతి ఓవర్లో ఔటైంది. చెలరేగి ఆడిన హేమలత (21 నాటౌట్‌; 13 బంతుల్లో 2×4, 1×6).. స్నేహ్‌ రాణా (9 నాటౌట్‌)తో అభేద్యమైన ఏడో వికెట్‌కు 27 పరుగులు జోడించింది. ఆఖరి నాలుగు ఓవర్లలో గుజరాత్‌ 46 పరుగులు రాబట్టింది.

గుజరాత్‌ జెయింట్స్‌: మేఘన (సి) సెహ్రావత్‌ (బి) ఎకిల్‌స్టోన్‌ 24; డంక్లీ (బి) దీప్తి 13; హర్లీన్‌ డియోల్‌ (సి) తాలియా (బి) అంజలి 46; అనాబెల్‌ సదర్లాండ్‌ (సి) అంజలి (బి) ఎకిల్‌స్టోన్‌ 8; సుష్మా వర్మ (సి) సెహ్రావత్‌ (బి) తాలియా 9; ఆష్లీ గార్డ్‌నర్‌ (స్టంప్డ్‌) హీలీ (బి) దీప్తి 25; హేమలత నాటౌట్‌ 21; స్నేహ్‌ రాణా నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 169;
వికెట్ల పతనం: 1-34, 2-38, 3-50, 4-76, 5-120, 6-142;
బౌలింగ్‌: రాజేశ్వరి 4-0-30-0; అంజలి శ్రావణి 4-0-43-1; దీప్తి శర్మ 4-0-27-2; సోఫీ 4-0-25-2; తాలియా 2-0-18-1; దేవిక 2-0-24-0

యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: అలీసా(సి) అండ్‌ (బి) గార్త్‌ 7; శ్వేత సెహ్రావత్‌ (సి) మాన్సి (బి) గార్త్‌ 5; కిరణ్‌ నవ్‌గిరె (సి) సుష్మ (బి) గార్త్‌ 53; తాలియా (సి) హేమలత (బి) గార్త్‌ 0; దీప్తి (బి) మాన్సీ జోషి 11; గ్రేస్‌ హారిస్‌ నాటౌట్‌ 59; సిమ్రాన్‌ (బి) గార్త్‌ 0; దేవిక (సి) హేమలత (బి) సదర్లాండ్‌ 4; సోఫీ నాటౌట్‌ 22; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 175;
వికెట్ల పతనం: 1-13, 2-19, 3-20, 4-86, 5-88, 6-88, 7-105;
బౌలింగ్‌: కిమ్‌ 4-0-36-5; తనూజ 4-0-29-0; ఆష్లీ 4-0-34-0; అనాబెల్‌ 3.5-0-41-1; స్నేహ్‌ 2-0-16-0; మాన్సి 2-0-15-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని