ధనాధన్‌ దిల్లీ

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌ 207 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఇదే రికార్డు స్కోరు అనుకుంటే.. రెండో మ్యాచ్‌లోనే దిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఏకంగా 223 పరుగులు కొట్టేసింది.

Updated : 06 Mar 2023 04:18 IST

చెలరేగిన లానింగ్‌, షెఫాలి
విజృంభించిన నోరిస్‌
బెంగళూరుపై ఘనవిజయం

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌ 207 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఇదే రికార్డు స్కోరు అనుకుంటే.. రెండో మ్యాచ్‌లోనే దిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఏకంగా 223 పరుగులు కొట్టేసింది. లానింగ్‌, షెఫాలీ దూకుడుకు.. మరిజేన్‌ కాప్‌ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు సాధించింది. అనంతరం తారా నోరిస్‌ 5 వికెట్లతో చెలరేగడంతో బెంగళూరును 163కే పరిమితం చేసి లీగ్‌లో తొలి అడుగు ఘనంగా వేసింది.

హిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) తొలి సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు అదిరే ఆరంభం. బ్యాట్‌, బంతితో పూర్తి ఆధిపత్యం చలాయించిన ఆ జట్టు ఆదివారం 60 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. మొదట దిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగులు చేసింది. ఓపెనర్లు మెగ్‌ లానింగ్‌ (72; 43 బంతుల్లో 14×4), షెఫాలి వర్మ (84; 45 బంతుల్లో 10×4, 4×6) సత్తాచాటారు. మరిజేన్‌ కాప్‌ (39 నాటౌట్‌; 17 బంతుల్లో 3×4, 3×6), జెమీమా రోడ్రిగ్స్‌ (22 నాటౌట్‌; 15 బంతుల్లో 3×4) కూడా మెరిశారు. ఛేదనలో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేయగలిగింది. స్మృతి మంధాన (35; 23 బంతుల్లో 5×4, 1×6) టాప్‌స్కోరర్‌. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తారా నోరిస్‌ (5/29) ప్రత్యర్థి పతనాన్ని శాసించింది.

నిలబడలేక..: కొండంత లక్ష్య ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం ఆర్సీబీని దెబ్బతీసింది. క్రీజులో నిలబడలేక, మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేక బ్యాటర్లు విఫలమయ్యారు. రెండో ఓవర్‌ నుంచి ఓపెనర్లు స్మృతి, సోఫీ డివైన్‌ (14) బౌండరీల వేట మొదలెట్టారు. కానీ తన వరుస ఓవర్లలో ఓపెనర్లను ఔట్‌ చేసిన అలీస్‌ కాప్సీ (2/10) ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెట్టింది. మొదట మిడాఫ్‌లో షెఫాలీ పట్టిన సూపర్‌ క్యాచ్‌కు సోఫీ నిష్క్రమించింది. ఆ తర్వాత షార్ట్‌ఫైన్‌ లెగ్‌లో ఫీల్డర్‌ను చూసుకోకుండా ఆడిన మంధాన మూల్యం చెల్లించుకోక తప్పలేదు. 9 ఓవర్లలో 72/2తో ఆర్సీబీ అప్పటికే వెనుకబడింది. ఆ దశలో హ్యాట్రిక్‌ ఫోర్లతో ఎలీస్‌ పెర్రీ (31) ఇన్నింగ్స్‌కు వేగం పెంచే ప్రయత్నం చేసింది. కానీ బౌలింగ్‌కు వచ్చిన నోరిస్‌ కథ మొత్తం మార్చేసింది. రెండేసి చొప్పున తన తొలి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి పనిపట్టింది. బంతి వేగంలో హెచ్చుతగ్గులు చేస్తూ, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ వికెట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో 13 ఓవర్లకు 96/6తో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది. హెదర్‌ నైట్‌ (34), మెగాన్‌ షట్‌ (30 నాటౌట్‌) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. హెదర్‌ను ఔట్‌ చేసి డబ్ల్యూపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో అయిదు వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా నోరిస్‌ నిలిచింది.

దంచికొట్టారు..: అంతకుముందు టాస్‌ గెలిచి దిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించినందుకు ఆర్సీబీ చింతించే ఉంటుంది. 3 పరుగులు వచ్చిన తొలి ఓవర్‌ మినహా బౌండరీలో మోతతో దిల్లీ దూసుకెళ్లింది. షెఫాలి, లానింగ్‌ తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించి జట్టును భారీస్కోరు దిశగా నడిపించారు. తానెంత విధ్వంసకర బ్యాటర్‌నో చాలా కాలం తర్వాత మరోసారి చాటుతూ షెఫాలీ చెలరేగిపోయింది. మరో ఎండ్‌లో తానేం తక్కువ కాదంటూ కెప్టెన్‌ లానింగ్‌ రెచ్చిపోయింది. ఈ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 57/0తో నిలిచింది. క్రీజును సమర్థంగా వాడుకుంటూ.. బ్యాక్‌ఫుట్‌, ఫ్రంట్‌ఫుట్‌పై కదులుతూ షెఫాలి అలవోకగా షాట్లు ఆడింది. ఆశ వేసిన 9వ ఓవర్లో క్రీజు వదిలి ముందుకు వచ్చి బౌలర్‌ తల మీదుగా ఒకటి, వైడ్‌ లాంగాన్‌లో మరొకటి కళ్లు చెదిరేలా సిక్సర్లు కొట్టింది. కట్‌ షాట్లు, కవర్‌డ్రైవ్‌లు, స్వీప్‌ షాట్లతో అలరించిన ఆమె 31 బంతుల్లో అర్ధశతకం అందుకుంది. మరోవైపు ఫీల్డర్ల మధ్య ఖాళీలు చూసి బంతిని బౌండరీలు దాటించిన లానింగ్‌ డ్రైవ్‌లతో ఆకట్టుకుంది. 30 బంతుల్లో ఆమె అర్ధసెంచరీ చేసింది. అక్కడి నుంచి వీళ్ల దూకుడు మరింత పెరిగింది. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఆర్సీబీ చాలా ప్రయత్నాలు చేసింది. చివరకు ఆఫ్‌స్పిన్నర్‌ హెదర్‌ మూడు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరినీ పెవిలియన్‌ చేర్చింది. కానీ ఆనందం ఆర్సీబీకి దక్కకుండా మరిజేన్‌, జెమీమా వస్తూనే రెచ్చిపోయారు. ముఖ్యంగా మరిజేన్‌ ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోసింది. హెదర్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు దంచింది. చివరి అయిదు ఓవర్లలో ఆ జట్టు 59 పరుగులు పిండుకుంది. ఆఖరి ఓవర్లో మూడో బంతి ఫుల్‌టాస్‌ రాగా జెమీమా ఫోర్‌ కొట్టింది. కానీ అది నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని భావించిన ఆమె నోబాల్‌ కోసం సమీక్ష కోరడం గమనార్హం.

దిల్లీ క్యాపిటల్స్‌: లానింగ్‌ (బి) హెదర్‌ 72; షెఫాలి (సి) రిచా (బి) హెదర్‌ 84; మరిజేన్‌ కాప్‌ నాటౌట్‌ 39; జెమీమా నాటౌట్‌ 22; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223;
వికెట్ల పతనం: 1-162, 2-163;
బౌలింగ్‌: రేణుక సింగ్‌ 3-0-24-0; మెగాన్‌ షట్‌ 4-0-45-0; ప్రీతి 4-0-35-0; ఎలీస్‌ పెర్రీ 3-0-29-0; సోఫీ డివైన్‌ 1-0-20-0; శోభన 2-0-29-0; హెదర్‌ నైట్‌ 3-0-40-2

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి (సి) శిఖా పాండే (బి) అలీస్‌ 35; సోఫీ (సి) షెఫాలి (బి) అలీస్‌ 14; ఎలీస్‌ (బి) నోరిస్‌ 31; దిశ (సి) అలీస్‌ (బి) నోరిస్‌ 9; రిచా (సి) రాధ (బి) నోరిస్‌ 2; హెదర్‌ (సి) లానింగ్‌ (బి) నోరిస్‌ 34; కనిక (సి) షెఫాలి (బి) నోరిస్‌ 0; శోభన (సి) రాధ (బి) శిఖా పాండే 2; మెగాన్‌ నాటౌట్‌ 30; ప్రీతి నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163;
వికెట్ల పతనం: 1-41, 2-56, 3-89, 4-90, 5-93, 6-93, 7-96, 8-150;
బౌలింగ్‌: శిఖా పాండే 4-0-35-1; మరిజేన్‌ కాప్‌ 4-0-36-0; జెస్‌ జొనాసెన్‌ 4-0-28-0; అలీస్‌ కాప్సీ 2-0-10-2; రాధ యాదవ్‌ 2-0-24-0; తారా నోరిస్‌ 4-0-29-5


223

మ్యాచ్‌లో దిల్లీ చేసిన పరుగులు. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఫ్రాంఛైజీ లీగ్‌ టీ20 చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోరు. 2017-18 మహిళల బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్టుపై సిడ్నీ సిక్సర్స్‌ 242 పరుగులు సాధించింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని