Sania Mirza: కడసారి ఆడి.. కన్నీళ్లతో నిష్క్రమించి..!

ఎక్కడైతే ఆట మొదలెట్టిందో.. ఎక్కడైతే ప్రొఫెషనల్‌ కెరీర్‌ విజయాలకు బీజం పడిందో.. అక్కడే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చివరి ఆట ఆడేసింది. గత నెలలో దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌తో కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికిన ఆమె.. ఆదివారం సొంతగడ్డపై చివరగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌తో ఆట నుంచి నిష్క్రమించింది.

Updated : 06 Mar 2023 09:12 IST

రాకెట్‌ వదిలేసిన సానియా మీర్జా
ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో సందడి

ఎక్కడైతే ఆట మొదలెట్టిందో.. ఎక్కడైతే ప్రొఫెషనల్‌ కెరీర్‌ విజయాలకు బీజం పడిందో.. అక్కడే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా చివరి ఆట ఆడేసింది. గత నెలలో దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌తో కెరీర్‌కు అధికారికంగా వీడ్కోలు పలికిన ఆమె.. ఆదివారం సొంతగడ్డపై చివరగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌తో ఆట నుంచి నిష్క్రమించింది.

వ్వులు.. కేరింతలు.. చివరగా కన్నీళ్లు.. ఇలా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ప్రేక్షకులకు, అభిమానులకు, సానియా కుటుంబ సభ్యులు, సన్నిహితులకు భిన్న భావోద్వేగాలను కలిగించింది. ఇవాన్‌ డోడిగ్‌, బెతానీ మాటెక్‌, మారియన్‌ బార్టోలీ, కారా బ్లాక్‌, రోహన్‌ బోపన్నతో కలిసి సానియా కోర్టులో అలరించింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ర్యాపర్‌ ఎంసీ స్టాన్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. స్టాండ్స్‌లోని ఓ మహిళా అభిమాని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోగా.. సానియా ఆమె దగ్గరికి వెళ్లి కరచాలనం చేసింది. మొదట సానియాతో సహా ఈ ఆరుగురు ప్లేయర్లు వార్మప్‌ కోసం బంతిని ఆడుతూ సరదాగా కోర్టు చుట్టూ తిరిగారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ముందుగా యువరాజ్‌- బెతానీ జోడీతో సానియా- ఇవాన్‌ జంట తలపడింది. చివరగా బెతానీ- ఇవాన్‌ ద్వయంతో సానియా- బోపన్న పోటీపడ్డారు. ఈ మ్యాచ్‌ నాలుగో గేమ్‌ మధ్యలో బాల్‌గర్ల్‌గా ఉన్న సామ చేవిక రెడ్డికి ఆడమని రాకెట్‌ ఇచ్చి ఇవాన్‌ బయట నుంచి ప్రోత్సహించాడు. ఆమె షాట్లు ఆడుతుంటే కేరింతలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో సానియా తనదైన శైలి ఆటతీరుతో మెరిసింది. ఫోర్‌హ్యాండ్‌ విన్నర్లు, డ్రాప్‌ షాట్లతో ఆకట్టుకుంది. ఆమె పాయింట్‌ సాధించిన ప్రతిసారి కేకలతో ప్రేక్షకులు స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గెలిచింది. అనంతరం ప్లేయర్లందరినీ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా శాలువాలతో సత్కరించారు. సానియాకు ప్రత్యేక జ్ఞాపిక అందించారు. ‘‘పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న భారత క్రీడారంగంలో ప్రయాణాన్ని ప్రారంభించిన సానియా.. మహిళల కోసం ఓ మార్గం ఏర్పాటు చేసింది. ఆటల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలనుకునే అమ్మాయిలందరికీ ఆమె ఆదర్శం. ఎన్నో సవాళ్లు దాటి ఆమె ఛాంపియన్‌గా ఎదిగింది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. చివరగా మాట్లాడుతూ సానియా భావోద్వేగానికి గురైంది. మధ్యలో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. గద్గద స్వరంతోనే మాట్లాడిన తర్వాత ఆమె.. ప్రేక్షకుల్లోకి టెన్నిస్‌ బంతులు విసిరి, అభివాదం చేస్తూ తనయుడు ఇజాన్‌తో కలిసి కోర్టు నుంచి వెళ్లిపోయింది. మరే భారత టెన్నిస్‌ క్రీడాకారిణికి సాధ్యం కాని ఘనతలు, రికార్డులు, జ్ఞాపకాలు మిగిల్చి.. సానియా ఆట నుంచి నిష్క్రమించింది. కేవలం టెన్నిస్‌ ప్లేయర్లకే కాదు తన ఘనతలతో సానియా దేశం మొత్తానికి నిజమైన స్ఫూర్తిగా నిలిచిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు కొనియాడారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌, తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, క్రీడల కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌, నటుడు దుల్కర్‌ సల్మాన్‌, శాట్స్‌ ఛైర్మన్‌ ఆంజనేయ గౌడ్‌, చాముండేశ్వరీ నాథ్‌ తదితరులు హాజరయ్యారు.


రాకెట్‌తో యువీ

భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అనగానే 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు, 2011 వన్డే ప్రపంచకప్‌లో హీరోచిత ప్రదర్శనతో దేశానికి కప్పు అందించిన సందర్భాలు గుర్తుకువస్తాయి. కానీ బ్యాట్‌, బంతితో మైదానంలో అదరగొట్టిన అతను.. ఇప్పుడు టెన్నిస్‌ రాకెట్‌తో కోర్టులోనూ ఆకట్టుకున్నాడు. సానియా కోరిక మేరకు బెతానీతో కలిసి బరిలో దిగిన అతను ఫోర్‌హ్యాండ్‌, బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో అలరించాడు. సర్వీస్‌లు కూడా బాగానే చేశాడు. సానియా సూచనలతో కోర్టులో కదులుతూ డ్రాప్‌ షాట్లూ ఆడాడు. మధ్యలో అతను కొట్టిన ఓ కార్నర్‌ షాట్‌కు సానియా రాకెట్‌ వదిలేసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్‌ ముగిశాక స్టాండ్స్‌లో కూర్చుని సానియా- బోపన్న, బెతానీ- డోడిగ్‌ మధ్య పోరును యువీ తిలకించాడు. దిగ్గజ క్రీడాకారిణిగా ఎదిగిన సానియా ఎంతోమందికి ఆదర్శమని అతనన్నాడు.


నాకు ఈ విధంగా వీడ్కోలు పలికిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇక్కడే 2002 జాతీయ క్రీడలతో నా ప్రయాణం మొదలైంది. 2004లో నా తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ ఇక్కడే సాధించా. 20 ఏళ్ల పాటు అత్యున్నత స్థాయిలో దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. ఓ బాలికగా టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకుంటానంటే ఎవరైనా నమ్మడం కష్టం. కానీ నా తల్లిదండ్రులు నాపై నమ్మకం ఉంచారు. ఆటను కోల్పోతున్నా.. (కన్నీళ్లు) కానీ మరో సానియాను తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉంటా. ఇవి ఆనంద భాష్పాలు. ఇంతకంటే గొప్ప ముగింపు ఇంకేముంటుంది.  

సానియా


సానియా తల్లిదండ్రుల కామెంట్లు

‘‘కెరీర్‌లో సానియా సాధించిన ఘనత పట్ల తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం. ఆమె చివరి మ్యాచ్‌కు హైదరాబాద్‌ వేదిక కావడం సంతోషాన్నిస్తోంది. ఆటకు చాలా ఇచ్చి, ఎంతోమంది యువ టెన్నిస్‌ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచిన ఆమెకు ఇది సరైన వీడ్కోలు. మా మద్దతు ఆమెకెప్పుడూ ఉంటుంది. ఆమె మమ్మల్ని గర్వపడేలా చేస్తూనే ఉంటుంది’’

సానియా తల్లిదండ్రులు


‘‘సానియా ఓ అసాధారణ అథ్లెట్‌. భారత టెన్నిస్‌కు నిజమైన ప్రచారకర్త. ఆమెతో కలిసి ఆడడంతో పాటు టోర్నీలు గెలవడం నాకు దక్కిన గౌరవం. భారత టెన్నిస్‌కు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం. ఆమె ఓ గొప్ప భాగస్వామి, స్నేహితురాలు. తన కెరీర్‌లో కొనసాగించిన ఉన్నత విలువలను భారత టెన్నిస్‌ తర్వాతి తరంలో ఆమె చొప్పిస్తుందని నమ్ముతున్నా’’

రోహన్‌ బోపన్న


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని