రాహుల్‌ బాధపడటం మంచిదే

జట్టులో చోటు కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందని.. కొన్నిసార్లు అది మంచిదేనంటూ టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను ఉద్దేశించి మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ వ్యాఖ్యానించాడు.

Published : 09 Mar 2023 06:44 IST

దిల్లీ: జట్టులో చోటు కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందని.. కొన్నిసార్లు అది మంచిదేనంటూ టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను ఉద్దేశించి మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న రాహుల్‌ను ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఆడించలేదు. అతని స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతి క్రీడాకారుడు తన కెరీర్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు. అరంగేట్రం నుంచి రిటైర్మెంట్‌ వరకు నిలకడగా రాణించిన ఒక్క ఆటగాడి పేరు చెప్పగలరా? జట్టులో చోటు కోల్పోవడం బాధిస్తుంది. కొన్నిసార్లు అది మంచిదే. బాధ మనకు మంచే చేస్తుంది. మన స్థానంలో మరొకరు ఆడుతున్నప్పుడు.. డ్రింక్స్‌ తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు బాధగా అనిపిస్తుంది. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీకి సారథి అని, నాలుగైదు సెంచరీలు చేశాడని రాహుల్‌కు తెలుసు. కానీ ప్రస్తుతం భారత టీ20, టెస్టు తుది జట్లలో అతను లేడు. రానున్న ఐపీఎల్‌ను ఒక టోర్నీలాగా చూడాలా లేదా తనని తను ఆవిష్కరించుకునేందుకు వేదికగా మలుచుకోవాలా అన్నది రాహుల్‌ చేతిలో ఉంది. జట్టు, దేశం ఆశించే విధంగా బ్యాటింగ్‌ చేయగలనా అని తనని తాను ప్రశ్నించుకోవాలి. 600 లేదా కేవలం 400 పరుగులు చేయడమన్నది ముఖ్యం కాదు. జట్టు విజయంలో భాగమవడం ప్రధానం’’ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని