IND vs AUS: నిలిచారు.. ఇంకా నిలవాలి!

టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుని ఒకటిన్నర రోజుకు పైగా ఆడి భారీ స్కోరు సాధిస్తుంది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జట్టు కూడా దీటుగా స్పందిస్తుంది. మూడు రోజుల ఆట ముగిసేసరికి ఏ జట్టుదీ పైచేయిగా అనిపించదు.

Updated : 12 Mar 2023 07:39 IST

శుభ్‌మన్‌ సూపర్‌ శతకం
14 నెలల తర్వాత కోహ్లి అర్ధశతకం
భారత్‌ 289/3.. ఆసీస్‌తో చివరి టెస్టు

టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుని ఒకటిన్నర రోజుకు పైగా ఆడి భారీ స్కోరు సాధిస్తుంది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జట్టు కూడా దీటుగా స్పందిస్తుంది. మూడు రోజుల ఆట ముగిసేసరికి ఏ జట్టుదీ పైచేయిగా అనిపించదు. మ్యాచ్‌ డ్రా అవుతుందా.. లేక ఏదో ఒక జట్టు పైచేయి సాధించి విజయం వైపు అడుగులేస్తుందా అన్నది నాలుగో రోజు ఆటతోనే తేలుతుంది. సంప్రదాయ భారత పిచ్‌లపై టెస్టు మ్యాచ్‌ అంటే ఇలాగే ఉండేది ఒకప్పుడు!

చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు అలాంటి పిచ్‌, ఆ తరహా ఆట చూస్తున్నాం భారత్‌-ఆస్ట్రేలియా చివరి టెస్టులో. 480 పరుగుల భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియాకు దీటుగా బదులిస్తున్న టీమ్‌ఇండియా.. మూడో రోజు ఆట ఆఖరుకు 289/3తో నిలిచింది. సూపర్‌ సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌కు మిగతా బ్యాటర్ల సహకారం తోడవడంతో ప్రస్తుతానికి సురక్షిత స్థితిలోనే ఉంది. కానీ నాలుగో రోజు నుంచి బంతి మరింత తిరిగే అవకాశమున్న నేపథ్యంలో ఆదివారం భారత్‌ పోరాటం ఎక్కడిదాకా వెళ్తుందన్న దాన్ని బట్టే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంటుంది.

అహ్మదాబాద్‌

ఆస్ట్రేలియాతో చివరిదైన నాలుగో టెస్టులో భారత్‌ బలంగా పుంజుకుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, బ్యాట్స్‌మెన్‌ చాన్నాళ్ల తర్వాత అంచనాలకు తగ్గట్లు రాణించడంతో కంగారూల స్కోరు అందుకునే దిశగా టీమ్‌ఇండియా అడుగులు వేస్తోంది. మూడో రోజు, శనివారం ఆట ఆఖరుకు భారత్‌ 3 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఈ ఏడాది సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (128;  235 బంతుల్లో 12×4, 1×6) మరో శతకం సాధించాడు. విరాట్‌ కోహ్లి (59 బ్యాటింగ్‌; 128 బంతుల్లో 5×4) టెస్టుల్లో చాలా కాలం తర్వాత మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆట ఆఖరుకు కోహ్లికి తోడుగా జడేజా (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. 7 వికెట్లు చేతిలో ఉన్న భారత్‌ ఆసీస్‌ స్కోరు కంటే ఇంకా 191 పరుగులు వెనుకబడి ఉంది.

శుభ్‌మన్‌ ముందుండి..: మూడో రోజు ఆట కచ్చితంగా శుభ్‌మన్‌ గిల్‌దే. కొత్త ఏడాదిలో వివిధ ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న ఈ యువ ఓపెనర్‌.. అప్పుడే 2023లో అయిదో అంతర్జాతీయ శతకం బాదేశాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ తనను కాదని కేఎల్‌ రాహుల్‌ను తుది జట్టులో ఆడించడం ఎంత తప్పో రుజువు చేస్తూ అతను శనివారం సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడాడు. నిజానికి తొలి రెండు రోజులతో పోల్చితే పరిస్థితులు బ్యాటింగ్‌కు మరీ అనుకూలంగా లేవు. పిచ్‌ నుంచి కొంచెం టర్న్‌ లభించడంతో ఆసీస్‌ స్పిన్నర్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలిగారు. చకచకా వికెట్లు పడగొట్టలేకపోయారు కానీ.. పరుగులు మాత్రం బాగా కట్టడి చేశారు. కొత్త బంతితో ఆసీస్‌ పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. పాత బంతితో స్పిన్నర్లు లైయన్‌, మర్ఫీ, కునెమన్‌ భారత బ్యాటర్లు పరుగుల కోసం చెమటోడ్చేలా, వికెట్లు కాపాడుకోవడానికి కష్టపడేలా చేశారు. అయితే మిగతా బ్యాటర్లతో పోలిస్తే శుభ్‌మన్‌ స్వేచ్ఛగానే బ్యాటింగ్‌ చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాట్స్‌మెన్‌ 361 బంతుల్లో 152 పరుగులు చేస్తే.. శుభ్‌మన్‌ 235 బంతుల్లో 128 పరుగులు రాబట్టాడు. భారత్‌ కోల్పోయిన మూడు వికెట్లూ స్పిన్నర్ల ఖాతాలోకే చేరాయి. ఉదయం 36/0తో బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌.. పది ఓవర్లకు పైగా వికెట్‌ కోల్పోలేదు. శుభ్‌మన్‌, రోహిత్‌ (35) నిలకడగా ఆడటంతో 74/0తో మెరుగైన స్థితికి చేరుకుంది. అయితే క్రీజులో బాగా కుదురుకున్నట్లే కనిపించిన రోహిత్‌.. చేజేతులా వికెట్‌ సమర్పించుకున్నాడు. కునెమన్‌ మామూలు బంతే వేసినా.. అనవసరంగా బంతిని గాల్లోకి లేపి ఔటయ్యాడు. బంతి నేరుగా షార్ట్‌ కవర్స్‌లో ఉన్న లబుషేన్‌ చేతుల్లో పడింది. తర్వాత పుజారా సహకారంతో శుభ్‌మన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పుజారా తన సహజ శైలిలో క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేయగా.. గిల్‌ తరచుగా షాట్లు ఆడుతూ అర్ధశతకం పూర్తి చేశాడు. లంచ్‌కు స్కోరు 129/1. విరామం తర్వాత కూడా భారత జోడీ జోరు కొనసాగించింది. శుభ్‌మన్‌ సెంచరీ వైపు, పుజారా అర్ధశతకం దిశగా సాగారు. అయితే పుజారా (42)ను మర్ఫీ వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆసీస్‌ నిరీక్షణకు తెరదించాడు. కోహ్లి ఆరంభంలో ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కొన్నాడు. స్లిప్‌లో ఓ క్యాచ్‌ ఇచ్చాడు కానీ అది చేజారింది. కానీ క్రీజులో కుదురుకున్నాక విరాట్‌ చక్కటి షాట్లు ఆడుతూ, తనదైన శైలిలో స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ ముందుకు సాగాడు. టీ ముంగిట సెంచరీ పూర్తి చేసిన గిల్‌.. విరామం తర్వాత దూకుడు పెంచాడు. చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 245/2తో భారత్‌ తిరుగులేని స్థితికి చేరుకుంది. 150 దిశగా సాగుతున్న శుభ్‌మన్‌ చివరికి లైయన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. పుజారా లాగే అతడి సమీక్ష కూడా ఫలితాన్నివ్వలేదు. తర్వాత కోహ్లి, జడేజా జోడీ మరో వికెట్‌ పడనివ్వకుండా ఆటను ముగించింది.


అటా.. ఇటా.. డ్రానా?

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో చివరి మూడు సిరీస్‌లనూ భారతే సాధించింది. ప్రస్తుత సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి చివరి టెస్టులో ఓడినా ట్రోఫీ టీమ్‌ఇండియా దగ్గరే ఉంటుంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా సిరీస్‌ విజయంతో ట్రోఫీని అందుకోవచ్చు. బ్యాటింగ్‌లో ఆసీస్‌కు భారత్‌ దీటుగా సమాధానం ఇస్తోంది కాబట్టి ప్రస్తుతానికి మ్యాచ్‌ డ్రా అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. తొలి మూడు రోజులతో పోలిస్తే పిచ్‌ నాలుగో రోజు నుంచి ఎక్కువగా స్పిన్‌కు అనుకూలించవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆదివారం భారత్‌ను త్వరగా ఆలౌట్‌ చేసి, ఆట చివర్లోపు సవాలు విసిరే లక్ష్యాన్ని నిలపగలిగితే ఆసీస్‌ విజయానికి దారులు తెరుచుకుంటాయి. భారత్‌ కనీసం ఇంకో రెండు సెషన్లు బ్యాటింగ్‌ చేస్తే తప్ప ముప్పు తొలగినట్లు కాదు. మన బ్యాటర్లు అసాధారణంగా ఆడేసి, చెప్పుకోదగ్గ ఆధిక్యం దక్కి, చివర్లో రెండు మూడు వికెట్లు పడగొట్టగలిగితే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి కానీ.. ఇలా జరిగేందుకు ఆస్కారం తక్కువ. ఈ మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. అక్కడ న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరడం లాంఛనమే కావచ్చు.


5

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో శుభ్‌మన్‌ 100+ స్కోర్లు.  వన్డేల్లో ఓ డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలు సాధించిన అతను.. టీ20లు, టెస్టుల్లో ఒక్కో శతకం బాదాడు.


* సచిన్‌, లక్ష్మణ్‌, ద్రవిడ్‌ల తర్వాత ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా పుజారా ఘనత సాధించాడు.

* అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌ 17 వేల పరుగులు పూర్తి చేశాడు. అతడికంటే ముందు భారత బ్యాటర్లలో సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ, కోహ్లి,  ధోని ఈ ఘనత సాధించారు.

* 2022 జనవరి 11 తర్వాత టెస్టుల్లో కోహ్లి అర్ధశతకం సాధించింది ఇప్పుడే. మధ్యలో అతను 15 ఇన్నింగ్స్‌లు ఆడాడు.


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 480

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) లబుషేన్‌ (బి) కునెమన్‌ 35; శుభ్‌మన్‌ ఎల్బీ (బి) లైయన్‌ 128; పుజారా ఎల్బీ (బి) మర్ఫీ 42; కోహ్లి బ్యాటింగ్‌ 59; జడేజా బ్యాటింగ్‌ 16; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (99 ఓవర్లలో 3 వికెట్లకు) 289; వికెట్ల పతనం: 1-74, 2-187, 3-245; బౌలింగ్‌: స్టార్క్‌ 17-2-74-0; గ్రీన్‌ 10-0-45-0; లైయన్‌ 37-4-75-1; కునెమన్‌ 13-0-43-1; మర్ఫీ 22-6-45-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని