IND Vs AUS: కింగ్‌ కొట్టాడు.. కసితీరా!

తెల్లటి దుస్తుల్లో కింగ్‌ హెల్మెట్‌ తీసి.. చేతులు రెండూ చాచి అభిమానులకు అభివాదం చేసి  ఎంత కాలమైందో! ఎప్పుడో 2019 నవంబరులో చూశాం ఆ దృశ్యం! మూడేళ్లు గడిచిపోయాయి.

Updated : 13 Mar 2023 07:16 IST

విరాట్‌ భారీ శతకం
భారత్‌ 571.. 91 పరుగుల ఆధిక్యం
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 3/0

తెల్లటి దుస్తుల్లో కింగ్‌ హెల్మెట్‌ తీసి.. చేతులు రెండూ చాచి అభిమానులకు అభివాదం చేసి  ఎంత కాలమైందో! ఎప్పుడో 2019 నవంబరులో చూశాం ఆ దృశ్యం! మూడేళ్లు గడిచిపోయాయి. 41 ఇన్నింగ్స్‌లు అయిపోయాయి. ఎట్టకేలకు అతను టెస్టు మ్యాచ్‌లో మళ్లీ మూడంకెల ముచ్చట తీర్చుకున్నాడు. ఆస్ట్రేలియా సాధించిన కొండంత స్కోరు ముందుండగా రెండో రోజు ఒత్తిడి మధ్య క్రీజులో అడుగు పెట్టి, కష్టపడి అర్ధశతకం సాధించిన విరాట్‌.. మూడో రోజు దాన్ని  భారీ శతకంగా మలిచాడు. జట్టుకు ముప్పు తప్పించి, కీలకమైన ఆధిక్యం కూడా సాధించి పెట్టాడు.

అనూహ్యాలేమైనా జరిగితే తప్ప చివరి టెస్టులో ఫలితం వచ్చే అవకాశం లేదు. అయితే మ్యాచ్‌లో సంపూర్ణ సురక్షితంగా ఉన్న జట్టు, ఓడిపోయే అవకాశం లేని జట్టు, గెలిచే అవకాశమున్న జట్టేదైనా ఉందంటే అది 91 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్‌ మాత్రమే. అలాగని ఆస్ట్రేలియాకు మరీ పెద్ద ముప్పేమీ లేదు. పిచ్‌పై కాస్త టర్న్‌, బౌన్స్‌ లభిస్తున్నా అది బ్యాటర్లను ఇబ్బందిపెట్టేంతగా అయితే లేదు. చిన్న ఆశతో ఉన్న టీమ్‌ఇండియాకు పిచ్‌ మరింత సహకారాన్నిస్తే ఆఖరి రోజు ఆసక్తికర పోరు ఖాయం.

డ్రా అవకాశాలు మెండుగా ఉన్నా.. చివరిదైన నాలుగో టెస్టులో టీమ్‌ఇండియా పైచేయిలో నిలిచింది. 40 నెలల నిరీక్షణకు తెరదించుతూ విరాట్‌ కోహ్లి (186; 364 బంతుల్లో 15×4) 28వ టెస్టు శతకం సాధించిన వేళ.. తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగుల భారీ స్కోరు చేసింది. అక్షర్‌ పటేల్‌ (79; 113 బంతుల్లో 5×4, 4×6), కేఎస్‌ భరత్‌ (44; 88 బంతుల్లో 2×4, 3×6) కూడా విలువైన ఇన్నింగ్స్‌ ఆడారు. వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ రాలేదు. లేదంటే భారత్‌ మరింత ఆధిక్యం సంపాదించేదే. లైయన్‌, మర్ఫీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 91 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (3)తో పాటు నైట్‌వాచ్‌మన్‌ కునెమన్‌ (0) క్రీజులో ఉన్నాడు. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా బ్యాటింగ్‌కు రాలేదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే శ్రీలంక-న్యూజిలాండ్‌ సిరీస్‌ ఫలితంతో సంబంధం లేకుండా భారత్‌ నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

అతడు.. వాళ్లు: నాలుగో రోజు ఆటలో కోహ్లి ఆటే హైలైట్‌. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 59 ఇన్నింగ్స్‌ కొనసాగించిన అతడు అలవోకగా బ్యాటింగ్‌ చేశాడు. జట్టు భారీ స్కోరు సాధించిందంటే ప్రధాన కారణం అతడే. 241 బంతుల్లో శతకం పూర్తి చేసిన కోహ్లి దాదాపు రోజంతా క్రీజులో నిలిచాడు. మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ జడేజా (28) త్వరగానే నిష్క్రమించినా.. అక్షర్‌ పటేల్‌, భరత్‌ అతడికి గొప్ప సహకారాన్నిచ్చారు. భరత్‌తో అయిదో వికెట్‌కు 84 పరుగులు జోడించిన కోహ్లి.. అక్షర్‌ పటేల్‌తో 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రత్యర్థికి చిన్న అవకాశమైనా ఇవ్వకుండా సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన కోహ్లి లంచ్‌ తర్వాత దూకుడు పెంచాడు. ఇక గత టెస్టుల్లో విఫలమైన భరత్‌ ఈసారి ఆకట్టుకున్నాడు. కోహ్లికి మంచి మద్దతిచ్చాడు. ఎదురుదాడికి దిగి గ్రీన్‌ బౌలింగ్‌లో పుల్‌, హుక్‌తో సిక్స్‌లు బాదాడు. అంతకుముందు లైయన్‌ బౌలింగ్‌లో అతడు కొట్టిన స్లాగ్‌స్వీప్‌ సిక్స్‌ను చూసి తీరాల్సిందే. క్రీజులో సౌకర్యంగా కనిపించిన అతడు పెద్ద ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం చేజారినందుకు చింతించే ఉంటాడు. అక్షర్‌ కూడా అదరగొట్టాడు. ఓవైపు కోహ్లి ఉన్నా.. మరోవైపు నుంచైనా ఇన్నింగ్స్‌ను ముగిద్దామనుకున్న ఆసీస్‌ను అసహనానికి గురి చేశాడు. భారీ భాగస్వామ్యంలో కోహ్లికి సహకరిస్తూనే తానూ బ్యాట్‌ ఝుళిపించాడు. ఈ సిరీస్‌లో ఇంతకుముందు కూడా బ్యాట్‌కు పనిచెప్పిన అక్షర్‌ ఈసారి బ్యాటర్‌గా తన విలువను మరోసారి చాటుకున్నాడు. లంచ్‌ తర్వాత కోహ్లికి తోడైన అతడు ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. చక్కని స్లాగ్‌స్వీప్స్‌ ఆడాడు. అలా అతడు మూడు సిక్స్‌లు కొట్టాడు. ఇన్నింగ్స్‌ సాగుతున్న తీరు చూస్తే కోహ్లి డబుల్‌ సెంచరీ, అక్షర్‌ శతకం చేస్తారనిపించింది. ఓ దశలో భారత్‌ స్కోరు 555/5. అయితే స్టార్క్‌ బౌలింగ్‌లో అక్షర్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ వేగంగా ముగిసింది. మరో 16 పరుగులకే భారత్‌ మిగిలిన వికెట్లు కోల్పోయింది. శ్రేయస్‌ బ్యాటింగ్‌కు వచ్చుంటే టీమ్‌ఇండియా స్కోరులో మరిన్ని పరుగులు చేరేవే.
సూపర్‌ కోహ్లి: మొతేరాలో ప్రేక్షకులకు అది గుర్తుండిపోయే ఆదివారం. లైయన్‌ బంతిని మిడ్‌వికెట్‌కు తరలించి సింగిల్‌ తీసిన కోహ్లి సెంచరీ పూర్తి చేశాడు. 2019 నవంబరు తర్వాత అతడు సాధించిన తొలి శతకం ఇది. అతడు అక్కడితో ఆగలేదు. విలువైన భాగస్వామ్యాలతో, మరిన్ని పరుగులతో జట్టుకు భారీ స్కోరును అందించాడు. కోహ్లిది దాదాపుగా లోప రహిత ఇన్నింగ్స్‌. ఇటీవల కాలంలో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డ అతడు.. సెంచరీ వరకు జాగ్రత్తగా ఆడాడు. క్రమశిక్షణతో కూడిన ఆసీస్‌ బౌలింగ్‌ను చాలా సహనంతో ఎదుర్కొన్నాడు. లంచ్‌ తర్వాత అతడు సెంచరీ అందుకున్నాడు. అందులో బౌండరీలు అయిదే. ఉదయం సెషన్లో అయితే ఒక్కటీ కొట్టలేదు. బౌండరీలు రాకపోయినా అతడేమీ సహనం కోల్పోలేదు. పట్టుదలతో బ్యాటింగ్‌ చేశాడు. కానీ శతక నిరీక్షణ ముగిశాక కోహ్లి తనదైన శైలిలో చెలరేగిపోయాడు. ఆసీస్‌ పేసర్లు, స్పిన్నర్లను ఓ ఆటాడుకున్నాడు. చక్కని డ్రైవ్‌లు, పుల్‌ షాట్లతో అలరించాడు. ఎక్కువగా లెగ్‌సైడ్‌ ఆడాడు. స్పిన్నర్లు లైయన్‌, మర్ఫీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలి సెషన్లో భారత్‌కు 73 పరుగులే రాగా.. కోహ్లి, అక్షర్‌తో దూకుడుతో రెండో సెషన్లో 110, టీ తర్వాత 99 పరుగులు వచ్చాయి. కోహ్లి 100 నుంచి 150కి చేరుకోవడానికి 72 బంతులు తీసుకున్నాడు. లంచ్‌ తర్వాత అతడు చూడముచ్చటైన బౌండరీలు కొట్టాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 84 సింగిల్స్‌, 18 డబుల్స్‌ ఉన్నాయి. రెండుసార్లు మూడేసి పరుగులు చేశాడు. మొత్తంగా వికెట్ల మధ్య పరుగెత్తడం ద్వారానే అతడు 126 పరుగులు సాధించాడు. కోహ్లి చివరికి మర్ఫీ బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌కు యత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో అది తొమ్మిదో వికెట్‌. శ్రేయస్‌ బ్యాటింగ్‌కు రాకపోవడంతో ఇన్నింగ్స్‌ అక్కడితో ముగిసింది.


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 480

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) లబుషేన్‌ (బి) కునెమన్‌ 35; శుభ్‌మన్‌ గిల్‌ ఎల్బీ (బి) లైయన్‌ 128; పుజారా ఎల్బీ (బి) మర్ఫీ 42; కోహ్లి (సి) లబుషేన్‌ (బి) మర్ఫీ 186; జడేజా (సి) ఖవాజా (బి) మర్ఫీ 28; శ్రీకర్‌ భరత్‌ (సి) హ్యాండ్స్‌కాంబ్‌ (బి) లైయన్‌ 44; అక్షర్‌ పటేల్‌ (బి) స్టార్క్‌ 79; అశ్విన్‌ (సి) కునెమన్‌ (బి) లైయన్‌ 7; ఉమేశ్‌ యాదవ్‌ రనౌట్‌ 0; షమి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 22 మొత్తం: (178.5 ఓవర్లలో ఆలౌట్‌) 571; వికెట్ల పతనం: 1-74, 2-187, 3-245, 4-309, 5-393, 6-555, 7-568, 8-569, 9-571; బౌలింగ్‌: స్టార్క్‌ 22-3-97-1; గ్రీన్‌ 18-1-90-0; లైయన్‌ 65-9-151-3; కునెమన్‌ 25-3-94-1; మర్ఫీ 45.5-10-113-3; హెడ్‌ 3-0-8-0

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: కునెమన్‌ బ్యాటింగ్‌ 0; హెడ్‌ బ్యాటింగ్‌ 3; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 3; బౌలింగ్‌: అశ్విన్‌ 3-2-1-0; జడేజా 2-1-1-0; షమి 1-0-1-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని