NZ Vs SL: ఆఖరి బంతికి అద్భుతం

టెస్టు మ్యాచ్‌లకు రసవత్తర ముగింపునిస్తున్న న్యూజిలాండ్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటింది. రెండు వారాల క్రితం ఇంగ్లాండ్‌పై ఒక్క పరుగు ఆధిక్యంతో సంచలన విజయం సాధించిన కివీస్‌.. సొంతగడ్డపై మరో అద్భుతం చేసింది.

Updated : 14 Mar 2023 08:47 IST

ఉత్కంఠ పోరులో శ్రీలంకపై కివీస్‌ విజయం

క్రైస్ట్‌చర్చ్‌: టెస్టు మ్యాచ్‌లకు రసవత్తర ముగింపునిస్తున్న న్యూజిలాండ్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటింది. రెండు వారాల క్రితం ఇంగ్లాండ్‌పై ఒక్క పరుగు ఆధిక్యంతో సంచలన విజయం సాధించిన కివీస్‌.. సొంతగడ్డపై మరో అద్భుతం చేసింది. అయిదు రోజుల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కేన్‌ విలియమ్సన్‌ (121 నాటౌట్‌; 194 బంతుల్లో 11×4, 1×6) అద్భుత సెంచరీ సాధించిన వేళ.. తొలి టెస్టులో శ్రీలంకపై కివీస్‌ పైచేయి సాధించింది. సోమవారం తీవ్ర ఉత్కంఠ నడుమ ముగిసిన మ్యాచ్‌లో కివీస్‌ రెండు వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 28/1తో అయిదో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌.. 285 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా మ్యాచ్‌ చివరి బంతికి ఛేదించింది. 70 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. వర్షం కారణంగా సుమారు 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ వన్డే తరహాలో సాగింది. మూడున్నర గంటల్లో కనీసం 52 ఓవర్ల ఆట నిర్వహించడానికి అంపైర్లు నిర్ణయించగా.. విలియమ్సన్‌, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిచెల్‌ (81; 86 బంతుల్లో 3×4, 4×6) నాలుగో వికెట్‌కు 142 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా నడిపించారు. అయితే పేసర్‌ అసిత ఫెర్నాండో (3/63) కొన్ని పరుగుల వ్యవధిలో మిచెల్‌, బ్లండెల్‌ (3), బ్రాస్‌వెల్‌ (10)లను ఔట్‌ చేశాడు. కెప్టెన్‌ సౌథీ (1)ని లహిరు కుమార (1/61) వెనక్కి పంపాడు. దీంతో మ్యాచ్‌ ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. 7 బంతుల్లో.. కివీస్‌కు 12 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌ మూడో బంతికి హెన్రీ (4) రనౌటయ్యాడు. 3 బంతుల్లో 5 పరుగులు కావాలి. నాలుగో బంతిని విలియమ్సన్‌ బౌండరీ బాదాడు. స్కోరు సమమైంది. అయిదో బంతి పరుగులేమీ రాలేదు. చివరి బంతికి ఒక్క పరుగు కావాలి. ఫెర్నాండో బౌన్సర్‌ విసరగా బంతి.. బ్యాట్‌కు అందకుండా వికెట్‌ కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. నాన్‌ స్ట్రైకర్‌ వాగ్నర్‌ (0 నాటౌట్‌) రన్‌ కోసం పరుగెత్తగా కీపర్‌ డిక్‌వెల్లా త్రో విసిరాడు. వికెట్లను తాకకుండా వచ్చిన బంతిని అందుకున్న బౌలర్‌ ఫెర్నాండో నాన్‌ స్ట్రైకర్‌ వైపు విసిరాడు. బంతి వికెట్లను తాకడంతో శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే రీప్లేలో అది నాటౌట్‌గా తేలడంతో కివీస్‌ కేరింతలు మిన్నంటాయి. తొలి ఇన్నింగ్స్‌లో లంక 355, కివీస్‌ 373 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్‌లో లంక 302 పరుగులకు ఆలౌటైంది. ఈ నెల 17న వెల్లింగ్టన్‌లో రెండో టెస్టు ప్రారంభమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని