ప్రపంచ ఛాంపియన్‌ వైట్‌వాష్‌.. ఆఖరి టీ20లోనూ బంగ్లా చేతిలో ఇంగ్లాండ్‌ ఓటమి

టీ20 ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు చేదు అనుభవం! బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఆ జట్టు 0-3తో కోల్పోయింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన బంగ్లా.. మంగళవారం సిరీస్‌లో ఆఖరిదైన మూడో టీ20లో 16 పరుగుల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును ఓడించి వైట్‌వాష్‌ చేసింది.

Updated : 15 Mar 2023 03:59 IST

మిర్పూర్‌: టీ20 ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌కు చేదు అనుభవం! బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఆ జట్టు 0-3తో కోల్పోయింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన బంగ్లా.. మంగళవారం సిరీస్‌లో ఆఖరిదైన మూడో టీ20లో 16 పరుగుల తేడాతో ఇంగ్లిష్‌ జట్టును ఓడించి వైట్‌వాష్‌ చేసింది. మొదట బంగ్లా 158/2 స్కోరు చేసింది. లిటన్‌దాస్‌ (73; 57 బంతుల్లో 10×4, 1×6) సత్తా చాటాడు. నజ్ముల్‌ శాంటో (47; 36 బంతుల్లో 1×4, 2×6) కూడా రాణించాడు. ఛేదనలో తొలి ఓవర్లోనే సాల్ట్‌ (0) వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌ను డేవిడ్‌ మలన్‌ (53; 47 బంతుల్లో 6×4, 2×6), కెప్టెన్‌ బట్లర్‌ (40; 31 బంతుల్లో 4×4, 1×6) ఆదుకున్నారు. ఒక దశలో ఆ జట్టు 13 ఓవర్లలో 100/1తో విజయం దిశగా సాగింది. కానీ మలన్‌, బట్లర్‌ ఒకే ఓవర్లో ఔట్‌ కావడంతో ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లిష్‌ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. 3 ఓవర్లకు 36 పరుగులు సాధించాల్సిన పరిస్థితిలో ఇంగ్లాండ్‌ 19 పరుగులే చేసి ఓడిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 142/6 స్కోరే చేయగలిగింది. ఒక పెద్ద జట్టును టీ20ల్లో వైట్‌వాష్‌ చేయడం బంగ్లాకు ఇదే తొలిసారి. ఈ ఫార్మాట్లో వైట్‌వాష్‌కు గురి కావడం ఇంగ్లాండ్‌కు ఇది మూడోసారి. ఇంతకుముందు ఆస్ట్రేలియా (2014), దక్షిణాఫ్రికా (2016)పై ఇలాగే ఓడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని