బాక్సింగ్‌ వారసురాలు

ఆమె తాత రెండుసార్లు బాక్సింగ్‌లో ఆసియా ఛాంపియన్‌.. తండ్రి సంజయ్‌ కుమార్‌ కూడా జాతీయ ఛాంపియన్‌! ఇప్పుడు వారి బాటలో ఒక అమ్మాయి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగింది.

Published : 18 Mar 2023 02:17 IST

ఆమె తాత రెండుసార్లు బాక్సింగ్‌లో ఆసియా ఛాంపియన్‌.. తండ్రి సంజయ్‌ కుమార్‌ కూడా జాతీయ ఛాంపియన్‌! ఇప్పుడు వారి బాటలో ఒక అమ్మాయి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగింది. ఆమే నుపుర్‌ షెరోన్‌. బాక్సింగ్‌కు పెట్టింది పేరైన హరియాణాలోని భివాని నుంచి వచ్చిన 18 ఏళ్ల నుపుర్‌.. ప్రపంచ బాక్సింగ్‌ టోర్నీలో శుభారంభం చేసింది. పతకం దిశగా సాగుతోంది.

నుపుర్‌ షెరోన్‌ తాత హవాసింగ్‌ ఒకప్పుడు బాక్సింగ్‌లో వెలిగాడు. 1961-72 మధ్య 11సార్లు జాతీయ ఛాంపియన్‌ అయిన అతడు.. 1966, 1970 ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించాడు. పురుషుల్లో ఆసియా క్రీడల్లో వరుసగా రెండు స్వర్ణాలు నెగ్గిన ఘనత హవాసింగ్‌దే. అతని తనయుడు సంజయ్‌ కూడా జాతీయ ఛాంపియన్‌ అయ్యాడు. ఇప్పుడు వారసత్వాన్ని నిలబెడుతూ నుపుర్‌ బాక్సింగ్‌లో దూసుకెళ్తోంది. కానీ షెరోన్‌కు ఆరంభంలో బాక్సర్‌ కావాలన్న ఆసక్తి ఏమాత్రం ఉండేది కాదట. ఆమెకు రెండేళ్ల వయసులోనే తాత హవా చనిపోయాడు. అతడు సాధించిన అవార్డులు మాత్రమే ఆమెకు గుర్తున్నాయి. అర్జున అవార్డు అంటే ఏమిటని తల్లిని అడుగుతూ ఉండేది. సరదాగా తండ్రి అకాడమీకి వెళ్లొచ్చే షెరోన్‌కు నెమ్మదిగా బాక్సింగ్‌పై ప్రేమ పుట్టింది. అకాడమీలోనే ఓనమాలు నేర్చుకుని రాటుదేలింది. 2015లో జాతీయ యూత్‌ టోర్నీలో పసిడి గెలిచిన నుపుర్‌.. 2018లో ఆల్‌ ఇండియా యూనివర్సిటీ టోర్నీలోనూ స్వర్ణంతో మెరిసింది. 2019లో తొలిసారి అంతర్జాతీయ టోర్నీలో ఆడిన నుపుర్‌.. తాజాగా జాతీయ సెలక్షన్స్‌లో 81 కేజీల పైన విభాగంలో సత్తా చాటి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ‘‘మా నాన్న 30-35 మంది పిల్లలకు ఉచితంగా బాక్సింగ్‌ నేర్పించేవాడు. నేను చదువుల్లో ముందుడేదాన్ని అందుకే బాక్సింగ్‌ మీద ఇష్టం లేక అక్కడ కుక్క పిల్లలతో ఆడుకోవడం కోసం వెళ్లేదాన్ని. కానీ నెమ్మదిగా బాక్సింగ్‌ నేర్చుకున్నా. సబ్‌ జూనియర్‌ టోర్నీలో ఆడినప్పుడు తొలి రౌండ్లోనే ప్రత్యర్థిని నాకౌట్‌ చేశా. అప్పుడు బాక్సింగ్‌ చాలా సులభం అనిపించింది. యూనివర్సిటీకి తొలి మ్యాచ్‌ ఆడినప్పుడు మాత్రం ఓడిపోయా. అప్పుడు ఆటను ఇంకా సీరియస్‌గా తీసుకోవాలనుకున్నా. రెండేళ్లు చాలా కష్టపడ్డా. బాగా బద్ధకస్తురాలిని కావడంతో నాన్నకు చాలా కోపం వచ్చేది. గత అక్టోబర్‌లో శిక్షణలో చీలమండ మడత పడి గాయపడ్డా. రెండు నెలల విరామం తర్వాత జాతీయ టోర్నీకి సిద్ధమయ్యా. ఆత్మవిశ్వాసంతో బరిలో దిగి 81 కేజీల పైన విభాగంలో స్వర్ణం నెగ్గా’’ అని షెరోన్‌ చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు