IND vs AUS: రాహుల్ అదరహో..
టెస్టుల్లో ఇటీవల అతడి ప్రదర్శన బాగాలేక పోయుండొచ్చు. విమర్శలూ ఎదుర్కొని ఉండొచ్చు. కానీ వన్డేల్లో తానెంత విలువైన ఆటగాడో కేఎల్ రాహుల్ చాటుకున్నాడు.
రాణించిన జడేజా
తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్ విజయం
టెస్టుల్లో ఇటీవల అతడి ప్రదర్శన బాగాలేక పోయుండొచ్చు. విమర్శలూ ఎదుర్కొని ఉండొచ్చు. కానీ వన్డేల్లో తానెంత విలువైన ఆటగాడో కేఎల్ రాహుల్ చాటుకున్నాడు. స్వల్ప ఛేదనే గగనమైన వేళ.. ఆస్ట్రేలియాపై వాంఖడేలో అదరగొట్టాడు. అంటే ఏ బౌండరీల మోతో మోగించాడనో, విధ్వంసం సృష్టించాడనో కాదు! తీవ్ర ఒత్తిడిలో, పరీక్షించే పరిస్థితుల్లో, జట్టు ఓటమి ముప్పు ఎదుర్కొంటునప్పుడు పోరాటపటిమతో ఆకట్టుకున్నాడు. అయిదో స్థానంలో వచ్చి అత్యంత విలువైన అర్ధశతకం సాధించిన రాహుల్.. జడేజాతో కలిసి తొలి వన్డేలో భారత్‌ను విజయపథంలో నడిపించాడు. 16కే మూడు వికెట్లు కోల్పోయి, 39/4కు పరిమితమై, ఆ తర్వాత 83/5తో చిక్కుల్లో పడ్డ టీమ్‌ఇండియాను అతడు ఆదుకున్న తీరు చాలా రోజులు గుర్తుండిపోతుంది. జడేజాదీ అమూల్యమైన ఇన్నింగ్సే. బంతితోనూ రాణించిన జడ్డూ.. ఆల్‌రౌండర్‌గా తన సత్తా ఏంటో నిరూపించాడు.
ముంబయి: వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. కేఎల్ రాహుల్ (75 నాటౌట్; 91 బంతుల్లో 7×4, 1×6), జడేజా (45 నాటౌట్; 69 బంతుల్లో 5×4) పోరాటంతో శుక్రవారం తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. షమి (3/17), సిరాజ్ (3/29) విజృంభించడంతో భారత్ మొదట ఆస్ట్రేలియాను 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూల్చింది. జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్ (81; 65 బంతుల్లో 10×4, 5×6) అదిరే ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్వల్ప ఛేదనలో స్టార్క్ (3/49), స్టాయినిస్ (2/27) ధాటికి చిక్కుల్లో పడ్డ భారత్‌ను రాహుల్, జడేజాల భాగస్వామ్యం గట్టెక్కించింది. బంతితోనూ రాణించిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరుగుతుంది.
రాహుల్ కడదాకా..
39/4. చిన్న లక్ష్యమే కదా.. తేలిగ్గా కొట్టేస్తారనుకుంటే ఛేదనలో, 11వ ఓవర్లో టీమ్‌ఇండియా పరిస్థితిది. హడలెత్తిస్తున్న పేసర్లు.. టపటపా పడుతున్న వికెట్లు. ఛేదన ఒక్కసారిగా చాలా కష్టంగా మారిపోయింది. ఆసీస్ పైచేయి సాధించగా.. భారత్ ఒత్తిడిలో పడిపోయింది. అలాంటి స్థితి నుంచి కోలుకుని టీమ్‌ఇండియా విజయతీరాలకు చేరిందంటే కారణం కేఎల్ రాహుల్ పోరాటపటిమే. క్లిష్టపరిస్థితుల్లో పట్టుదలగా నిలిచిన అతడు.. హార్దిక్ (25), జడేజాల సహాయంతో జట్టును గట్టెక్కించాడు. ఓవర్లు చాలానే ఉన్నా.. సాధించాల్సిన రన్‌రేట్ చాలా తక్కువే అయినా ప్రశాంతంగా ఉండే పరిస్థితి రాహుల్‌కు లేదు. అంత ఒత్తిడి తెచ్చారు కంగారూ పేసర్లు స్టార్క్, స్టాయినిస్. స్టాయినిస్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ (3)ను ఔట్ చేయగా.. అయిదో ఓవర్లో కోహ్లి (4), సూర్యకుమార్ (0)లను స్టార్క్ వరుస బంతుల్లో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తన టీ20 విన్యాసాలను వన్డేల్లో చూపలేకపోతున్న సూర్యకుమార్ మరోసారి విఫలమై నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడొచ్చాడు రాహుల్. ఎంతో పట్టుదలతో బ్యాటింగ్ చేసిన అతడు జట్టును గెలిపించి గానీ.. మైదానాన్ని వీడలేదు. పరీక్షించే పరిస్థితుల్లో అతడికి అద్భుతమైన సహకారాన్నిచ్చిన జడేజాదీ విలువైన ఇన్నింగ్సే. హార్దిక్‌తో అయిదో వికెట్‌కు 44 పరుగులు జోడించిన రాహుల్.. జడేజాతో అభేద్యమైన ఆరో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లాడు.
క్యాచ్ అదుర్స్
భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో కంగారూలకు కళ్లెం వేశారు. అదే సమయంలో ఫీల్డర్లూ వారికి సహకరించారు. ముఖ్యంగా జడేజా క్యాచ్ అదరహో. కళ్లు చెదిరే రీతిలో అతడు లబుషేన్ క్యాచ్‌ను అందుకున్న తీరు చూసి తీరాల్సిందే. 23వ ఓవర్లో కుల్‌దీప్ బంతిని లబుషేన్ కట్ చేయగా.. అది కాస్తా గాల్లో లేచింది. జడేజా తన కుడివైపు డైవ్ చేస్తూ మైదానానికి చాలా తక్కువ ఎత్తులో బంతిని రెండు చేతులతో ఒడిసిపట్టాడు.
పోరాటమిలా..
16కే మూడు వికెట్లు పడ్డప్పుడు క్రీజులో అడుగు పెట్టాడు రాహుల్. అయితే అంతసేపూ వికెట్లు పడుతున్నా నిలబడ్డ ఓపెనర్ గిల్ (20) కూడా కాసేపటి తర్వాత స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో రాహుల్‌పై ఒత్తిడి, బాధ్యత పెరిగాయి. సవాల్‌ను స్వీకరించిన రాహుల్ చక్కని టెక్నిక్‌తో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. ముందు హార్దిక్‌తో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. ఇద్దరూ పేసర్లు అబాట్, గ్రీన్‌లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒక్కో పరుగే జోడిస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే అవకాశం వచ్చినప్పుడు బ్యాట్ ఝుళిపించడానికి వెనకాడలేదు. గ్రీన్ బౌలింగ్‌లో రాహుల్ లేట్ కట్‌తో చక్కని ఫోర్ కొట్టాడు. మరోవైపు హార్దిక్ కాస్త దూకుడు ప్రదర్శించాడు. మూడు ఫోర్లు, కొట్టిన అతడు.. గ్రీన్ బౌలింగ్‌లో అప్పర్‌కట్‌తో సిక్స్ కూడా దంచాడు. 19 ఓవర్లలో 83/4తో భారత్ గాడినపడ్డట్లే అనిపించింది. కానీ స్టాయినిస్ బౌన్సర్‌ను హుక్ చేయబోయి హార్దిక్ క్యాచ్ ఔట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆస్ట్రేలియా స్పష్టంగా పైచేయిలో నిలిచింది. కానీ దృఢ సంకల్పంతో బ్యాటింగ్ చేసిన రాహుల్.. జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఎడాపెడా బాదే అవకాశం లేకున్నా.. ఏకాగ్రత చెదరకుండా, సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. ఏ బౌలర్ కూడా అతణ్ని ఇబ్బంది పెట్టలేకపోయాడు. చాలినన్ని ఓవర్లు ఉండడంతో జడేజా కూడా తొందరపడలేదు. ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ సాగారు. సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్. ఇద్దరిదీ ఇదే మంత్రం. స్మిత్ ఎంత మంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. స్పిన్నర్ జంపా గానీ, పేసర్లు గానీ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. క్రమంగా లక్ష్యానికి చేరువైన భారత్ 34 ఓవర్లలో 143/5తో నిలిచింది. 73 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్న రాహుల్.. ఆ తర్వాత వేగం పెంచాడు. స్టార్క్ బౌలింగ్‌లో జడేజా మిడ్‌వికెట్లోకి ఫోర్ కొట్టడంతో టీమ్ ఇండియా లక్ష్యాన్ని పూర్తి చేసింది.
కంగారూలకు కళ్లెం
పేస్ ద్వయం షమి, సిరాజ్ ధాటికి అంతకుముందు కంగారూలను బెంబేలెత్తించారు. ఒక్క మార్ష్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆ జట్టును నిలబెట్టింది. పేస్ అనుకూల పిచ్‌పై హార్దిక్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. సిరాజ్ రెండో ఓవర్లోనే హెడ్ (5)ను ఔట్ చేయడం ద్వారా భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. షమి బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛనివ్వలేదు. అయితే మరోవైపు స్మిత్ అండగా నిలవగా చెలరేగి ఆడిన మార్ష్.. ఎడాపెడా బౌండరీలతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశాడు. పదో ఓవర్లో శార్దూల్ బౌలింగ్‌లో అతడి తలమీదుగా కొట్టిన సిక్స్ సూపర్. అది అతడి ఇన్నింగ్స్‌కే హైలైట్. 13వ ఓవర్లో ఆసీస్ స్కోరు 77 వద్ద స్మిత్ (22)ను హార్దిక్ ఔట్ చేసినా.. మార్ష్ మాత్రం జోరు కొనసాగించాడు. మరోవైపు లబుషేన్ స్ట్రైక్‌రొటేట్ చేస్తూ సాగాడు. 19 ఓవర్లలో 124/2తో కంగారూ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టింది. కానీ జడేజా.. మార్ష్‌ను ఔట్ చేయడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. కాసేపటికే లబుషేన్ (15)ను కుల్‌దీప్ వెనక్కి పంపాడు. జడేజా అందుకున్న ఓ కళ్లు చెదిరే క్యాచ్‌కు అతడు ఔటయ్యాడు. అయితే వికెట్‌కీపర్ బ్యాటర్ ఇంగ్లిస్ (26)కు తోడుగా గ్రీన్ (12) నిలవడంతో 27.3 ఓవర్లలో 169/4తో ఆసీస్ మళ్లీ గాడినపడ్డట్లే కనిపించింది. కానీ షమి, సిరాజ్ విజృంభించడంతో 19 పరుగులకే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) సిరాజ్ 5; మిచెల్ మార్ష్ (సి) సిరాజ్ (బి) జడేజా 81; స్మిత్ (సి) రాహుల్ (బి) హార్దిక్ 22; లబుషేన్ (సి) జడేజా (బి) కుల్‌దీప్ 15; జోష్ ఇంగ్లిస్ (బి) షమి 26; గ్రీన్ (బి) షమి 12; మ్యాక్స్‌వెల్ (సి) హార్దిక్ (బి) జడేజా 8; స్టాయినిస్ (సి) శుభ్‌మన్ (బి) షమి 5; అబాట్ (సి) శుభ్‌మన్ (బి) సిరాజ్ 0; స్టార్క్ నాటౌట్ 4; అడమ్ జంపా (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (35.4 ఓవర్లలో ఆలౌట్) 188
వికెట్ల పతనం: 1-5, 2-77, 3-129, 4-139, 5-169, 6-174, 7-184, 8-184, 9-188
బౌలింగ్: షమి 6-2-17-3; సిరాజ్ 5.4-1-29-3; హార్దిక్ 5-0-29-1; శార్దూల్ 2-0-12-0; జడేజా 9-0-46-2; కుల్‌దీప్ 8-1-48-1,
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ ఎల్బీ (బి) స్టాయినిస్ 3; శుభ్‌మన్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 20; కోహ్లి ఎల్బీ (బి) స్టార్క్ 4; సూర్యకుమార్ ఎల్బీ (బి) స్టార్క్ 0; రాహుల్ నాటౌట్ 75; హార్దిక్ పాండ్య (సి) గ్రీన్ (బి) స్టాయినిస్ 25; జడేజా నాటౌట్ 45; ఎక్స్‌ట్రాలు 19 మొత్తం: (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 191
వికెట్ల పతనం: 1-5, 2-16, 3-16, 4-39, 5-83
బౌలింగ్: స్టార్క్ 9.5-0-49-3; స్టాయినిస్ 7-1-27-2; సీన్ అబాట్ 9.-0-31-0; గ్రీన్ 6-0-35-0; జంపా 6-0-37-0; మ్యాక్స్‌వెల్ 2-0-7-0
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
సిద్ధూ మూసేవాలా తరహాలో చంపేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్!
-
Sports News
BCCI: టాప్ కేటగిరిలోకి రవీంద్ర జడేజా: వార్షిక వేతన కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ
-
Politics News
TDP: తెదేపా ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు
-
Politics News
Rahul Gandhi: రాహుల్‌పై అనర్హత వేటు.. పార్లమెంట్లో నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!