మళ్లీ సెమీస్‌లోనే

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ అద్భుత పోరాటం ముగిసింది. వరుసగా రెండో ఏడాదీ ఈ జంట సెమీస్‌లోనే నిష్క్రమించింది.

Published : 19 Mar 2023 02:21 IST

ఆల్‌ ఇంగ్లాండ్‌లో గాయత్రి జోడీ ఓటమి

ల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ అద్భుత పోరాటం ముగిసింది. వరుసగా రెండో ఏడాదీ ఈ జంట సెమీస్‌లోనే నిష్క్రమించింది. శనివారం మహిళల డబుల్స్‌ సెమీస్‌లో గాయత్రి- ట్రీసా ద్వయం 10-21, 10-21 తేడాతో ప్రపంచ 20వ ర్యాంకర్‌ బేక్‌- లీ సో (కొరియా) జంట చేతిలో ఓటమి పాలైంది. సహచర భారత షట్లర్లు ఒక్కొక్కరిగా నిష్క్రమించినా పోరాటాన్నే నమ్ముకుని సెమీస్‌ వరకూ వచ్చిన ప్రపంచ 17వ ర్యాంకర్‌ గాయత్రి జోడీ ఈ కీలక పోరులో ఒత్తిడికి తలవంచింది. నిరుడు లీ- షిన్‌ జంట గాయత్రి ద్వయం చేతిలో ఓడింది. కానీ ఈ సారి బేక్‌తో జతకట్టిన లీ.. భారత షట్లర్లపై తగిన ప్రతీకారం తీర్చుకుంది. డిఫెన్స్‌లో బలంగా నిలబడ్డ కొరియా జంట.. సుదీర్ఘమైన ర్యాలీలతో గాయత్రి- ట్రీసాను పరీక్షించింది. ప్రత్యర్థి ఆటను సరైన విధంగా ఎదుర్కోలేకపోయిన గాయత్రి జంట పదేపదే తప్పిదాలు చేసి తొలి గేమ్‌లో 5-11తో వెనుకబడింది. విరామం తర్వాత 9-13తో ప్రత్యర్థిని సమీపించి కాస్త పుంజుకున్నట్లే కనిపించింది. కానీ 10-14తో నిలిచిన భారత షట్లర్లు ఆ తర్వాత ఒక్క పాయింట్‌ కూడా గెలవలేకపోయారు. ప్రత్యర్థి జోడీ వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి గేమ్‌ ముగించింది. రెండో గేమ్‌లో భారత షట్లర్లకు నెట్‌ దగ్గర ఆడే అవకాశం ఇవ్వని కొరియా ద్వయం.. దూకుడు కొనసాగించి గెలుపును సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు