IND vs AUS: వాన జోరా.. పరుగుల హోరా!
శ్రీలంకపై 3-0తో సిరీస్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-0తో సిరీస్ కైవసం.. సొంతగడ్డపై వన్డేల్లో భారత్ దూకుడు ఇది. వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో జోరుమీదున్న టీమ్‌ఇండియా కంగారూ పరీక్షలో మొదటి అడ్డంకిని అధిగమించింది.
ఆసీస్‌తో రెండో వన్డే నేడు
విశాఖ మ్యాచ్‌కు వర్షం ముప్పు
సిరీస్‌పై టీమ్‌ఇండియా గురి
మధ్యాహ్నం 1.30 నుంచి
విశాఖ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి
శ్రీలంకపై 3-0తో సిరీస్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-0తో సిరీస్ కైవసం.. సొంతగడ్డపై వన్డేల్లో భారత్ దూకుడు ఇది. వన్డే ప్రపంచకప్‌కు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో జోరుమీదున్న టీమ్‌ఇండియా కంగారూ పరీక్షలో మొదటి అడ్డంకిని అధిగమించింది. అయితే శ్రీలంక, కివీస్‌ల మాదిరిగా ఆస్ట్రేలియా తేలికైన ప్రత్యర్థి కాదని తొలి వన్డేలో తేలిపోయింది. మరి రోహిత్ సేన సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా.. విశాఖపట్నంలోనే సిరీస్ ఫలితాన్ని తేల్చేస్తుందా అన్నది చూడాలి. వరుణుడు ఈ మ్యాచ్‌ను సజావుగా సాగనిస్తాడా అన్నదే సందేహం.
అచ్చొచ్చిన విశాఖ వేదికలో టీమ్‌ఇండియా ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో కష్టం మీద ఆసీస్‌ను నిలువరించిన రోహిత్ సేన.. రెండో సవాలుకు సిద్ధమైంది. ఆదివారం విశాఖలో జరిగే రెండో వన్డేలో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. వాంఖడే వన్డేలో 36 ఓవర్లలోనే ఆసీస్‌ను కుప్పకూల్చినప్పటికీ టాప్‌ఆర్డర్ వైఫల్యంతో ఛేదన టీమ్‌ఇండియాకు చాలా కష్టమైంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా నిలబడకపోయుంటే ఫలితం మరోలా ఉండేదేమో! కుటుంబ కారణాలతో తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్‌శర్మ విశాఖ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. రెండో వన్డేలో విజయంతో లెక్క సరిచేయాలని పట్టుదలగా ఉన్న ఆసీస్‌ను ఓడించడం అంత తేలిక కాకపోవచ్చు.
రోహిత్ రాకతో..: తొలి వన్డేలో టాప్‌ఆర్డర్ వైఫల్యం భారత్‌కు షాకే. ఫామ్‌లో ఉన్న కోహ్లి, శుభ్‌మన్, సూర్యకుమార్ యాదవ్ వాంఖడెలో తేలిపోయారు. ఇషాన్ కిషన్ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా నిరాశ పరిచాడు. రోహిత్ రాకతో టాప్‌ఆర్డర్ గాడిన పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్, శుభ్‌మన్ మంచి ఆరంభాన్నివ్వడం కీలకం. కోహ్లి లంకపై చూపించిన దూకుడును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. టీ20ల్లో అదరగొడుతున్న సూర్య వన్డేల్లో ఇంకా పట్టు సాధించలేకపోతున్నాడు. ఈ ఏడాది 5 వన్డేల్లో సూర్య ఒక్క అర్ధ సెంచరీ కూడా కొట్టలేదు. శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని తిరిగొస్తే సూర్యకు జట్టులో చోటు కష్టమవుతుంది. కాబట్టి అతను పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సింది. రోహిత్ కోసం ఇషాన్ తన చోటును త్యాగం చేయాల్సిందే. టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయిన రాహుల్.. తొలి వన్డేలో జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడి తన ప్రాధాన్యాన్ని చటాడు. పునరాగమనం తర్వాత సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. వాంఖడెలో బౌలర్లు అంచనాలకు మించి రాణించారు. షమి, సిరాజ్, పాండ్యల పేస్.. స్వింగ్ ఆకట్టుకున్నాయి. జడేజాకు తోడు కుల్‌దీప్ స్పిన్‌తో ఆసీస్‌కు చెక్ పెట్టారు. విశాఖ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి బౌలర్లకు ఇక్కడ అంత తేలిక కాకపోవచ్చు. స్పిన్నర్లకు మాత్రం ఇక్కడ అవకాశాలుంటాయి.
బ్యాటింగ్ మారితే..: తొలి వన్డేలో మిచెల్ మార్ష్, గ్రీన్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్ రూపంలో నలుగురు ఆల్‌రౌండర్లను బరిలో దించిన ఆసీస్ కనీసం పోరాడగలిగే స్కోరు కూడా సాధించలేదు. మార్ష్ ఇన్నింగ్స్ కూడా లేకపోయుంటే ఆసీస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదే. కెప్టెన్ స్మిత్, లబుషేన్ కూడా భారత పరిస్థితుల్లో అంచనాల్ని అందుకోలేకపోతున్నారు. ముంబయిలో వార్నర్‌కు విశ్రాంతినిచ్చిన ఆసీస్ రెండో వన్డేకు జట్టు కూర్పులో మార్పులు చేస్తుందేమో చూడాలి. బ్యాటింగ్ మెరుగుపడితే భారత్‌ను ఓడించడం కష్టమేమీ కాదని ఆసీస్ భావిస్తోంది. ఆ జట్టు బౌలర్లు మాత్రం చిన్న స్కోరును కాపాడుకోవడానికి బాగానే కష్టపడ్డారు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్, రాహుల్ (వికెట్ కీపర్), జడేజా, శార్దూల్/ ఉమ్రాన్, కుల్దీప్, సిరాజ్, షమి
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), హెడ్/వార్నర్, మార్ష్, లబుషేన్, ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, అబాట్, స్టార్క్, జంపా
పిచ్ బ్యాటర్లదే..
విశాఖ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఆదివారం కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. చిన్న బౌండరీలు కూడా బ్యాటర్లకు కలిసొస్తాయి. స్పిన్నర్లు ఇక్కడ బాగానే ప్రభావం చూపుతారు.
వర్షం ముప్పు
రెండో వన్డేకు వాన ముప్పు తప్పేలా లేదు. శుక్ర, శనివారాల్లో ఎక్కువ సమయం ఆకాశం మేఘావృతమై ఉంది. ఉదయం, సాయంత్రం జల్లులు కూడా పడ్డాయి. మైదానాన్ని గ్రౌండ్స్‌మెన్ పూర్తిగా కవర్లతో కప్పేశారు. ఆదివారం మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ పూర్తి ఓవర్లు సాగడం కష్టమే.
9
విశాఖలో 3 మ్యాచ్‌లాడి కుల్దీప్ పడగొట్టిన వికెట్లు.
265
విశాఖలో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు. రెండో ఇన్నింగ్స్‌లో అది 257
556
విశాఖలో ఆడిన ఆరు వన్డేల్లో కోహ్లి పరుగులు. సగటు 111.20. ఇక్కడ 3 శతకాలు, 2 అర్ధసెంచరీలు సాధించాడు. రోహిత్ విశాఖలో ఆడిన ఆరు వన్డేల్లో 68.40 సగటుతో 342 పరుగులు సాధించాడు.
ఇప్పటి వరకు విశాఖలో 10 వన్డేలు జరగ్గా.. భారత్ ఏడింట్లో నెగ్గి.. ఒకదాంట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దవగా.. మరొకటి టై అయింది.
విశాఖలో ఆసీస్‌తో ఆడిన ఏకైక వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
-
Sports News
Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారేమో!
-
General News
Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు