బోపన్న రికార్డు టైటిల్‌

భారత వెటరన్‌ టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మాథ్యూ ఎబ్డన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి ఇండియన్‌ వెల్స్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ దక్కించుకున్న 43 ఏళ్ల బోపన్న.. ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీ ఛాంపియన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

Published : 20 Mar 2023 02:02 IST

ఇండియన్‌ వెల్స్‌ డబుల్స్‌ ట్రోఫీ కైవసం

ఇండియన్‌ వెల్స్‌: భారత వెటరన్‌ టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మాథ్యూ ఎబ్డన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి ఇండియన్‌ వెల్స్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ దక్కించుకున్న 43 ఏళ్ల బోపన్న.. ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీ ఛాంపియన్‌గా నిలిచిన అతి పెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో బోపన్న- ఎబ్డన్‌ జోడీ 6-3, 2-6, 10-8 తేడాతో టాప్‌ సీడ్‌ వెస్లీ (నెదర్లాండ్స్‌)- నియల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌)పై గెలిచింది. తొలి సెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన బోపన్న ద్వయానికి రెండో సెట్లో చుక్కెదురైంది. కానీ పుంజుకున్న ఈ జోడీ నిర్ణయాత్మక మూడో సెట్లో గెలిచి విజేతగా నిలిచింది. ఈ విజయంతో డానియల్‌ నెస్టర్‌ (42 ఏళ్ల వయసులో 2015 సిన్సినాటి మాస్టర్స్‌ విజేత) రికార్డును బోపన్న బద్దలుకొట్టాడు. ‘‘ఇదెంతో ప్రత్యేకమైంది. ఇండియన్‌ వెల్స్‌ను అందుకే టెన్నిస్‌ స్వర్గంగా భావిస్తా. కొన్నేళ్లుగా ఇక్కడికి వస్తున్నా. జంటగా ఆడి విజయాలు సాధిస్తున్నా. మాథ్యూతో కలిసి ఇప్పుడు టైటిల్‌ నెగ్గినందుకు సంతోషంగా ఉంది. నెస్టర్‌ రికార్డును తిరగరాస్తానని అతనికి ముందే చెప్పా’’ అని బోపన్న పేర్కొన్నాడు. 2017లో మాంటెకార్లో టోర్నీలో గెలిచిన తర్వాత బోపన్నకిదే తొలి ఏటీపీ మాస్టర్స్‌ 1000 డబుల్స్‌ టైటిల్‌. మొత్తంగా అయిదోది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని