ఎదురులేని నిఖత్‌

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ దూసుకెళ్తోంది. రింగ్‌లో మెరుపులా కదులుతూ.. బలమైన పంచ్‌లతో విరుచుకుపడుతున్న ఈ తెలంగాణ అమ్మాయి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

Published : 20 Mar 2023 02:07 IST

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌
ప్రిక్వార్టర్స్‌లో అడుగు
మనీషా కూడా ముందుకు

దిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ దూసుకెళ్తోంది. రింగ్‌లో మెరుపులా కదులుతూ.. బలమైన పంచ్‌లతో విరుచుకుపడుతున్న ఈ తెలంగాణ అమ్మాయి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 50 కేజీల విభాగంలో తన రెండో బౌట్లో ఆదివారం నిఖత్‌ 5-0 తేడాతో ఆఫ్రికా ఛాంపియన్‌ బోలమ్‌ రుమేసా (అల్జీరియా)ను చిత్తుచేసింది. నిరుడు 52 కేజీల విభాగంలో టైటిల్‌ సొంతం చేసుకున్న నిఖత్‌.. ఈ సారి 50 కేజీల పోటీల్లోనూ పసిడి దిశగా సాగుతోంది. ఆమె పంచ్‌లకు ఎదురేలేకుండా పోతోంది. రుమేసాతో పోరులో ముష్ఠిఘాతాలు కురిపించిన నిఖత్‌ ఏకపక్ష విజయం అందుకుంది. ప్రత్యర్థి బలాలపై ముందే అవగాహన పెంచుకున్న ఆమె.. అందుకు తగినట్లుగా రింగ్‌లో వ్యూహాలు అమలు చేసింది. రుమేసాకు దూరంగా ఉంటూ.. అవకాశం చిక్కగానే నిఖత్‌ ఎదురు దాడి చేసింది. తొలి రౌండ్లో గట్టిపోటీ ఎదురైనా ఆమె తెలివిగా వ్యవహరిస్తూ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక రెండో రౌండ్లో పంచ్‌లతో విరుచుకుపడింది. చివరి వరకూ దూకుడు కొనసాగించి విజేతగా నిలిచింది. మరోవైపు 57 కేజీల విభాగంలో మనీషా కూడా ప్రిక్వార్టర్స్‌ చేరింది. ఆమె 5-0తో రహిమి టీనా (ఆస్ట్రేలియా)పై గెలిచింది. గతేడాది కాంస్యం గెలిచిన మనీషా ఈ సారి స్వర్ణంపై గురిపెట్టింది. రహిమితో పోరులో ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఆమె.. పంచ్‌లతో చెలరేగింది. ప్రిక్వార్టర్స్‌లో అల్వారెజ్‌ ఫాతిమా (మెక్సికో)తో నిఖత్‌, నూర్‌ ఎలీఫ్‌ (టర్కీ)తో మనీషా తలపడతారు. నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఫాతిమాపై నిఖత్‌ గెలిచింది. సోమవారం ప్రిక్వార్టర్స్‌లో లవ్లీనా (75 కేజీలు), సాక్షి (52), ప్రీతి (54) బరిలో దిగనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని