సింధు పుంజుకునేనా?

ఈ సీజన్‌లో తడబడుతూ సాగుతున్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మరో సమరానికి సిద్ధమైంది.

Published : 21 Mar 2023 03:19 IST

నేటి నుంచి స్విస్‌ ఓపెన్‌
బరిలో ప్రణయ్‌, లక్ష్య, శ్రీకాంత్‌ కూడా

బాసెల్‌: ఈ సీజన్‌లో తడబడుతూ సాగుతున్న భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మరో సమరానికి సిద్ధమైంది. మంగళవారం ఆరంభం కానున్న స్విస్‌   ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఉత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతోంది. ఇటీవల ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఈ ఏడాది వివిధ టోర్నీల్లో తొలి రౌండ్‌ దాటలేకపోయిన ఆమె.. ఇప్పుడీ స్విస్‌ ఓపెన్‌లో పుంజుకోవాలని చూస్తోంది. స్థానిక క్రీడాకారిణి జెంజీరాతో మ్యాచ్‌తో ఆమె పోరు ఆరంభించనుంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్య సేన్‌, కిదాంబి శ్రీకాంత్‌ కూడా తిరిగి గాడినపడడంపై దృష్టి సారించారు. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోనే ఇంటి ముఖం పట్టిన ప్రణయ్‌కు స్విస్‌ ఓపెన్‌లోనూ కఠిన సవాలు ఎదురు కానుంది. ఈ అయిదో సీడ్‌ ఆటగాడు తొలి రౌండ్లో 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రజత విజేత షి యుకి (చైనా)తో తలపడనున్నాడు. లీ చక్‌ యూ (హాంకాంగ్‌)తో ఎనిమిదో సీడ్‌ లక్ష్య, వెంగ్‌ హాంగ్‌ (చైనా)తో కిదాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్లో పోటీపడనున్నారు. వరుసగా రెండో ఏడాది ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌లో సెమీస్‌ చేరిన గాయత్రి- ట్రీసా జోడీ ఈ టోర్నీలో రెండో సీడ్‌గా రంగంలో దిగుతోంది. పురుషుల డబుల్స్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌- చిరాగ్‌ జంట కూడా సత్తాచాటాలని చూస్తోంది. అర్జున్‌- ధ్రువ్‌, కృష్ణ ప్రసాద్‌- విష్ణువర్ధన్‌, అశ్విని భట్‌- శిఖా గౌతమ్‌ జోడీలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు