క్వార్టర్స్‌లో లవ్లీనా, సాక్షి

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ల దూకుడు కొనసాగుతోంది.

Published : 21 Mar 2023 03:19 IST

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

దిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ల దూకుడు కొనసాగుతోంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ పోటీల్లో లవ్లీనా బోర్గోహెయిన్‌, సాక్షి చౌదరి పతకాల దిశగా మరో అడుగు వేశారు. ఈ ఇద్దరూ క్వార్టర్స్‌ చేరారు. సోమవారం 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌లో లవ్లీనా 5-0 తేడాతో వెనెసా ఓర్టిజ్‌ (మెక్సికో)ను చిత్తుచేసింది. ఈ బరువు విభాగంలో మొదటి సారి పోటీపడుతున్న లవ్లీనాకు తొలి బౌట్లో బై లభించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో తొలిసారి రింగ్‌లో అడుగుపెట్టిన ఆమె.. ఆరంభంలో రక్షణాత్మకంగా వ్యవహరించింది. ప్రత్యర్థి తనకంటే తక్కువ ఎత్తు ఉండడంతో దూరం నుంచే పంచ్‌లు విసరాల్సి వచ్చింది. వ్యూహాలను సమర్థంగా అమలు చేసి విజేతగా నిలిచింది. 52 కేజీల ప్రిక్వార్టర్స్‌లో సాక్షి కూడా 5-0తో జజీరా (కజకిస్థాన్‌)పై ఏకపక్ష విజయం సాధించింది. ప్రత్యర్థికి ఎదురు దాడి చేసే అవకాశం ఇవ్వకుండా సాక్షి పెత్తనం చలాయించింది. పంచ్‌ విసరగానే దూరం జరిగి.. మళ్లీ ఛాన్స్‌ తీసుకుని దాడి కొనసాగించింది. రింగ్‌లో దూకుడుగా కదులుతూ ముష్టిఘాతాలు కురిపించింది. మరోవైపు ప్రీతి పోరాటం ముగిసింది. 54 కేజీల ప్రిక్వార్టర్స్‌లో ఆమె 3-4తో జిట్‌పాంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పోరాడి ఓడింది. తొలి రౌండ్లో పంచ్‌లతో చెలరేగిన 19 ఏళ్ల ప్రీతి 4-1తో ఆధిక్యంలో నిలిచింది. కానీ తర్వాతి రెండు రౌండ్లలో ఆమె శక్తిమేరకు ప్రయత్నించినా ప్రత్యర్థి చేతిలో తలవంచక తప్పలేదు. చివరకు సమీక్షలో ఫలితాన్ని తేల్చగా.. ప్రీతికి నిరాశే మిగిలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని