దిల్లీ ధనాధన్‌

మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరి అగ్రస్థానంపై కన్నేసిన ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌లో ప్రస్తుతానికి దిల్లీదే పైచేయి!  సోమవారం ముంబయిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఆ జట్టు ఘన విజయాన్ని అందుకుంది.

Updated : 21 Mar 2023 06:58 IST

ముంబయికి మరో ఓటమి
మెరిసిన కాప్సీ, షెషాలి

మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరి అగ్రస్థానంపై కన్నేసిన ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌లో ప్రస్తుతానికి దిల్లీదే పైచేయి!  సోమవారం ముంబయిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఆ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. మొదట బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన దిల్లీ.. బ్యాటింగ్‌లో చెలరేగి గెలుపు సొంతం చేసుకుంది. మరిజేన్‌ కాప్‌, షెఫాలివర్మ, కాప్సీ, లానింగ్‌ జట్టు విజయంలో కీలకమయ్యారు. ఈ గెలుపుతో రన్‌రేట్‌ను మెరుగుపరుచుకున్న దిల్లీ (1.978) పాయింట్ల పట్టికలో ముంబయి (1.725)ని వెనక్కి నెట్టి ముందంజలో నిలిచింది. ఈ రెండు జట్లు తలో ఏడు మ్యాచ్‌లు ఆడి అయిదు చొప్పున విజయాలు సాధించాయి. దిల్లీ, ముంబయి ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది.

ముంబయి

దిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. మరో స్ఫూర్తిదాయక విజయంతో ముంబయికి ఈ లీగ్‌లో రెండో ఓటమి రుచి చూపించింది. మొదట ముంబయి 109/8కే పరిమితం అయింది. పూజ వస్త్రాకర్‌ (26; 19 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌. మరిజేన్‌ కాప్‌ (2/13), శిఖా (2/21), జొనాసెన్‌ (2/25) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో అలీస్‌ కాప్సీ (38 నాటౌట్‌; 17 బంతుల్లో 1×4, 5×6), షెఫాలివర్మ (33; 15 బంతుల్లో 6×4, 1×6), లానింగ్‌ (32 నాటౌట్‌; 22 బంతుల్లో 4×4, 1×6) మెరుపులతో దిల్లీ 9 ఓవర్లలో ఒకే వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

దంచేశారు: స్వల్ప ఛేదనలో ఆరంభం నుంచి దిల్లీ చెలరేగింది. షెఫాలి, లానింగ్‌ పోటీపడి షాట్లు ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఒక ఓవర్లో షెఫాలి బాదితే.. మరో ఓవర్లో లానింగ్‌ బ్యాట్‌ ఝుళిపించింది. దీంతో 4 ఓవర్లలోనే స్కోరు 50 పరుగుల మార్క్‌ అందుకుంది. ఈ ఊపులో షెఫాలి ఔటైనా.. దిల్లీ మాత్రం తగ్గలేదు. లానింగ్‌కు జత కలిసిన కాప్సీ సిక్స్‌లతో రెచ్చిపోయింది. హేలీ మాథ్యూస్‌ వేసిన ఏడో ఓవర్లో ఆమె మూడు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో  22 పరుగులు వచ్చాయి. సమీకరణం (78 బంతుల్లో 21) ఇంకా తేలిగ్గా మారింది. ఆ తర్వాతా కాప్సీ మెరుపులు కొనసాగడంతో దిల్లీ 66 బంతులు ఉండగానే సులభంగా లక్ష్యాన్ని అందుకుంది.

ముంబయి తడబాటు: అంతకుముందు ముంబయి ఇన్నింగ్స్‌ అంతా తడబాటే. ఆ జట్టు ఆరంభమే పేలవం. కాప్‌, శిఖా విజృంభించడంతో 7 ఓవర్లలో 23/4తో కష్టాల్లో పడిపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాటు మెరుపు ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిని దిల్లీ కట్టిపడేసింది. ఈ స్థితిలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (23), పూజతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. పూనమ్‌ వేసిన పదో ఓవర్లో హర్మన్‌ప్రీత్‌ ఒక ఫోర్‌.. పూజ ఫోర్‌, సిక్స్‌ బాదడంతో స్కోరులో కదలిక వచ్చింది. జోరు మీద కనిపించిన పూజను జొనాసెన్‌ ఔట్‌ చేయడంతో ముంబయికి మళ్లీ బ్రేక్‌ పడింది. స్కోరింగ్‌ కూడా తగ్గిపోయింది. పరుగులు చేసే ఒత్తిడిలో హర్మన్‌ కూడా వెనుదిరగడంతో ఆ జట్టు 15 ఓవర్లకు 74/6తో కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ బ్యాట్‌ ఝుళిపించిన అమన్‌జ్యోత్‌ (19), వాంగ్‌ (23) స్కోరును 100 పరుగులు దాటించారు.

ముంబయి ఇన్నింగ్స్‌: యాస్తిక (సి) తానియా (బి) కాప్‌ 1; హేలీ మాథ్యూస్‌ (సి) జెమీమా (బి) శిఖా 5; నాట్‌ సీవర్‌ (బి) కాప్‌ 0; హర్మన్‌ప్రీత్‌ (సి) జెమీమా (బి) శిఖా 23; అమేలియా కెర్‌ (సి) తానియా (బి) అరుంధతి 8; పూజ (సి) రాధ (బి) జొనాసెన్‌ 26;   ఇసీ వాంగ్‌ (సి) లానింగ్‌ (బి) జొనాసెన్‌ 23; అమన్‌జ్యోత్‌ రనౌట్‌ 19; హుమేరా నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 109; వికెట్ల పతనం: 1-6, 2-6, 3-10, 4-21, 5-58, 6-74, 7-104, 8-109; బౌలింగ్‌: మరిజేన్‌ కాప్‌ 4-0-13-2; అలీస్‌ కాప్సీ 1-0-4-0; శిఖా 4-0-21-2; జెస్‌ జొనాసెన్‌ 4-0-25-2; అరుంధతి 3-0-10-1; రాధ 3-0-18-0; పూనమ్‌ 1-0-18-0

దిల్లీ ఇన్నింగ్స్‌: లానింగ్‌ నాటౌట్‌ 32; షెఫాలి వర్మ (స్టంప్డ్‌) యాస్తిక (బి) హేలీ మాథ్యూస్‌ 33; అలిస్‌ కాప్సీ నాటౌట్‌ 38; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (9 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 110; వికెట్ల పతనం: 1-56; బౌలింగ్‌: నాట్‌ సీవర్‌ 2-0-21-0; ఇసీ వాంగ్‌ 2-0-20-0; సైకా ఇషాక్‌ 2-0-36-0; హేలీ మాథ్యూస్‌ 2-0-27-1; అమేలియా కెర్‌ 1-0-2-0


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని