భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నాం.. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నామని.. ఆ ప్రయత్నాలకు దాదాపు ఒక రూపు వచ్చిందని కోచ్‌ భారత్‌ క్రికెట్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు.

Updated : 22 Mar 2023 03:34 IST

చెన్నై: స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ కోసం భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నామని.. ఆ ప్రయత్నాలకు దాదాపు ఒక రూపు వచ్చిందని కోచ్‌ భారత్‌ క్రికెట్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా ఇప్పటికే స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌తో మూడేసి వన్డేలు ఆడిన భారత్‌.. ఆస్ట్రేలియాతోనూ అన్నే వన్డేల్లో తలపడుతోంది. ‘‘ఆస్ట్రేలియాతో మూడో వన్డే ముగిసిన తర్వాత ప్రపంచకప్‌లో భారత్‌ మేళవింపుపై మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నాం.  ఆ స్పష్టత ఆధారంగానే భవిష్యత్‌లో జట్టు ఎంపిక కూడా ఉంటుంది. స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ల్లో భిన్నమైన మేళవింపులతో తుది జట్లను ఆడించాం. ఎందుకంటే వన్డే ప్రపంచకప్‌లోనూ అవసరమైతే జట్టు కూర్పును పరిస్థితులకు తగ్గట్టు మార్చుకోవచ్చు. ఒకసారి నలుగురు పేసర్లు.. మరోసారి ముగ్గురు స్పిన్నర్లను కూడా ప్రపంచకప్‌ తుది జట్టును ఆడించాలనే ఆలోచన కూడా ఉంది. ఇప్పటికే 17-18 మంది ఆటగాళ్లు మా జాబితాలో ఉన్నారు. కానీ కొంతమంది కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. వాళ్లు కోలుకునే దాన్ని బట్టి జట్టు కూర్పు విషయంలో ఒక నిర్ణయానికొస్తాం. స్వదేశంలో టీమ్‌ఇండియా ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ఆడే కొన్ని మ్యాచ్‌ల్లోనే కుర్రాళ్ల సత్తా చాటాల్సి ఉంటుంది’’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. శ్రేయస్‌కు గాయం కావడం దురదృష్టకరమని.. సూర్యకు వన్డేల్లో మరిన్ని అవకాశాలు ఇస్తామని ద్రవిడ్‌ చెప్పాడు. ‘‘శ్రేయస్‌కు గాయం కావడం దురదృష్టకరం. నంబర్‌ 4 స్థానంలో ఎక్కువ అవకాశాలు ఇచ్చిన బ్యాటర్లలో అతడొకడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ డకౌట్‌ కావడం ఆందోళన కలిగించట్లేదు. అతడు వన్డేల కన్నా టీ20లు ఎక్కువ ఆడాడు. అతడికి ఈ ఫార్మాట్లో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి’’ అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని