దిల్లీదే కిరీటం

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో తొలి దశకు తెరపడింది. ముంబయి, దిల్లీ జట్లతో దోబూచులాడిన అగ్రస్థానం.. చివరికి దిల్లీనే వరించింది. లీగ్‌ దశ ఆఖరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ఘనవిజయం సాధించిన క్యాపిటల్స్‌..

Published : 22 Mar 2023 02:24 IST

అగ్రస్థానంతో ఫైనల్లోకి ప్రవేశం
ముంబయి, యూపీ మధ్య ఎలిమినేటర్‌

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో తొలి దశకు తెరపడింది. ముంబయి, దిల్లీ జట్లతో దోబూచులాడిన అగ్రస్థానం.. చివరికి దిల్లీనే వరించింది. లీగ్‌ దశ ఆఖరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ఘనవిజయం సాధించిన క్యాపిటల్స్‌.. అగ్రస్థానంతో నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడించి, దిల్లీతో సమానంగా ఆరు విజయాలు సాధించినప్పటికీ.. నెట్‌ రన్‌రేట్‌లో వెనుకబడటంతో ముంబయి రెండో స్థానానికి పరిమితం కాక తప్పలేదు. మూడో స్థానంలో నిలిచిన యూపీతో ఆ జట్టు శుక్రవారం ఎలిమినేటర్‌లో తలపడనుంది. ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది.

హిళల ప్రిమియర్‌ లీగ్‌లో లీగ్‌ దశను దిల్లీ క్యాపిటల్స్‌ అగ్రస్థానంతో ముగించింది. అలీస్‌ కాప్సీ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టడంతో యూపీ వారియర్స్‌ను ఓడించి.. రన్‌రేట్‌లో ముంబయి (1.711)ని వెనక్కి నెట్టిన దిల్లీ (1.856) నంబర్‌వన్‌ జట్టుగా నిలిచింది. మంగళవారం దిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీపై నెగ్గింది. మొదట యూపీ 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. తాలియా మెక్‌గ్రాత్‌ (58 నాటౌట్‌; 32 బంతుల్లో 8×4, 2×6) టాప్‌ స్కోరర్‌. అలీసా హీలీ (36; 34 బంతుల్లో 4×4, 1×6) కూడా రాణించింది. అలీస్‌ కాప్సీ (3/26), రాధ (2/28) ప్రత్యర్థిని కట్టడి చేశారు. లక్ష్యాన్ని దిల్లీ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. మెగ్‌ లానింగ్‌ (39; 23 బంతుల్లో 5×4, 2×6)తో పాటు కాప్సీ (34; 31 బంతుల్లో 4×4, 1×6), మరిజేన్‌ కాప్‌ (34 నాటౌట్‌; 31 బంతుల్లో 4×4, 1×6) సత్తా చాటారు.

కాప్సీ, లానింగ్‌ మెరుపులు: రన్‌రేట్‌లో ముంబయిని దాటి అగ్రస్థానం సాధించాలంటే 19.4 లేదా అంతకంటే తక్కువ ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన దిల్లీ.. శుభారంభమే చేసింది. కెప్టెన్‌ లానింగ్‌, షెఫాలివర్మ (21) పోటీపడి ఆడడంతో స్కోరుబోర్డు మెరుపులా సాగింది. తొలి ఓవర్లోనే 20 పరుగులు రాబట్టిన దిల్లీ.. పవర్‌ ప్లే ఆఖరికి 67/1తో దూసుకెళ్లింది. తర్వాత షెఫాలి వికెట్‌ కోల్పోయింది. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ఒకే ఓవర్లో జెమీమా (3), లానింగ్‌ వికెట్లు తీసి దిల్లీని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసింది. అయితే కాప్సీ దూకుడుగా ఆడడంతో క్యాపిటల్స్‌కు ఇబ్బంది లేకపోయింది. ఎకిల్‌స్టోన్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన కాప్సీ.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించి దిల్లీని లక్ష్యానికి చేరువ చేసింది. తర్వాత కాప్సీ ఔటైనా.. దూకుడుగా ఆడిన కాప్‌ దిల్లీని విజయతీరాలకు చేర్చింది. ఆ జట్టు మరో 13 బంతులు ఉండగానే నెగ్గింది.

మొదట అలీసా.. ఆపై తాలియా: అంతకుముందు యూపీ గౌరవప్రదమైన స్కోరు చేసిందంటే తాలియా మెక్‌గ్రాత్‌, అలీసా హీలీలే కారణం. ఆరంభంలో అలీసా ఇన్నింగ్స్‌ను నిలబెడితే.. ధనాధన్‌ ఆటతో తాలియా మెరుపు ముగింపు ఇచ్చింది. 4 ఓవర్లకు 30/0తో యూపీ బాగానే ప్రారంభించినా.. ఆ తర్వాత తడబడింది. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల కష్టంగా వచ్చాయి. కానీ హీలీ అవకాశం దొరికినప్పుడల్లా బ్యాట్‌ ఝుళిపించి స్కోరింగ్‌ రేట్‌ మరీ పడిపోకుండా చూసింది. అయిదే రాధ బౌలింగ్‌లో హీలీ ఔట్‌ కావడంతో వారియర్స్‌కు దెబ్బ తగిలింది. స్కోరు మళ్లీ తగ్గింది. ఈ స్థితిలో అరుంధతి వేసిన 14వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చిన తాలియా.. ఆ తర్వాతా జోరు కొనసాగించింది. సిక్స్‌లు, ఫోర్లతో స్కోరును పరుగులెత్తించింది. దీంతో 18 ఓవర్లకు 105/6తో ఉన్న యూపీ.. చివరి రెండు ఓవర్లలో 33 పరుగులు రాబట్టి సంతృప్తికరంగా ఇన్నింగ్‌ను ముగించింది.

యూపీ ఇన్నింగ్స్‌: అలీసా హీలీ (స్టంప్డ్‌) తానియా (బి) కాప్సీ 36; శ్వేత (సి) జొనాసెన్‌ (బి) రాధ 19; సిమ్రన్‌ (సి) జెమీమా (బి) రాధ 11; తాలియా నాటౌట్‌ 58; కిరణ్‌ (స్టంప్డ్‌) తానియా (బి) జొనాసెన్‌ 2; దీప్తి (స్టంప్డ్‌) తానియా (బి) కాప్సీ 3; ఎకిల్‌స్టోన్‌ (స్టంప్డ్‌) తానియా (బి) కాప్సీ 0; అంజలి నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 138; వికెట్ల పతనం: 1-30, 2-63, 3-71, 4-91, 5-104, 6-105; బౌలింగ్‌: మరిజేన్‌ కాప్‌ 4-0-24-0; శిఖా పాండే 2-0-16-0; జెస్‌ జొనాసెన్‌ 4-0-24-1; రాధ యాదవ్‌ 4-0-28-2; అరుంధతి 2-0-19-0; అలీస్‌ కాప్సీ 4-0-26-3

దిల్లీ ఇన్నింగ్స్‌: మెగ్‌ లానింగ్‌ (సి) సిమ్రన్‌ (బి) షబ్నిమ్‌ 39; షెఫాలి (సి) ఎకిల్‌స్టోన్‌ (బి) యషశ్రీ 21; జెమీమా ఎల్బీ (బి) షబ్నిమ్‌ 3; కాప్‌ నాటౌట్‌ 34; అలీస్‌ కాప్సీ (స్టంప్డ్‌) హీలీ (బి) ఎకిల్‌స్టోన్‌ 34; జొనాసెన్‌ రనౌట్‌ 0; అరుంధతి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (17.5 ఓవర్లలో 5 వికెట్లకు) 142; వికెట్ల పతనం: 1-56, 2-67, 3-70, 4-130, 5-136; బౌలింగ్‌: షబ్నిమ్‌ 3-0-29-2; యషశ్రీ 3-0-26-1; సోఫీ ఎకిల్‌స్టోన్‌ 4-0-25-1; అంజలి 2-0-15-0; దీప్తి 3.5-37-0; పార్శవి 2-0-9-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని