Ind Vs Aus: ఆ బౌల్డ్‌.. ఈ రనౌట్‌

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అలెక్స్‌ కేరీని కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేసిన తీరు, భారత్‌ ఇన్నింగ్స్‌లో అక్షర్‌ను రనౌట్‌ చేసిన స్మిత్‌ ఫీల్డింగ్‌ విన్యాసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Published : 23 Mar 2023 11:20 IST

చెన్నై: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అలెక్స్‌ కేరీని కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేసిన తీరు, భారత్‌ ఇన్నింగ్స్‌లో అక్షర్‌ను రనౌట్‌ చేసిన స్మిత్‌ ఫీల్డింగ్‌ విన్యాసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో అప్పటికే క్రీజులో కుదురుకున్న కేరీ చక్కగా ఆడుతున్నాడు. 39వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన కుల్‌దీప్‌.. తొలి బంతికే అతణ్ని పెవిలియన్‌ చేర్చాడు. మిడిల్‌, లెగ్‌ స్టంప్‌ మధ్యలో వేసిన లెగ్‌కట్టర్‌ గిర్రున తిరిగి ఆఫ్‌స్టంప్‌ను ముద్దాడింది. డిఫెండ్‌ చేసేందుకు కేరీ ప్రయత్నించినా.. అతని బ్యాట్‌ను దాటి వెళ్లి మరీ స్టంప్స్‌ను తాకింది. దీంతో కేరీతో పాటు కుల్‌దీప్‌ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇక భారత బ్యాటింగ్‌లో స్మిత్‌ అద్భుత ఫీల్డింగ్‌, వికెట్‌ కీపర్‌ కేరీ విన్యాసంతో అక్షర్‌ వెనుదిరగాల్సి వచ్చింది. స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌ అయిదో బంతిని మిడ్‌వికెట్‌ వైపు పంపించిన అక్షర్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. కానీ తన ఎడమవైపు డైవ్‌ చేసిన స్మిత్‌ బంతిని ఆపాడు. అది గమనించిన కోహ్లి.. అక్షర్‌ను వెనక్కి పంపించాడు. అప్పటిలోపే డైవ్‌ చేసిన స్థితిలోనే ఉండి బంతిని నేలపై నుంచే వికెట్ల వైపు స్మిత్‌ విసిరాడు. దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన కేరీ ఆ బంతిని పట్టుకుని డైవ్‌ చేసి మరీ స్టంప్స్‌ను ఎగరకొట్టాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు